Haqqani Network leaders
-
పాక్ కనుసన్నల్లో...
పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్టుగా అఫ్గాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై తాలిబన్లు, హక్కానీలు ఒక అవగాహనకు రాలేక కొట్టుకు చస్తుంటే పాకిస్తాన్ తలదూర్చి అన్నీ తనకి అనుకూలంగా మార్చేసుకుంది. అంతర్జాతీయ ఉగ్రవాదులు, వారి తలపై రివార్డులు ఉన్న వారు గ్వాంటనామా జైళ్లలో మగ్గి వచ్చిన వారితో ప్రభుత్వాన్ని నింపేసింది. కొత్త సర్కార్ భారత్‌కు ఎలా ఎదురు దెబ్బగా మారింది ? అఫ్గానిస్తాన్‌లో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వాన్ని చూస్తే అడుగడుగునా పాకిస్తాన్ ముద్ర స్ఫష్టంగా కనిపిస్తుంది. తాలిబన్లు, హక్కానీల మధ్య నెలకొన్న విభేదాల్ని పరిష్కరించడానికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ ఫయీజ్ హమీద్ స్వయంగా కాబూల్‌కి తరలివచ్చి మూడు రోజులు మకాం వేశారు. పక్కా స్క్రీన్‌ప్లేతో రాత్రికి రాత్రి అధికార రేసులో ఉన్నవారి పేర్లన్నీ మార్చేశారు. దోహాలో భారత్‌తో సహా అంతర్జాతీయ దేశాలతో శాంతి చర్చలు జరిపిన వారిని తెలివిగా పక్కకు తప్పించారు. ప్రధానిగా ఉగ్రవాది ముల్లా మొహమ్మద్ హసన్ అఖుంద్‌ను నియమించడంలోనూ, తమ నియంత్రణలో ఉండే హక్కానీ నెట్‌వర్క్‌కు చెందిన పలువురు నాయకులకు పదవులు ఇప్పించడంలోనూ పాక్ విజయం సాధించింది. భారత్‌పై దాడులు చేసిన హక్కానీలకు కీలక పదవులు అఫ్గాన్ కొత్త ప్రభుత్వంతో తమ పంతం నెగ్గించుకొని కీలక పదవులు సాధించింది మాత్రం హక్కానీ గ్రూపే. ఈ సంస్థ అధినేత సిరాజుద్దీన్ హక్కానీ అంతర్గత వ్యవహారాల మంత్రిగా నియమించారంటేనే అక్కడ ఉన్నది ఐఎస్ఐ ప్రభుత్వమేనని అవగతమవుతుంది. పాకిస్తాన్‌లోని నార్త్ వజరిస్తాన్లో అల్‌కాయిదాతో ఉగ్రవాద సంస్థతో సిరాజుద్దీన్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. 2008లో కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయంపై జరిగిన దాడుల వెనుక హక్కానీల హస్తం ఉంది. ఈ దాడుల్లో 58 మంది మరణించారు. భారతీయులపైనా, భారత దేశ ప్రయోజనాలపైనా 2009, 2010లో కూడా ఈ సంస్థకు చెందిన వారు దాడులకు తెగబడుతూనే ఉన్నారు. అలాంటి సంస్థను నడిపిస్తున్న సిరాజుద్దీన్ హక్కానీ చేతిలో శాంతి భద్రతలతో పాటుగా ప్రావిన్స్‌లకు గవర్నర్లను నియమించే అధికారాలు కూడా ఉన్నాయి. సిరాజుద్దీన్ హక్కానీపై అమెరికా ఇప్పటికే అంతర్జాతీయ ఉగ్రవాది అని ముద్రవేయడంతో పాటు అతని తలపై కోటి డాలర్ల అవార్డు కూడా ప్రకటించింది. శరణార్థుల మంత్రి ఖలీల్ హక్కానీ కూడా ఉగ్రవాదే. అల్‌కాయిదా సంస్థ తరఫునే అతను పని చేస్తుంటాడు. భారత్ రాయబారితో చర్చించాడని.. అమెరికాతో దోహాలో శాంతి చర్చలు జరిపి, అందరి దృష్టిలో పడిన ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ ప్రాధాన్యాన్ని తగ్గించారు. వాస్తవానికే ఆయనే ప్రభుత్వాధినేత అవుతారని అనుకున్నారు. ఆఖరి నిమిషంలో ఆయనకు బదులుగా హసన్ వచ్చి చేరారు. ఇక దోహా