సుస్వరవీణాపాణి
ప్రపంచ సంగీతానికి 12 స్వరాలు పునాదులైతే, వాటిపై నిర్మించబడ్డ మేడలు 72 మేళకర్తరాగాలు. మేళకర్తరాగాల కలయికలే ప్రపంచసంగీతం. ఈ 72 మేళకర్త రాగాలను నేర్చుకోవడానికి సంవత్సరాలు పడుతుంది. మరి వాటి గురించి 61/2 నిమిషాల్లోనే తెలుసుకోగలిగితే! ఈ అద్భుతాన్ని వీణాపాణి సాధించారు. సంగీత సరస్వతికి స్వరాభిషేకం చేసిన వీణాపాణి అంతరంగం...ఆయన మాటల్లోనే...
మేళకర్తరాగాలు ప్రపంచ సంగీతానికి తండ్రివంటివి. సరస్వతి దేవి దయతో వీణాపాణి ఆ మేళకర్త రాగాలను జీర్ణించుకుని ఉన్నాడు. అందరికి ఇది ఒక తేలికైన మార్గంలో తెలియాలన్న ఒక ఉదాత్తమైన ఉద్దేశంతో ఓ కొత్తదారిని ఏర్పరచాడు. 72 మేళకర్త రాగాలను 6.30 ని॥పాటగా సంక్షిప్తీకరించాడు. సార్థక నామధేయుడయ్యాడు.
- డా. మంగళంపల్లి బాలమురళీ కృష్ణడ
నాన్నగారి దగ్గర సంగీత సాధన చేస్తున్న రోజుల్లోనే 72 మేళకర్త రాగాల మీద అవగాహన కలిగింది. ఆ రాగాలను కరతలామలకం చేసుకోవడానికి వాటిని నిరంతరం సాధన చేస్తుండేవాడిని 72 మేళకర్త రాగాలను ప్రతి ఒక్కరూ అతి తక్కువ సమయంలో పాడుకునేలా చేయాలనే ఆలోచన కలిగి, నా దృష్టిని ఆ కార్యం మీద కేంద్రీకరించాను. అలా 72 మేళకర్త రాగాలలో తెలుగులో ‘మాతృగీతం’, ‘శ్రీనివాస భక్తిధార’ రచించి, స్వరపరిచాను. ‘పుట్టిన నేలతల్లి, పాలిచ్చిన ముద్దుల తల్లి, మాట మాగాణుల నిచ్చిన తెలుగు తల్లి... ఈ ముగ్గురి తీరు తెలుపగా....’ అంటూ సాగే ‘మాతృగీతం’ మన మాతృభూమినీ, కన్నతల్లినీ, తెలుగు భాషామతల్లినీ ప్రస్తుతిస్తూ నడుస్తుంది. అది ఇవాళ ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. ఇక, రాగాల పేర్లను ఒక మాలలా గుచ్చి, సరిగ్గా అవే రాగాలతో, రాగం పేరును స్వరస్థానాలతో, స్వరస్థానాన్ని రాగం పేరుతో పాడాను. అలాగే, ‘మేళకర్త నామావళి’ని రాగం పేరు, ఆ పక్కనే ‘నమః’ అంటూ చేశాను. సంగీత విద్వాంసులే కాకుండా, సాహితీవేత్తలు సైతం నా ప్రయత్నాన్ని ప్రశంసించారు.
అయితే, ఆ రాగాలన్నీ నోటికి పాడుకొనేందుకు సులభంగా వచ్చేలా అందరూ నేర్చుకొనేలా అందించాలనే తాపత్రయం మనసులో ