Haribhai Parathibhai Chaudhary
-
ఢిల్లీ రేప్ కేసుల్లో 46 శాతం బాధితులు మైనర్లే
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు కలవరపెడుతున్నాయి. గత మూడేళ్లుగా సగటున ప్రతి రెండు రోజులకు ఐదుగురు చొప్పున బాలికలు అత్యాచారానికి గురౌతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం అత్యాచార ఘటనల్లో బాధితులు 46 శాతం మైనర్లే ఉన్నట్లు బుధవారం రాజ్యసభలో కేంద్ర హోం శాఖ ప్రకటించింది. గత మూడేళ్లుగా అత్యాచార కేసుల్లో బాధితుల వివరాలను కేంద్రం వెల్లడించింది. దీని ప్రకారం 2013లో ఢిల్లీలో మొత్తం 1,636 రేప్ కేసులు నమోదు కాగా ఇందులో 757 కేసుల్లో బాధితులు మైనర్లుగా ఉన్నారు. 2014 లో నమోదైన 2,166 రేప్ కేసులకు గాను 1,004 కేసుల్లో బాధితులు మైనర్లుగా ఉన్నారు. ఇక ఈ సంవత్సరం అక్టోబర్ 31 నాటికే రాజధానిలో 1,856 అత్యాచార కేసులు నమోదు కాగా అందులో 824 కేసుల్లో బాధితులు 18 సంవత్సరాల లోపు వారని తెలిపారు. అయితే ఢిల్లీలో అత్యాచారాల నిర్మూలనకు ఢిల్లీ పోలీసులు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. మహిళల స్వీయ రక్షణకు శిక్షణ ఇవ్వడానికి చేపట్టిన కార్యక్రమం ద్వారా 2014 సంవత్సరంలో 17,699 మంది తర్ఫీదు పొందినట్లు తెలిపారు. అలాగే మహిళకు వ్యతిరేకంగా జరిగే నేరాలను విచారించడానికి మహిళా అధికారులనే వినియోగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ పరాతిభాయ్ చౌదరి రాజ్యసభలో తెలిపారు. -
మూడేళ్లలో 339 ఉరిశిక్షలు
న్యూఢిల్లీ: గడిచిన ఐదేళ్లలో 2011 నుంచి 2013 మధ్యకాలంలో మొత్తం 339 మందికి మరణ శిక్ష విధించాలని తీర్పులు వెలువరించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హరిభాయ్ పారతి భాయ్ చౌదరి లోక్ సభలో ప్రకటించారు. జాతీయ నేరాల రికార్డు సంస్థ వివరాల ప్రకారం 2011లో 117 మందికి ఉరిశిక్ష పడగా, 2012లో 97 మందికి, 2013లో 125 మందికి ఉరిశిక్ష పడినట్లు ఆయన వివరించారు. ప్రస్తుత వివరాల ప్రకారం వీటిలో ఐదు కేసులు మాత్రం క్షమాభిక్ష పిటిషన్లో ఉన్నాయని తెలిపారు. మరోపక్క, 2011లో ఎవరినీ ఉరి తీయలేదని 2012లో ఒకరిని, 2013లో మరొకరిని ఉరితీసినట్లు తెలిపారు. -
'మాఫియా డాన్ ఎక్కడున్నాడో తెలియదు'
న్యూఢిల్లీ: మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఎక్కడవున్నాడో తెలియదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దావూద్ ఎక్కడ ఉన్నాడో తెలిస్తే అప్పుడు అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తామని లోక్ సభకు తెలిపింది. 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దావూద్ నిందితుడిగా ఉన్నాడని, అతడికి వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీచేశామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ పరాతిభాయ్ చౌదరి లోక్ సభలో తెలిపారు. ఐక్యరాజ్య సమితి భద్రతా సమితి కూడా దావూద్ కు వ్యతిరేకంగా ప్రత్యేక నోటీసు జారీ చేసిందని వెల్లడించారు. ఇప్పటివరకు అతడి జాడ కనుగొనలేదని స్పష్టం చేశారు. దావూద్ ఇబ్రహీం ఆచూకీపై అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ విధంగా స్పందించారు.