Hardikpandya
-
ఒక్క విషయం చాలు గుజరాత్ తో గెలిచేది చెన్నై...
-
కోల్‌కతా తడాఖా
నైట్‌రైడర్స్ తరఫున నలుగురే బ్యాటింగ్‌కు దిగారు. కానీ... చేసింది 232 పరుగులు! ఈ సీజన్లోనే అత్యధిక స్కోరిది. ఔటైన ఇద్దరు (గిల్, లిన్)... ఔట్ కాని ఒక్కడు (రసెల్) సిక్సర్లతో విరుచుకుపడ్డారు. బౌండరీల్ని అవలీలగా బాదేశారు. 20 ఓవర్లయ్యాక చూస్తే కొండంత స్కోరు కోల్‌కతాది. హార్దిక్ పోరాడినా ముంబై దీనిని అందుకోలేక పోయింది. ముఖ్యంగా తనను వన్‌డౌన్‌లో దింపితే అవతలి జట్టుకు ఎంత నష్టమో రసెల్ నిరూపించాడు. కోల్‌కతా: ముంబైతో మ్యాచ్‌కు ముందు రోజు కోల్‌కతా మిసైల్ బ్యాట్స్‌మన్ రసెల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకే వరుసగా ఓడుతున్నాం’ అని విమర్శించాడు. అందుకేనేమో వెంటనే కళ్లు తెరిచిన నైట్‌రైడర్స్ యాజమాన్యం సరైన నిర్ణయం తీసుకుంది. రసెల్‌ను వన్‌డౌన్‌లో దించింది. అంతే సిక్సర్ల ఉప్పెనే! గెలిచి రేసులో నిలవాల్సిన పోరులో కోల్‌కతా ‘ధనాధన్’లాడించింది. గెలిస్తే ముందడుగు వేసే స్థితిలో ఉన్న ముంబైని నిలువరించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ 34 పరుగుల తేడాతో ముంబైని ఓడించింది. శుబ్‌మన్ గిల్ (45 బంతుల్లో 76; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), క్రిస్ లిన్ (29 బంతుల్లో 54; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), రసెల్ (40 బంతుల్లో 80 నాటౌట్; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) చెలరేగారు. దీంతో మొదట కోల్‌కతా 20 ఓవర్లలో 2 వికెట్లకు 232 పరుగులు చేసింది. తర్వాత ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసి ఓడింది. హార్ధిక్ పాండ్యా (34 బంతుల్లో 91; 6 ఫోర్లు, 9 సిక్స్‌లు) బెదరగొట్టాడు. సిక్స్‌ల వర్షం కురిపించాడు. రసెల్, గర్నీ, నరైన్‌లు తలా 2 వికెట్లు తీశారు. రసెల్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అందుకున్నాడు. దిగినాడో... దంచాడే! ముంబై టాస్ నెగ్గి తప్పు చేసింది. కోల్‌కతాకు బ్యాటింగ్ అప్పజెప్పింది. లిన్‌తో జతగా ఓపెనింగ్ చేసిన శుబ్‌మన్ గిల్ నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌కు బౌండరీలతో శ్రీకారం చుట్టాడు. శరణ్ బౌలింగ్‌లో 2 ఫోర్లు, సిక్స్‌తో 14 పరుగులు బాదాడు. నాలుగో ఓవర్లో లిన్ రెండు బౌండరీలతో టచ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత ప్రతీ ఓవర్ 10 పరుగులకు తగ్గలేదు. మలింగ, రాహుల్ చహర్, బుమ్రా ఎవరు బౌలింగ్ వేసినా ఫోర్లు, సిక్సర్లే! 9 ఓవర్లు ముగిసేసరికి వికెటే కోల్పోకుండా 89 పరుగులు చేసింది. లిన్ 27 బంతుల్లోనే ఫిఫ్టీ చేశాడు. జోరుమీదున్న ఈ జోడీకి పదో ఓవర్లో చుక్కెదురైంది. లిన్‌ను చహర్ ఔట్ చేయడంతో 96 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. దీంతోపాటే రసెల్ వన్‌డౌన్‌లోకి రావడంతో బౌలర్ల భరతం పట్టేందుకు తెరలేచింది. గిల్ అర్ధశతకం... ఆద్యంతం దూకుడుగానే కనిపించిన గిల్ జిగేల్మనే ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాట్‌కు అందిన బంతిని బౌండరీగా, చెత్త బంతిని సిక్సర్‌గా మలిచాడు. ఈ క్రమంలో 32 బంతుల్లో శుబ్‌మన్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. రసెల్‌తో రెండో వికెట్‌కు 62 పరుగులు జోడించాక నిష్క్రమించాడు. తర్వాత దినేశ్ కార్తీక్ (7 బంతుల్లో 15 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) జత కలువగా రసెల్ వన్‌సైడ్ ఇన్నింగ్స్ ఆడాడు. వీళ్లిద్దరు అబేధ్యమైన మూడో వికెట్‌కు 4.4 ఓవర్లలోనే 74 పరుగులు జోడించడం విశేషం. ముంబై తడబాటు... ఈ సీజన్లోనే కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఆరంభం నుంచే ఒత్తిడికి గురైంది. రెండో ఓవర్లోనే డికాక్ (0) డకౌట్ కాగా, నాలుగో ఓవర్లో రోహిత్ శర్మ (12) ఆట ముగిసింది. ఓపెనర్లు 21 పరుగులకే పెవిలియన్ చేరారు. తర్వాత వచ్చిన లూయిస్ (15), సూర్యకుమార్ (14 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాసేపు ఆడగలిగినా... రసెల్ వీళ్లిద్దరిని ఔట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన పొలార్డ్ (20; 2 ఫోర్లు) 21 బంతులాడినా మెరిపించలేకపోయాడు. రెండు బౌండరీలు కొట్టిన పొలార్డ్... నరైన్ ఉచ్చులో పడ్డాడు. తర్వాత పాండ్యా బ్రదర్స్ ఆటకు వేగం తెచ్చారు. హార్దిక్ అదరగొట్టాడు... హార్దిక్ పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారీ సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. చావ్లా వరుస ఓవర్లలో (10, 12వ) రెండేసి సిక్స్‌ల చొప్పున బాదాడు. నరైన్, గర్నీ ఓవర్లలో సిక్స్‌ల మోత మోగించాడు. కేవలం 17 బంతుల్లోనే 7 సిక్స్‌లు, ఒక బౌండరీ సాయంతో వేగంగా అర్ధసెంచరీ చేశాడు. ఎవరు బౌలింగ్‌కు వచ్చినా బంతిని అదేపనిగా సిక్స్‌లుగా మలిచాడు. 16వ ఓవర్ వేసేందుకు చావ్లా రాగా సిక్స్, 2 ఫోర్లతో 20 పరుగులు రాబట్టాడు. 17వ ఓవర్లో 4, 6తో 14 పరుగులు జతచేశాడు. చిచ్చర పిడుగల్లే చెలరేగుతున్న హార్దిక్‌ను గర్నీ 18వ ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. చావ్లా ఆఖరి ఓవర్లో కృనాల్ (24) ఔటయ్యాడు. అతని ఆటే ‘హైలైట్స్’ ఇన్నింగ్స్ బ్రేక్‌లోనో, మ్యాచ్ పూర్తయ్యాకో టీవీల్లో మనకు కనిపిస్తాయే... ఆ హైలైట్స్! అవి రసెల్ ఆటలోనే కనిపించాయి. మూడు బంతులాడినా పరుగే చేయని ఈ మిసైల్ తర్వాత ముంబై బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. చహర్ వేసిన 12వ ఓవర్లో బౌండరీతో మొదలైన హిట్టింగ్‌కు అడ్డుఅదుపే లేకుండా పోయింది. ఫుల్‌టాస్‌ను డీప్ మిడ్‌వికెట్ మీదుగా, బౌన్సర్ వేస్తే అప్పర్ కట్‌తో థర్డ్‌మ్యాన్ దిశగా ఎక్కడ బంతి వేసినా... అది సిక్స్‌గానే ఫిక్సయింది. చహర్ 13 ఓవర్లో రెండు సిక్సర్లు బాదేశాడు. బంతి పదేపదే బౌండరీ లైన్ అవతలికే వెళ్లిపోవడంతో 30 బంతుల్లోనే ఫిఫ్టీ చేశాడు. హార్దిక్ పాండ్యా 18వ ఓవర్లో మూడు కళ్లు చెదిరే సిక్స్‌లు బాదితే 20 పరుగులొచ్చాయి. 19వ ఓవర్ బుమ్రా వేస్తే సిక్స్, ఫోర్ 15 పరుగులు! మలింగ ఆఖరి ఓవర్లో 6, 4, 4, 0, 0, 6 ఇరవై పరుగులు లభించాయి. -
ఆ ఏడు నెలలు భారంగా గడిచాయి!
