చెట్లతోనే కాలుష్య నివారణ సాధ్యం
హరితహారంలో పాల్గొనేందుకు పోటీ పడుతున్నారు
ఆఫీసులో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాము
రిజిస్ట్రేషన్‌కు అధికంగా వసూలు చేస్తే డీలర్లపై చర్యలు
రవాణాశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా
తిమ్మాపూర్: చెట్లతోనే కాలుష్యాన్ని నివారించడం సాధ్యమవుతుందని, అందుకే విరివిగా మొక్కలు నాటి వాటిని కాపాడాలని రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా కోరారు. తిమ్మాపూర్‌లోని ఆర్టీఏ ఆఫీసులో బోరుమోటార్‌ను గురువారం ప్రారంభించారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. హరితహారంలో అందరూ స్వచ్ఛందంగా పాల్గొంటూ పోటీపడి మెుక్కలు నాటుతున్నారన్నారు. తమశాఖ ఆధ్వర్యంలో 15వేల వరకు మొక్కలు నాటుతున్నామని చెప్పారు. ఆఫీస్‌లు ఫారెస్టులుగా మారాలని సూచించారు. సీఎం ఆదేశించిన తర్వాత హరితహారంలో ప్రతీ డిపార్ట్మెంట్ పాల్గొంటుందని, కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఉద్యోగులు పాల్గొంటున్నారని తెలిపారు. ఉత్సాహంగా నాటిన మరచిపోకుండా మొక్కలను కాపాడుకోవాలని, ఆరునెలలపాటు వాటిని శ్రద్ధగా చూడాలని సూచించారు. మొక్కల ఆవశ్యకతపై విద్యార్థులను ప్రశ్నిస్తూ మాట్లాడించారు. కార్యక్రమంలో జేటీసీ పాండురంగరావు, డీటీసీ వినోద్‌కుమార్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, జెడ్పీటీసీ పద్మ, ఎంపీపీ ప్రేమలత, వైస్ ఎంపీపీ భూలక్ష్మి, సర్పంచ్ స్వరూప, ఎంవీఐలు కొండాల్‌రావు, శ్రీనివాస్, రమాకాంత్‌రెడ్డి, రవీందర్, వేణు, కిషన్‌రావు, ఏవోలు శ్రీనివాస్, మస్లియొద్దీన్, ఏఎంవీఐలు, ఉద్యోగులు, ఆల్ఫోర్స్, పారమిత, గౌతమీ ఈ టెక్నో పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరిస్తున్నాం..
రవాణాశాఖపరంగా ఆన్లైన్ విధానంలో సమస్యలు వస్తుంటే వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని కమిషనర్ సుల్తానియా తెలిపారు. డీటీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కార్యాలయాల్లో ఉద్యోగులు తక్కువున్నా తమ చేతిలో ఏమీ లేదని, ఉన్న వారితో పనులు చేయిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 45 మంది ఏఎంవీఐలు, 160 మంది కానిస్టేబుళ్ల నియామాకాలు జరుగుతున్నాయని చెప్పారు. జీరో రశీదు సమస్యలపై స్టడీ చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు 2నుంచి దరఖాస్తులన్నీ ఆన్లైన్లోనే చేసుకోవాలని, ఈ–సేవా, ఆన్లైన్లోనే డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇందులోని సమస్యలను పరిష్కరించడానికి 15రోజుల గడువు తీసుకుని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. వాహన రిజిస్ట్రేషన్‌కు సంబంధించి షోరూమ్‌ల్లో అధిక డబ్బులు వసూలు చేస్తే డీలర్షిప్ రద్దు చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు ఎంవీఐల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్లక్ష్యంతో పేరుతో తీసిన సీడీని ఆవిష్కరించారు. అనంతరం ఆఫీసులో కౌంటర్లను పరిశీలించి దరఖాస్తుదారులతో మాట్లాడారు.