‘హరిజనుడు, ధోబీ అంటే అవమానించడమే’
న్యూఢిల్లీ: ఒక వ్యక్తిని హరిజనుడు, ధోబీ అని పిలవడమంటే.. వారిని అవమానించ డంతో పాటు దుర్భాష కిందకు వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుత రోజుల్లో ఆ పదాల్ని కులాన్ని సూచించేందుకు కాకుండా... ఉద్దేశపూర్వకంగా అవమానించడానికి వాడుతున్నారని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం సెక్షన్ 3(1)కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి పట్నా హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
బిహార్‌లోని బెగుసరాయ్‌లో దళిత మహిళను, ఆమె కుటుంబ సభ్యుల్ని కొందరు అగ్రకులస్తులు హరిజనులు, ధోబీలు అని పిలిచి అవమానించారు. ఈ కేసులో నిందితులకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఆదేశాల్ని సుప్రీం కోర్టు రద్దు చేసింది.