మనసులను చదివే..‘హార్ట్’వేర్
న్యూయార్క్: ఇటువైపు చూడండి.. బాధలో ఉన్నారా? ఖుషీగా ఉన్నారా? కోపమా..! చిరాకా! మీరు చెప్పక్కర్లేదు. మీ మనసులో ఏమున్నా.. ‘ఫేసెట్’ వెంటనే చెప్పేస్తుంది. ఇలా ముఖాన్ని చూసి మనసులను చదివే అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఎమోటెంట్ కంపెనీ ఇంజనీర్లు అభివృద్ధి చేశారు. ఒకవేళ దొంగ నవ్వుతో సాఫ్ట్‌వేర్‌ను బురిడీ కొట్టిద్దామనుకున్నా.. ఆ ఆటలు దీని ముందు సాగవు. కృత్రిమ నవ్వును కూడా స్కాన్ చేసి పడేస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్‌కు ఫేసెట్ అని నామకరణం చేశారు. సాధారణ డిజిటల్ కెమెరా సాయంతో ముఖాన్ని పరీక్షించి వారు ఆనందం, బాధ, భయం, ఆశ్చర్యం, కోపం, చిరాకు ఏ మూడ్‌లో ఉన్నారో చిటికెలో చెప్పేయగలదు.
ఏడు భావాల కలయికను చెప్పే సామర్థ్యం దీనికి ఉంది. సాధారణంగా వ్యక్తుల ఆలోచనలకు, వారు చెప్పే మాటలకు, చేసే చర్యలకు మధ్య సమన్వయం ఉండదని ఫేసెట్ సాఫ్ట్‌వేర్ తయారీ ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన ఎమోటెంట్ సహ వ్యవస్థాపకుడు మారియన్ బార్లెట్ తెలిపారు. ఒక ఫొటోగ్రాఫ్‌తో భావాల మధ్య తేడాలను ఫేసెట్ కచ్చితంగా గుర్తించగలదన్నారు. సూక్ష్మస్థాయిలో ఉన్న ముఖ కవళికలను సైతం పసిగడుతుందని చెప్పారు. ‘‘ముఖ కండరాలను నియంత్రించేందుకు మానవుల్లో రెండు రకాల మోటారు వ్యవస్థలు ఉంటాయి. సాధారణ చర్యల కంటే అకస్మాత్తుగా జరిగే చర్యలను నియంత్రించే మోటారు వ్యవస్థ వేగంగా ఉంటుంది. ఫేసెట్ వీటి ఆధారంగానే భావాలను గుర్తిస్తుంది’’ అని బార్లెట్ చెప్పారు.