చెన్నైకి ముంబై చెక్‌ | Mumbai Indians 1st team to win 100 IPL Matches | Sakshi
Sakshi News home page

చెన్నైకి ముంబై చెక్‌

Published Thu, Apr 4 2019 2:17 AM | Last Updated on Thu, Apr 4 2019 10:45 AM

Mumbai Indians 1st team to win 100 IPL Matches - Sakshi

హ్యాట్రిక్‌ విజయాలతో దూసుకెళుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ముంబై ఇండియన్స్‌ చెక్‌పెట్టింది. లీగ్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. హార్దిక్‌ పాండ్యా మొదట బ్యాటింగ్‌తో తర్వాత బౌలింగ్‌తో చెన్నై పరాజయానికి కారకుడయ్యాడు. చెన్నై జట్టులో ఒకే ఒక్కడు కేదార్‌ జాదవ్‌ శ్రమించినా... గెలిచేందుకు అదెంతమాత్రం సరిపోలేదు.   

ముంబై: హార్దిక్‌ పాండ్యా ఆల్‌రౌండ్‌ షోతో చెన్నై సూపర్‌కింగ్స్‌ చెల్లాచెదురైంది. మొదట బ్యాటింగ్‌లో (8 బంతుల్లో 25 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్స్‌లు), తర్వాత బౌలింగ్‌లో (3/20) చెలరేగడంతో ముంబై ఇండియన్స్‌ లీగ్‌లో రెండో విజయం సాధించింది. ఐపీఎల్‌–12లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 37 పరుగుల తేడాతో చెన్నైపై జయభేరి మోగించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.

సూర్యకుమార్‌ యాదవ్‌ (43 బంతుల్లో 59; 8 ఫోర్లు, 1 సిక్స్‌), కృనాల్‌ పాండ్యా (32 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులకే పరిమితమైంది. కేదార్‌ జాదవ్‌ (54 బంతుల్లో 58; 8 ఫోర్లు, 1 సిక్స్‌) ఒంటరి పోరాటం చేశాడు. ముంబై బౌలర్లలో మలింగ, హార్దిక్‌ పాండ్యా చెరో 3 వికెట్లు తీశారు. పాండ్యాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది. 

అప్పటిదాకా నెమ్మదిగానే... 
ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌ను రెండు దశలుగా చూస్తే.. 1 నుంచి 18 ఓవర్ల వరకు ముంబై చేసిన స్కోరు 125/5. ఇది ఏ మాత్రం ఆసక్తికరంగా లేని మొదటి దశ. కానీ రెండో దశ ఉప్పెనే! 20 ఓవర్లలో 170/5. రెండంటే రెండు ఓవర్లలో హార్దిక్‌ పాండ్యా–పొలార్డ్‌ జోడి 45 పరుగులు చేసింది. 19వ ఓవర్లో 16, చివరి ఓవర్లో 29 పరుగులతో వాంఖెడే స్టేడియం ఒక్కసారిగా హోరెత్తింది. తర్వాత ముంబై బౌలర్లు పోరాడేందుకు, లక్ష్యాన్ని కాపాడేందుకు అవసరమైన స్కోరు లభించింది. 

10 ఓవర్లదాకా 57 పరుగులే 
ముంబై ఆట చాలా నెమ్మదిగా మొదలైంది. తొలి రెండు ఓవర్లలో ఇండియన్స్‌ స్కోరు 3/0. తొలి ఫోర్‌ను మూడో ఓవర్లో కొట్టింది. బౌండరీ కొట్టిన డికాక్‌ (4) ఆ మరుసటి బంతికే ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్‌... శార్దూల్‌ వేసిన 4వ ఓవర్లో 2 వరుస ఫోర్లు, దీపక్‌ చహర్‌ ఐదో ఓవర్లో ‘హ్యాట్రిక్‌’ ఫోర్లు బాదాడు. ఇక ముంబై జోరు మొదలైందనుకుంటుండగా... రోహిత్‌ శర్మ (13), యువరాజ్‌ (4) వరుస ఓవర్లలో నిష్క్రమించడంతో ఇలా మొదలైన ముంబై ఇన్నింగ్స్‌ వేగం అలా ఆగిపోయింది. 10 ఓవర్లకు ముంబై స్కోరు 57/3. సూర్యకుమార్, కృనాల్‌ పాండ్యా ముంబై ఆదుకున్నారు కానీ అదరగొట్టే స్కోరును అందించలేకపోయారు. సూర్యకుమార్‌ 38 బంతుల్లో (7 ఫోర్లు, 1 సిక్స్‌) ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. 16వ ఓవర్లో జట్టు  స్కోరు వంద పరుగులకు చేరింది. స్వల్ప వ్యవధిలో సూర్యకుమార్, కృనాల్‌ ఔట్‌కావడంతోనే ముంబై దశమారింది. 

ఆ క్యాచ్‌ ఆటకే హైలైట్‌ 
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆరంభంలో తడబడింది. వరుస ఓవర్లలో రాయుడు ఖాతా తెరువకుండానే, వాట్సన్‌ (5) సింగిల్‌ డిజిట్‌కే ఔటయ్యారు. ఆరుకే ఇద్దరు ఓపెనర్లను కోల్పోయిన సూపర్‌కింగ్స్‌ను కాసేపు రైనా, జాదవ్‌ నడిపించారు. ఈ జోడి క్రీజ్‌లో పాతుకుపోతున్న దశలో రైనా (15 బంతుల్లో 16; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కథ అద్భుతమైన క్యాచ్‌తో ముగిసింది. దీంతోనే చెన్నై దారిమళ్లింది. బెహ్రెన్‌డార్ఫ్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్లో ఆఖరి బంతిని రైనా పాయింట్‌ బౌండరీ దిశగా భారీ షాట్‌ బాదాడు. కానీ అక్కడ పొడగరి పొలార్డ్‌ ఒంటి చేత్తో వెనక్కి డైవ్‌ చేస్తూ కళ్లు చెదిరే క్యాచ్‌ అందుకున్నాడు.

తర్వాత జాదవ్‌కు జతయిన కెప్టెన్‌ ధోని మరో వికెట్‌ పడకుండా జట్టు స్కోరును 14 ఓవర్లలో 87/3 వరకు లాక్కొచ్చాడు. 15వ ఓవర్‌ వేసిన హార్దిక్‌ పాండ్యా ముందుగా ధోని (12)ని, తర్వాత జడేజా (1)ని ఔట్‌ చేసి చెన్నై పరాజయాన్ని ఖాయం చేశాడు. ఆ మరుసటి ఓవర్లోనే కేదార్‌ జాదవ్‌ 46 బంతుల్లో అర్ధసెంచరీని పూర్తిచేసుకున్నాడు. బ్రేవో (8), జాదవ్‌లను మలింగ ఒకే ఓవర్‌ (18వ)లో ఔట్‌ చేయడంతో మిగతా బ్యాట్స్‌మెన్‌ శార్దూల్‌ (12 నాటౌట్‌), మోహిత్‌ శర్మ (0 నాటౌట్‌) లక్ష్యాన్ని పక్కనబెట్టి ఆలౌట్‌ కాకుండా ఆడారు. బెహ్రెన్‌డార్ఫ్‌కు 2 వికెట్లు దక్కాయి.
 
20వ ఓవర్లో... 29 పరుగులు 
చప్పగా సాగిపోతున్న ముంబై ఇన్నింగ్స్‌కు ఆఖరి మెరుపులే అమూల్యమయ్యాయి. చివరి ఓవర్లో హార్దిక్‌ పాండ్యా బౌలర్‌ బ్రేవోకు తన బ్యాటింగ్‌ విశ్వరూపం చూపించాడు. ఒక వైడ్, నోబాల్‌ సహా 8 బంతులేసిన ఈ ఓవర్లో పాండ్యా ఒక్కసారిగా జూలు విదిల్చాడు. ముంబై 150 పరుగులు చేయటమే గగనం అనుకున్న తరుణంలో 1, వైడ్, 1, నోబాల్‌+6, 3, 6, 4, 6 పరుగుల ప్రవాహంతో ముంబై 170 పరుగులకు చేరింది. ఈ ఓవర్లో చుక్కల్ని తాకే మెరుపులతో ముంబై ఏకంగా 29 పరుగులు చేసింది. ఇందులో 17 పరుగులు హార్దిక్‌ పాండ్యా బాదగా, పొలార్డ్‌ 10 పరుగులు సాధించాడు. 2 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement