మన్నవరమా ? వాల్మీకిపురమా ?
సాక్షి, చిత్తూరు: ఇన్ఫరమేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్(ఐటీఐఆర్) ఏర్పాటుకు చిత్తూరు జి ల్లాలో స్థల పరిశీలనకు హైదరాబాద్ నుంచి గురువారం ఉన్నతస్థాయి కమిటీ రానుంది. ఈ కమిటీ సీఎం నియోజకవర్గంలోని వాల్మీకిపురం-కలికిరి మధ్యలో ఉన్న ఇండస్ట్రియల్ పార్కు స్థలాన్ని పరిశీలించనుంది. అలాగే మన్నవరం వద్ద ఏర్పేడు సమీపంలో స్థల పరిశీలన చేయనుంది. ఇందుకోసం ఐటీ శాఖ నుంచి ఇద్దరు ఉన్నతాధికారులు, కన్సల్టెన్సీ ఎక్స్పర్టు ఒకరు తిరుపతికి గురువారం చేరుకోనున్నారు.
కాగా, ప్రభుత్వం రాష్ట్రంలో తిరుపతి, విశాఖ వంటి నగరాల్లో ఐటీఐఆర్ పెట్టుబడులను విస్తరింపచేసే దిశగా చర్యలు చేపట్టిన క్రమంలో ఇందుకు అనువైన ప్రాంతాలను అధికారులు వెతకడం ప్రారంభించారు. రాయలసీమలో చిత్తూరు జి ల్లాతో పాటు అనంతపురం లేపాక్షి హబ్ స్థలా న్ని కూడా పరిశీలించాలని ఐటీ మంత్రి పొన్నా ల లక్ష్మయ్య అధికారులకు సూచించారు. ఈ క్రమంలో సీఎం సొంత జిల్లా చిత్తూరుకే తొలి ప్రాధాన్యం ఇచ్చి స్థల పరిశీలన చేయనున్నారు. కాగా ఐటీఐఆర్ ఏర్పాటుకు 4వేల ఎకరాల స్థలం అవసరమవుతుంది.
వాల్మీకిపురం వైపే చూపు..
ఐటీఐఆర్ జోన్ ఏర్పాటుకు సీఎం నియోజకవర్గం వాల్మీకిపురం-కలికిరి ఇండస్ట్రియల్ పార్కు స్థలం వైపే అధికారుల చూపు ఉంది. ఇక్కడ ఇప్పటికే 12,000 ఎకరాలను ఇండస్ట్రియల్ పార్కు కోసం ఏపీఐఐసీ స్థల సేకరణ చే సి ఉం ది. ఈ క్రమంలో ఐటీఐఆర్లో సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు, హార్డువేర్ ఉత్పత్తుల కంపెనీలు ఉంటాయి కనుక ఇండస్ట్రీ కిందే వస్తుందని, ఈ రీత్యా ఇందులో ఐటీఐఆర్ ఏర్పాటుకు అవసరమైన 4వేల ఎకరాలు తీసుకుంటే ఎలా ఉం టుందనేది పరిశీలించనున్నారు. అయితే ఇక్కడ భూ సేకరణకు తప్పిస్తే తాగునీటి వసతి, హైవే కనెక్టివిటీ, రవాణా సదుపాయలు అంతగా అందుబాటులో లేవు. కేవలం సీఎం నియోజకవర్గం అనే ఒక్క కారణం మినహా ఇక్కడ ఐటీఐఆర్ జోన్కు అవసరమైన అనుకూల అంశాలు తక్కువ.
మన్నవరం వద్ద..
శ్రీకాళహస్తి మండలం మన్నవరం వద్ద స్థలపరిశీలనకు కూడా ఈ కమిటీ వెళ్లనుంది. వెంకటగిరి మార్గంలో భెల్ పరిశ్రమకు దగ్గరలో 4వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటు లో ఉంది. ఇక్కడ ఐటీఐఆర్ ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుకూలతలు ఎక్కువగా ఉన్నా యి. రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. తాగునీటి వసతికి కండలేరు నుంచి వచ్చే పైపు లైన్ ద్వారా మళ్లించేందుకు వీలు కలుగుతుంది. చెన్నై కలకత్తా నేషనల్ హైవేతో పాటు, పూతల పట్టు-నాయుడుపేట హైవేకి అనుసంధానంగా రోడ్డు ఉంది. రైలు మార్గంలో తిరుపతి నుంచి శ్రీకాళహస్తి నుంచి చేరుకోవచ్చు.
భౌగోళికంగా నెల్లూరు, చిత్తూరు జిల్లా సరిహద్దుల మధ్య ఉంది. ఈ రీత్యా కూడా ఐటీఐఆర్జోన్ ఏర్పాటుకు మన్నవరం ప్రాంతం అనుకూలంగా ఉం టుందనేది పారిశ్రామిక వర్గాల అభిప్రాయం. ఈ నేపథ్యంలో సహజంగా ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి వాల్మీకిపురం వైపు నిపుణుల కమిటీ మొగ్గుచూపుతుందా లేదా, భౌగోళిక, రవాణా అనుకూలతల వల్ల మన్నవరానికి ప్రాధాన్యత ఇస్తుందా? అనేది చూడాల్సి ఉంది. అదే సమయంలో అనంతపురం రాజకీయనాయకులు లాబీయింగ్ చేస్తే లేపాక్షి హబ్ స్థలానికి ఐటీఐఆర్ తరలిపోయినా ఆశ్చర్యపడక్కరలేదు. జిల్లాకు ఐటీఐఆర్ వస్తే మాత్రం వేలాదిమందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.