Harinder Pal Sandhu
-
ఇండియా టూర్ స్క్వాష్ టోర్నీ విజేత హరీందర్
ముంబై: సొంతగడ్డపై భారత స్క్వాష్ రాకెట్స్ సమాఖ్య (ఎస్ఆర్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో జరిగిన ఇండియా టూర్ టోర్నమెంట్లో భారత ప్లేయర్ హరీందర్ పాల్ సంధూ విజేతగా అవతరించాడు. ముంబైలో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ హరీందర్ 11–5, 11–6, 11–7తో ఏడో సీడ్ టొమోటకా ఎండో (జపాన్)పై విజయం సాధించాడు. ఇదే టోర్నీ మహిళల సింగిల్స్ విభాగం ఫైనల్లో హనా రమదాన్ (ఈజిప్ట్) 11–8, 6–11, 11–4, 11–3తో లూసీ టర్మెల్ (ఇంగ్లండ్)ను ఓడించి టైటిల్ దక్కించుకుంది. -
క్వార్టర్ ఫైనల్లో హరీందర్ పాల్ సంధూ
ముంబై: జేఎస్‌డబ్ల్యూ ఇండియా స్క్వాష్ సర్క్యూట్ ఓపెన్ టోర్నమెంట్లో జాతీయ మాజీ చాంపియన్ హరీందర్ పాల్ సింగ్ సంధూ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో హరీందర్ పాల్ 4–11, 11–6, 11–2, 11–3తో ఏడో సీడ్ ఇవాన్ యువెన్ (మలేసియా)పై సంచలన విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో ‘వైల్డ్ కార్డు’తో మెయిన్ ‘డ్రా’లో ఆడుతున్న రమిత్ టాండన్ (భారత్) 11–7, 4–11, 11–4, 11–3తో ఎనిమిదో సీడ్ అబ్దుల్లా తమిమీ (ఖతర్)ను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్ బెర్త్ సంపాదించాడు. -
‘అర్జున’కు నేనూ అర్హుడినే: సంధూ
న్యూఢిల్లీ: ‘అర్జున’ అవార్డుల విషయంలో మరో క్రీడాకారుడు నిరసన గళం విప్పాడు. మూడోసారి కూడా ఈ అవార్డు కోసం తనను విస్మరించడంపై భారత స్టార్ స్క్వాష్ ప్లేయర్ హరీందర్ పాల్ సంధూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత జట్టులో అతను సభ్యుడు. ‘ఈసారి కచ్చితంగా నా పేరు జాబితాలో ఉంటుందని భావించాను. అయితే అర్హత ఉన్నప్పటికీ నన్ను పరిగణనలోకి తీసుకోకపోవడం తీవ్రంగా నిరాశపరిచింది’ అని 28 ఏళ్ల సంధూ తెలిపాడు. తనకు సహచరుడు సౌరవ్ ఘోషాల్‌కు మద్దతు తెలుపుతూ 2014లోనే అతడికి అర్జున రావాల్సిందని అన్నాడు. అయితే సంధూ టీమ్ ఈవెంట్స్‌లో కీలకంగా ఉంటున్నా... వ్యక్తిగత విభాగంలో ఆసియా, కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించకపోవడం అతడి అవకాశాలను దెబ్బతీస్తోంది. -
రన్నరప్ హరీందర్
క్రైస్ట్‌చర్చ్ (న్యూజిలాండ్) : భారత అగ్రశ్రేణి స్క్వాష్ ప్లేయర్ హరీందర్ పాల్ సంధూ క్రైస్ట్‌చర్చ్ అంతర్జాతీయ టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో హరీందర్ 11-8, 10-12, 9-11, 6-11తో డెక్లన్ జేమ్స్ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయాడు. 67 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో హరీందర్ తొలి గేమ్‌ను గెల్చుకున్నప్పటికీ ఆ తర్వాత అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు.