మొక్కలు ధ్వంసం చేస్తే హరితమిత్ర అవార్డులా..?
పెద్దపల్లి ఎమ్మెల్యేకిచ్చిన అవార్డు వెనక్కి తీసుకోవాలి
టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు
టవర్‌సర్కిల్: నాటిన మొక్కలను తొలగించి హరితహారం కార్యక్రమానికి తూట్లు పొడిచిన పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి అందించిన హరితమిత్ర అవార్డును వెనక్కి తీసుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.విజయరమణారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు డీఆర్వోకు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2015లో సీఎం కేసీఆర్ పెద్దపల్లిలోని ఐటీఐ కళాశాల ప్రాంగణంలో మొక్క నాటడంతోపాటు 4వేల మొక్కలను నాటినట్లు గుర్తుచేశారు. నగరపంచాయితీ చైర్మన్, కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే కలిసి మున్సిపల్ నుంచి రూ.2.5 లక్షలు వెచ్చించారన్నారు. హరితహారం కింద ఇంటింటికి పండ్ల మొక్కలు నాటేందుకు కోటి రూపాయలు తన సొంత డబ్బులు వెచ్చించినట్లు ఎమ్మెల్యే నమ్మించారని ఆరోపించారు. దీని పేరుతో కాంట్రాక్టర్లు, ఇటుక బట్టీలు, రైస్‌మిల్లుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేశారన్నారు. ఐటీఐ ఆవరణలో నాటిన మొక్కలన్నింటిని తమ ట్రినిటీ విద్యాసంస్థలకు ఆట స్థలంగా పనికి వస్తుందని చదును చేశారని తెలిపారు. తొలగించిన మొక్కల్లో ముఖ్యమంత్రి నాటిన మొక్క ఉందని గుర్తుచేశారు. హరితహారానికి తూట్లు పొడిచిన వారికి హరితమిత్ర అవార్డు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. మొక్కలు ధ్వంసం చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. నాయకులు కళ్యాడపు ఆగయ్య, రొడ్డ శ్రీనివాస్, పుట్ట నరేందర్, దామెర సత్యం, అనసూర్యనాయక్, సదానందం, గట్టుయాదవ్, అబ్బయ్యగౌడ్, సుధాకర్‌రెడ్డి, సంపత్, కమలాకర్, తీగుట్ల రమేశ్, గాజె రమేశ్, ఈశ్వరి పాల్గొన్నారు.