ట్రంప్ అనంతర కంపు
ఆయన అధ్యక్షుడైన తర్వాత 200పైగా విద్వేష ఘటనలు
తాజాగా సిక్కు యువకుడిపై దాడి
బోస్టన్: విద్వేష ప్రచారాలతో ఊదరగొట్టిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత అగ్రరాజ్యంలో విద్వేష ఘటనలు పెరిగిపోతున్నాయి. ట్రంప్ గెలిచిన తర్వాత అమెరికా అంతటా ఇప్పటివరకు 200కుపైగా విద్వేషపూరిత హింసా ఘటనలు, బెదిరింపులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ముస్లింలు, విదేశీయులు లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. తాజాగా ప్రతిష్టాత్మక హార్వర్డ్ లా స్కూల్లో చదువుతున్న 22 ఏళ్ల సిక్కు విద్యార్థి కూడా ఈ విద్వేషం బారిన పడ్డాడు. హార్వర్డ్ వర్సిటీలో మొదటి సంవత్సరం చదువుతున్న హర్మాన్సింగ్ను తాజాగా ఓ వ్యక్తి బెదిరించాడు. హర్మాన్ను ముస్లిం అనుకొని.. అతన్ని దూషిస్తూ వేధించాడు.
మసాచుసెట్స్ కేంబ్రిడ్జ్లోని ఓ దుకాణంలో షాపింగ్ చూస్తుండగా వెనుక నుంచి ఓ వ్యక్తి వచ్చి.. ‘అక్కడ చూడండి ముస్లిం వ్యక్తి’ అంటూ వేధింపులు ప్రారంభించాడు. ఆ సమయంలో నేను మా అమ్మతో ఫోన్లో మాట్లాడుతున్నా..ముస్లిం అని దూషించినందుకు నేను గతవారంలో ఓ వ్యక్తితో గొడవపడ్డా. ఇప్పుడు నేను ఎక్కడ ఉంటానో చెప్పాలని ఆ వ్యక్తి నాపైకి దూసుకొచ్చాడు. ఫోన్లో మాట్లాడుతున్న అమ్మ అతని మాటలు విని నాకు ఏమైనా అవుతుందేమోనని కంగారు పడింది. అతను నాకు కొద్దిదూరంలోనే నిలబడి గద్దించి మాట్లాడాడు. కానీ దుకాణంలో ఉన్న ఒక్కరూ కూడా ఏమీ మాట్లాడలేదు. అతను నన్ను వెంటాడుతూ దూషించాడు. ఆ సమయంలో నేను పూర్తిగా అమ్మతో ఫోన్లో మాట్లాడుతూ గడిపా’ అని హర్మాన్ సింగ్ ‘ద బోస్టన్ గ్లోబ్’ పత్రికకు తన అనుభవాల్ని వివరించాడు.