ముస్లిం అని తిరస్కరించారట..
ముంబై: మత సామరస్యాన్ని పాటించాలి..మత దురహంకారాన్ని రూపుమాపాలి.. మత వివక్షను చూపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకవైపు విస్పష్టంగా ప్రకటిస్తోంటే మరోవైపు కార్పొరేట్ కంపెనీలు మాత్రం తమ పని తాము నిశ్శబ్దంగా చేసుకుపోతున్నాయి.
తాజాగా ముంబైకి చెందిన వజ్రాలను ఎగుమతి చేసే కంపెనీ మత వివక్షను చూపించిన వైనం వెలుగు చూసింది. ముస్లిమేతరులకు మాత్రమే తమ సంస్థలో ఉద్యోగాన్ని ఇస్తామని ప్రకటించడం వివాదం రేపింది. వివరాల్లోకి వెడితే ఎంబీఏ చేసిన జేషన్ అలీ ఖాన్ అనే యువకుడు హరికృష్ణ ఎక్స్పోర్ట్ కంపెనీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
అయితే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అతనికి ..కంపెనీ నుంచి వచ్చిన ఈ మెయిల్ షాకిచ్చింది. నీవు ముస్లిం అయినందువల్ల ఉద్యోగాన్నిఇవ్వలేకపోతున్నామంటూ కంపెనీ నుంచి సమాధానం రావడంతో జేషన్ అవాక్కయ్యాడు. ఒకవేళ ఉద్యోగానికి సరిపడే విద్యార్హతలు లేకపోతే అదే విషయాన్ని తనకు చెప్పి ఉండాల్నింది అంటూ ..ఈ విషయాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు.
అంతే వివాదం చెలరేగింది. అయితే ఈ వివాదంపై కంపెనీ స్పందన వేరేలా ఉంది. తాము అలాంటి వివక్ష చూపలేదని వాదిస్తోంది. అంతకు ముందే శిక్షణలో వున్న అభ్యర్థిని ఎంపిక చేశామంటోంది. టైపింగ్లో పొరపాటు జరిగిందని హరికృష్ణ కంపెనీ పేర్కొనటం గమనార్హం. కాగా ముస్లింలు అయినంత మాత్రాన చదువుకోవడానికి అనర్హులా అని బాధిత జేషన్ అలీ ఖాన్ తండ్రి ప్రశ్నించారు.