ముంబై: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలుపొందడంలో కీలకపాత్ర పోషించిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా... తన జీవితంలో గత ఏడు నెలల కాలం చాలా భారంగా గడిచిందని తెలిపాడు. గాయంతో పాటు, టీవీ షో కారణంగా చెలరేగిన వివాదంతో ఇన్ని రోజుల పాటు గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నానని పేర్కొన్నాడు. ‘తాజాగా నా ప్రదర్శన కారణంగా ముంబై గెలుపును అందుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది. కానీ గత ఏడు నెలలు నాకు చాలా కష్టంగా గడిచాయి. అనవసర వివాదాలతో పాటు, గాయంతో ఆటకు దూరమయ్యాను. ఆ సమయంలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. కానీ ప్రతిరోజు నా ఆటతీరు మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించా. చెన్నైపై నా బ్యాటింగ్ ప్రదర్శనతో సంతోషంగా ఉన్నా. కష్ట సమయంలో వెన్నంటే నిలిచిన నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అంకితమిస్తున్నా. ప్రస్తుతం నా దృష్టి అంతా ఐపీఎల్‌పైనే ఉంది’ అని 25 ఏళ్ల పాండ్యా వివరించాడు. టీవీ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీసీసీఐ అతనిపై సస్పెన్షన్ వేటు వేసి ఆస్ట్రేలియా పర్యటన నుంచి భారత్‌కు తీసుకువచ్చింది. తర్వాత అతనిపై సస్పెన్షన్ ఎత్తివేసినప్పటికీ ఆ అంశంపై ఇంకా విచారణ జరుపుతోంది. ఈ వివాదం కన్నా ముందు పాండ్యా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో భాగంగా బుధవారం మ్యాచ్‌లో 8 బంతుల్లో 25 పరుగులు చేయడమే కాకుండా 3 వికెట్లు దక్కించుకుని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకోవడం పట్ల పాండ్యా హర్షం వ్యక్తం చేశాడు. -
చెన్నైకి ముంబై చెక్
హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళుతున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు ముంబై ఇండియన్స్ చెక్‌పెట్టింది. లీగ్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. హార్దిక్ పాండ్యా మొదట బ్యాటింగ్‌తో తర్వాత బౌలింగ్‌తో చెన్నై పరాజయానికి కారకుడయ్యాడు. చెన్నై జట్టులో ఒకే ఒక్కడు కేదార్ జాదవ్ శ్రమించినా... గెలిచేందుకు అదెంతమాత్రం సరిపోలేదు. ముంబై: హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ షోతో చెన్నై సూపర్‌కింగ్స్ చెల్లాచెదురైంది. మొదట బ్యాటింగ్‌లో (8 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు), తర్వాత బౌలింగ్‌లో (3/20) చెలరేగడంతో ముంబై ఇండియన్స్ లీగ్‌లో రెండో విజయం సాధించింది. ఐపీఎల్–12లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 