న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండళ్లలోని (సెజ్) యూనిట్లు ఉపయోగించిన ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తులను (ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, మానిటర్లు, ప్రింటర్లు) బైటికి తరలించడానికి సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం సడలించింది. దేశీ టారిఫ్ ఏరియాల్లో (డీటీఏ) తాము సొంతంగా వినియోగించుకోవడానికి మాత్రమే లైసెన్సు అవసరం లేకుండా కంపెనీలు వాటిని సెజ్‌ల నుంచి తరలించవచ్చని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.
అయితే, ఆ పరికరాలను సెజ్ యూనిట్లలో కనీసం రెండేళ్ల పాటు ఉపయోగించి ఉండాలి. అయిదేళ్ల కన్నా పాతవై (తయారీ తేదీ నుంచి) ఉండకూడదు. దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల దిగుమతులపై విధించిన ఆంక్షలను ప్రభుత్వం స్వల్పంగా సడలించిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
సాధారణంగా దేశీ మార్కెట్లోని సంస్థలు వాటిని దిగుమతి చేసుకోవాలంటే లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, కస్టమ్స్ చట్టాలపరంగా సెజ్‌లను విదేశీ భూభాగంగా పరిగణించడం వల్ల వాటిలోని యూనిట్లకు సుంకాలపరమైన మినహాయింపులు ఉంటాయి. కానీ, సెజ్‌లలోని సంస్థలు తమ ఉత్పత్తులను దేశంలోని ఇతర ప్రాంతాల్లోకి తీసుకువస్తే .. వాటిని దిగుమతులుగా పరిగణిస్తారు. తదనుగుణంగా సుంకాలూ వర్తిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment