దాడి కేసులో మూడేళ్లు జైలు
అనంతపురం లీగల్ : దాడి కేసులో నిందితుడిపై నేరం రుజువు కావడంతో మూడేళ్ల జైలు శిక్ష పడింది. వివరాల్లోకెళితే... గార్లదిన్నె మండలం పెనకచెర్ల గ్రామానికి చెందిన హరిప్రసాద్ యాదవ్, అతని సోదరుడు సుబ్బయ్యకు ఆస్తి పంపకాల విషయంలో తగాదాలు ఉన్నాయి. తనకు సరిగా ఆస్తి పంచలేదని హరిప్రసాద్‌యాదవ్ అనేక మార్లు సోదరుడి వద్ద ప్రస్తావించినా ఎటువంటి ప్రయోజనమూ లేకపోవడంతో 2012 అక్టోబర్ 20న సోదరుడి భార్య గోపాలమ్మ, కుమారుడు నవీన్‌పై దాడి చేశాడు.
గాయపడిన గోపాలమ్మను అనంతపురం ఆస్పత్రికి, తీవ్రంగా గాయపడిన నవీన్‌ను హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. గోపాలమ్మ ఫిర్యాదు మేరకు గార్లదిన్నె పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. 13 మంది సాక్షులను విచారించి, హరిప్రసాద్‌పై నేరం రుజువు కావడంతో అతడికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ స్థానిక అదనపు అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాసులు తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజశేఖర్ వాదించారు.