‘మీరు ఈ సమావేశంలో వద్దు పోండి’
లక్నో: వందేమాతరం ఆలపించని ఏడుగురు కార్పొరేటర్లను తాను నిర్వహిస్తున్న సమావేశానికి హాజరుకావొద్దని మీరట్ కార్పొరేషన్ మేయర్ ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో వారు ఈ సమావేశంలో ఉండకూడదని గదమాయించి అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు బయటకొచ్చింది. ఇందులో రికార్డయిన ప్రకారం మీరట్ మున్సిపల్ కార్పొరేషన్ మంగళవారం ఓ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఇందులో కార్యక్రమాలు ప్రారంభమవడానికి ముందు అంతా వందేమాతరం ఆలపించాలని మీరట్ మేయర్ హరికాంత్ అహ్లువాలియా ఆదేశించారు. ఈయన బీజేపీ నేత.
ప్రస్తుతం మీరట్ కార్పొరేషన్లో బీజేపీదే మెజార్టీ. ఈ నేపథ్యంలో అందులో ఉన్న ఓ ఏడుగురు కార్పొరేటర్లు వందేమాతరం ఆలపించబోమని, అసలు అలాంటిది వద్దంటూ తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఆయన వారిని అసలు ఆ సమావేశంలో ఉండొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు వివరణ ఇచ్చే వరకు కూడా మున్ముందు జరగబోవు నగర్ నిఘమ్ సమావేశాలకు హాజరవ్వకూడదని ఆర్డర్ కూడా జారీ చేశారు. అయితే, బలవంతంగా ఎవరితోనూ వందేమాతరం పాడించవద్దని సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.