37 పరుగుల తేడాతో చెన్నైపై జయభేరి మోగించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 59; 8 ఫోర్లు, 1 సిక్స్), కృనాల్ పాండ్యా (32 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులకే పరిమితమైంది. కేదార్ జాదవ్ (54 బంతుల్లో 58; 8 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేశాడు. ముంబై బౌలర్లలో మలింగ, హార్దిక్ పాండ్యా చెరో 3 వికెట్లు తీశారు. పాండ్యాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. అప్పటిదాకా నెమ్మదిగానే... ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌ను రెండు దశలుగా చూస్తే.. 1 నుంచి 18 ఓవర్ల వరకు ముంబై చేసిన స్కోరు 125/5. ఇది ఏ మాత్రం ఆసక్తికరంగా లేని మొదటి దశ. కానీ రెండో దశ ఉప్పెనే! 20 ఓవర్లలో 170/5. రెండంటే రెండు ఓవర్లలో హార్దిక్ పాండ్యా–పొలార్డ్ జోడి 45 పరుగులు చేసింది. 19వ ఓవర్లో 16, చివరి ఓవర్లో 29 పరుగులతో వాంఖెడే స్టేడియం ఒక్కసారిగా హోరెత్తింది. తర్వాత ముంబై బౌలర్లు పోరాడేందుకు, లక్ష్యాన్ని కాపాడేందుకు అవసరమైన స్కోరు లభించింది. 10 ఓవర్లదాకా 57 పరుగులే ముంబై ఆట చాలా నెమ్మదిగా మొదలైంది. తొలి రెండు ఓవర్లలో ఇండియన్స్ స్కోరు 3/0. తొలి ఫోర్‌ను మూడో ఓవర్లో కొట్టింది. బౌండరీ కొట్టిన డికాక్ (4) ఆ మరుసటి బంతికే ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్... శార్దూల్ వేసిన 4వ ఓవర్లో 2 వరుస ఫోర్లు, దీపక్ చహర్ ఐదో ఓవర్లో ‘హ్యాట్రిక్’ ఫోర్లు బాదాడు. ఇక ముంబై జోరు మొదలైందనుకుంటుండగా... రోహిత్ శర్మ (13), యువరాజ్ (4) వరుస ఓవర్లలో నిష్క్రమించడంతో ఇలా మొదలైన ముంబై ఇన్నింగ్స్ వేగం అలా ఆగిపోయింది. 10 ఓవర్లకు ముంబై స్కోరు 57/3. సూర్యకుమార్, కృనాల్ పాండ్యా ముంబై ఆదుకున్నారు కానీ అదరగొట్టే స్కోరును అందించలేకపోయారు. సూర్యకుమార్ 38 బంతుల్లో (7 ఫోర్లు, 1 సిక్స్) ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. 16వ ఓవర్లో జట్టు స్కోరు వంద పరుగులకు చేరింది. స్వల్ప వ్యవధిలో సూర్యకుమార్, కృనాల్ ఔట్కావడంతోనే ముంబై దశమారింది. ఆ క్యాచ్ ఆటకే హైలైట్ అనంతరం లక్ష్యఛేదనకు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ ఆరంభంలో తడబడింది. వరుస ఓవర్లలో రాయుడు ఖాతా తెరువకుండానే, వాట్సన్ (5) సింగిల్ డిజిట్‌కే ఔటయ్యారు. ఆరుకే ఇద్దరు ఓపెనర్లను కోల్పోయిన సూపర్‌కింగ్స్‌ను కాసేపు రైనా, జాదవ్ నడిపించారు. ఈ జోడి క్రీజ్‌లో పాతుకుపోతున్న దశలో రైనా (15 బంతుల్లో 16; 2 ఫోర్లు, 1 సిక్స్) కథ అద్భుతమైన క్యాచ్‌తో ముగిసింది. దీంతోనే చెన్నై దారిమళ్లింది. బెహ్రెన్‌డార్ఫ్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో ఆఖరి బంతిని రైనా పాయింట్ బౌండరీ దిశగా భారీ షాట్ బాదాడు. కానీ అక్కడ పొడగరి పొలార్డ్ ఒంటి చేత్తో వెనక్కి డైవ్ చేస్తూ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. తర్వాత జాదవ్‌కు జతయిన కెప్టెన్ ధోని మరో వికెట్ పడకుండా జట్టు స్కోరును 14 ఓవర్లలో 87/3 వరకు లాక్కొచ్చాడు. 15వ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా ముందుగా ధోని (12)ని, తర్వాత జడేజా (1)ని ఔట్ చేసి చెన్నై పరాజయాన్ని ఖాయం చేశాడు. ఆ మరుసటి ఓవర్లోనే కేదార్ జాదవ్ 46 బంతుల్లో అర్ధసెంచరీని పూర్తిచేసుకున్నాడు. బ్రేవో (8), జాదవ్‌లను మలింగ ఒకే ఓవర్ (18వ)లో ఔట్ చేయడంతో మిగతా బ్యాట్స్‌మెన్ శార్దూల్ (12 నాటౌట్), మోహిత్ శర్మ (0 నాటౌట్) లక్ష్యాన్ని పక్కనబెట్టి ఆలౌట్ కాకుండా ఆడారు. బెహ్రెన్‌డార్ఫ్‌కు 2 వికెట్లు దక్కాయి. 20వ ఓవర్లో... 29 పరుగులు చప్పగా సాగిపోతున్న ముంబై ఇన్నింగ్స్‌కు ఆఖరి మెరుపులే అమూల్యమయ్యాయి. చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలర్ బ్రేవోకు తన బ్యాటింగ్ విశ్వరూపం చూపించాడు. ఒక వైడ్, నోబాల్ సహా 8 బంతులేసిన ఈ ఓవర్లో పాండ్యా ఒక్కసారిగా జూలు విదిల్చాడు. ముంబై 150 పరుగులు చేయటమే గగనం అనుకున్న తరుణంలో 1, వైడ్, 1, నోబాల్+6, 3, 6, 4, 6 పరుగుల ప్రవాహంతో ముంబై 170 పరుగులకు చేరింది. ఈ ఓవర్లో చుక్కల్ని తాకే మెరుపులతో ముంబై ఏకంగా 29 పరుగులు చేసింది. ఇందులో 17 పరుగులు హార్దిక్ పాండ్యా బాదగా, పొలార్డ్ 10 పరుగులు సాధించాడు. 2 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. -
హార్దిక్ ఫిలాసఫీ ఇదే..
లండన్: చాంపియన్స్ట్రోఫిలో ఆదివారం పాక్‌తో జరిగిన రసవత్తర పోరులో భారత్ ఘన విజయం సాధించిన తరువాత భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తాను నమ్మిన ఫిలాసఫీని అభిమానులతో పంచుకున్నాడు. 'గతం నుంచి నేర్చుకోండి..ఈ రోజు జీవించండి.. రేపటి గురించి ఆశగా ఎదురు చూడండి.. అని లండన్‌కు శుభోదయం.. భారత్‌కు శుభ మధ్యాహ్నం.. ’అంటూ ఇన్స్ట్రాగ్రాంలో పోస్ట్ చేశాడు. పాక్ మ్యాచ్‌లో 6 బంతుల్లో 20 పరుగులు చేసి 2 వికెట్లు పడగొట్టిన పాండ్యా ఆల్‌రౌండర్‌గా తన పూర్వపు ఫామ్‌ను కొనసాగించాడు. ఇక చివరి ఓవర్లో వరుస సిక్స్‌లు బాదడంతో భారత్ మూడొందల మార్కును సునాయాసంగా చేరింది. ఐపీఎల్-10లో ముంబై ఇండియన్స్ టైటిల్ అందుకోవడంలో కూడా పాండ్యా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. Learn from yesterday Live for today Hope for tomorrow