ఆటా ఎన్నికల్లో తన్నులాట
నేపర్‌విల్లే: అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఎన్నికల సందర్భంగా ఇద్దరు నాయకులు బూతులు తిట్టుకుంటూ తన్నుకున్నారు. ఒక వీడియోలో ఉన్నదాని ప్రకారం ఆటా సభ్యులు హరీందర్ రెడ్డి, చంద్ర శేఖర్ రెడ్డి ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఇంతలో ఆ గదిలోకి వచ్చిన హనుమంతు రెడ్డి అనే వ్యక్తి సభ్యులను బయటకు వెళ్లిపోవాల్సిందిగా బలవంతం చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన హరీందర్ దుర్భాషలాడడం మొదలుపెట్టాడు. గొడవ పెద్దదై ఒకరినొకరు కొట్టుకునేవరకు వెళ్లింది. నామినేషన్ పత్రాల్ని తనిఖీ చేయడానికి వచ్చిన సభ్యులకు వాటిని చూపించకుండానే, హనుమంతు పత్రాలను తనతోపాటు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
ఘటనపై హనుమంతును వివరణ కోరగా, ఎన్నికల నామినేషన్‌కు తుదిగడువు పూర్తయ్యాక నామినేషన్ ప్రతాలను సేకరించడానికి ఆటా అధ్యక్షుడు ముగ్గురు ఆధీకృత వ్యక్తులను నియమించారని తెలిపారు. ముగ్గురిలో తానూ ఒకడినన్నారు. నేపర్‌విల్లే పోస్టాఫీసుకు నామినేషన్ పత్రాలను స్వాధీనం చేసుకోడానికి వెళ్లిన తమపై హరీందర్, చంద్రశేఖర్ దాడి చేశారన్నారు. హరీందర్ 2013లో వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడారు.