'ఆమె నా కూతురైనందుకు గర్వపడుతున్నా'
ఢిల్లీ: అత్యున్నత క్రీడా పురస్కారాలలో ఒకటైన అర్జున అవార్డుకు టీమిండియా మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్‌కౌర్ పేరును ప్రతిపాదించడంపై ఆమె తండ్రి హర్మందర్ సింగ్ బుళ్లార్ హర్షం వ్యక్తం చేశారు. ఆడపిల్లలు భారమని ఎందరో తల్లిదండ్రులు భావిస్తుంటారు కానీ ఆడపిల్లకు తండ్రిని కావడం తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. కూతురిగా హర్మన్‌ప్రీత్‌ను అందించిన దేవుడికి రుణపడి ఉంటానన్నారు. తన కూతురు హర్మన్ ప్రీత్ పేరును అర్జున అవార్డు కోసం పరిగణనలోకి తీసుకున్నందుకు ప్రభుత్వానికి, బీసీసీఐకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఇటీవల ఇంగ్లండ్‌లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో హర్మన్ ప్రీత్ పలు కీలక ఇన్నింగ్స్ ఆడింది. ముఖ్యంగా సెమీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారీ సెంచరీతో జట్టును ఫైనల్ చేర్చడం ఒకటి. భుజం గాయం బాధిస్తున్నప్పటికీ.. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లోనూ హాఫ్ సెంచరీతో హర్మన్ ప్రీత్ కీలక ప్రదర్శణ చేసింది.
మన జాతీయ క్రీడైన హాకీలో సుదీర్ఘకాలంగా ముఖ్య భూమిక పోషిస్తున్న మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్, పారా ఒలింపియన్ దేవేందర్ ఝఝారియాను ఖేల్ రత్న అవార్డుకు ప్రతిపాదించగా.. అర్జునకు సిఫారుసు చేసిన వారిలో క్రికెటర్లు చటేశ్వర పుజరా(పురుష క్రికెటర్), హర్మన్ ప్రీత్ కౌర్ (మహిళా క్రికెటర్)లతో పాటు పారా ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన మరియప్పన్ తంగవేలు, వరుణ్ భాటి, గోల్ఫర్ ఎస్ ఎస్ పీ చవ్రాసియా, హాకీ ఆటగాడు ఎస్ వీ సునీల్ సహా 17 మంది ఉన్నారు.