చర్చల్లో బరాదర్‌తో పాటు పాల్గొన్న షేర్ మొహ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్ విదేశాంగ మంత్రి రేసులో ఉండేవారు. కానీ ఖతర్‌లో భారత రాయబారి దీపక్ మిట్టల్‌ను ఆయన ఆగస్టు 31న కలుసుకున్న విషయం బయటకు వచ్చింది. భారత ప్రతినిధితో చర్చించడమే మహా పాపమైనట్టుగా అతనిని కూడా ప్రభుత్వం నుంచి తప్పించారు. సమ్మిళిత సర్కార్ ఎక్కడ? అమెరికా నుంచి సంకీర్ణ బలగాలు వెనక్కి వెళ్లడానికి ముందు సమాజంలో అన్ని వర్గాలను కలుపుకొని పోతూ సమ్మిళిత సర్కార్‌ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ పాక్ ప్రమేయంతో ఆ హామీని తుంగలో తొక్కేశారు. ముందే ఊహించినట్టుగా అఫ్గాన్ ప్రభుత్వంలో మహిళలకి చోటు దక్కలేదు. ఇక 33 మంది మంత్రుల్లో పాస్తూన్ తెగకు చెందిన వారు ముగ్గురు మాత్రమే ఉన్నారు. పాక్ తన అడుగులకి మడుగులొత్తే వారినే ప్రభుత్వంలో చేర్చింది. అమెరికాలోని గ్వాంటనామా జైళ్లలో మగ్గిన వారికీ ప్రభుత్వంలో చోటు లభించింది. సమాచార సాంస్కృతిక మంత్రి ఖైరుల్లా ఖైర్ఖ్వా, ఇంటెలిజెన్స్ చీఫ్ అబ్దుల్ హక్ వసీక్, సరిహద్దు వ్యవహారాల మంత్రి ముల్లా నూరుల్లా నూరీలు ఒకప్పుడు గ్వాంటనామా జైళ్లలో మగ్గి వచ్చిన వారే. ఇలా ఉగ్రవాదులతో నిండిపోయిన ఈ ప్రభుత్వంతో భారత్ ఎలాంటి తలనొప్పులు ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
Afghanistan: అధికారం కోసం హక్కానీ, బరాదర్ పోరు
కాబూల్: అఫ్గనిస్తాన్‌లో అధికారం ఎవరు చేపట్టనున్నారనే దానిపై గందరగోళం నెలకొంది. ముల్లా బరాదర్‌తో ప్రభుత్వాన్ని పంచుకోవటానికి హక్కానీ నెట్వర్క్ సిద్దంగా లేనట్లు సమాచారం. హక్కానీ గ్రూపునకు పాకిస్తాన్ మద్దతు ఉన్న సంగతి తెలిసిందే. ఈ గ్రూపు అతి సాంప్రదాయవాద సున్నీ పస్తున్ ప్రభుత్వం వైపు మొగ్గుచూపుతోంది. దోహ శాంతి చర్చల్లో తాలిబన్ సహ వ్యవస్థాపకుడు, రాజకీయ విభాగం చీఫ్ ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. (చదవండి: అఫ్గానిస్తాన్ కొత్త అధ్యక్షుడిగా బరాదర్?) అంతర్జాతీయ సమాజం ఆమోదం పొందేలా మైనారిటీలు ప్రభుత్వంలో భాగం కావాలని బరదార్ కోరుకుంటున్నారు. కానీ, హక్కానీ అధినేత, తాలిబన్ల ఉప నాయకుడు సిరాజుద్దీన్ అతని టెర్రరిస్ట్ మిత్రులు మాత్రం ఎవరితోనూ ప్రభుత్వాన్ని పంచుకోవటాని ఇష్టపడటం లేదు. నూటికి నూరు శాతం తాలిబన్ ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారు. తాము కాబూల్‌ని గెలుచుకున్నామని, అఫ్గన్ రాజధానిపై ఆధిపత్యం కలిగిఉన్నామని, వెనక్కు తగ్గాలని బరాదర్‌ను కోరారు. కాగా, బరాదర్ ప్రభుత్వాధినేతగా శనివారమే అఫ్గన్‌లో ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంది. కానీ, చర్చలు ఇంకా పూర్తి కాకపోవడంతో వచ్చే వారం ఏర్పాటు చేస్తామని తాలిబన్లు స్పష్టం చేశారు. -
తాలిబన్లతో కర్జాయ్ చర్చలు
కాబూల్: తాలిబన్ల నేతృత్వంలో అఫ్గానిస్తాన్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు దిశగా చర్చలు వేగం పుంజుకున్నాయి. తాలిబన్ సీనియర్ నాయకుడు, హక్కాని నెట్‌వర్క్‌కు చెందిన అనాస్ హక్కానీ బుధవారం అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌తో సమావేశమయ్యారు. గత ప్రభుత్వంలో కీలకభూమిక పోషించిన అబ్దుల్లా అబ్దుల్లా కూడా ఈ భేటీకి హాజరయ్యారు. శాంతియుతంగా అధికార బదిలీ జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరగాలనే ఉద్దేశంతో కర్జాయ్ సంప్రదింపులకు నేతృత్వం వహిస్తున్నారు. అనాస్‌తో భేటీ ప్రాథమిక చర్చల్లో భాగమని కర్జాయ్ ప్రతినిధి వెల్లడించారు. తాలిబన్ల రాజకీయ విభాగం సీనియర్ నేత ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌తో తదుపరి కీలకచర్చలకు ఇది ఉపకరిస్తుందని తెలిపారు. అన్ని పక్షాలను కలుపుకొని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తాలిబన్లు ప్రకటించిన విషయం తెలిసిందే. యూఏఈలో అష్రాఫ్ ఘనీ తాలిబన్లు కాబూల్‌లోకి ప్రవేశించడంతో ఆదివారం దేశం వదిలి పారిపోయిన అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆశ్రయం కల్పించింది. మానవతా దృక్పథంతో ఘనీ, ఆయన కుటుంబాన్ని శరణార్థులుగా అనుమతించా మని యూఏఈ విదేశాంగ శాఖ బుధవారం తెలిపింది. అయితే యూఏఈలో ఎక్కడ తలదాచుకుంటున్నారనే విషయాన్ని వెల్లడించలేదు. తొలుత ఆయన తజకిస్తాన్‌కు పరారైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. -
ఆ ఐదుగుర్ని పట్టిస్తే రూ.182 కోట్లు!
వాషింగ్టన్: ఆప్ఘనిస్తాన్‌లో విధ్వంసం సృష్టిస్తున్న హక్కానీ ఉగ్రవాద నెట్‌వర్క్‌ను తుదముట్టించేందుకు అమెరికా భారీ మొత్తంలో పారితోషికాన్ని ప్రకటించింది. పాకిస్థాన్‌కు చెందిన కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ హక్కానీ అగ్రనేతల అయిదుగురి ఆచూకీ చెబితే సుమారు రూ.182 కోట్ల నగదును నజరానాగా ఇస్తామని తెలిపింది. హక్కానీ నెట్‌వర్క్‌ను నడిపిస్తున్న సిరాజుద్దీన్ హక్కానీ జాడ తెలిపినవారికి రూ.60 కోట్ల బహుమానాన్ని ప్రకటించింది. కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయంపై జరిగిన దాడుల్లోనూ హక్కానీ హస్తం ఉంది. అజీజ్ హక్కానీ, ఖలీల్ అల్ రహమాన్ హక్కానీ, యాహ్యా హక్కానీ, అబ్దుల్ రువూఫ్ జకీర్లపై సుమారు రూ.122 కోట్ల పారితోషికం ప్రకటించారు. ముఠా నాయకుడిగా వ్యవహరిస్తున్న సిరాజుద్దీన్ హక్కానీ తలపై గతంలో రూ.30 కోట్ల పారితోషికం ఉండగా, తాజాగా రూ.60 కోట్లకు పెంచినట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. రివార్డ్స్ ఫర్ జస్టిస్ ప్రోగ్రాం కింద అమెరికా విదేశాంగశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తాలిబన్ అనుబంధ సంస్థ అయిన హక్కానీ నెట్‌వర్క్‌ను 2012లో ఉగ్రవాద సంస్థగా అమెరికా, ఐక్యరాజ్యసమితి గుర్తించాయి. హక్కానీ గ్రూప్ స్థాపకుడు జలాలుద్దీన్ హక్కానీ కొడుకు అయిన సిరాజుద్దీన్ 2000లో కాబూల్‌లోని సెరెనా హోటల్ వద్ద జరిగిన ఉగ్రవాద దాడి తమ పనేనని అంగీకరించారు. ఆ దాడిలో ఓ అమెరికా పౌరుడితోపాటు ఐదుగురు చనిపోయారు.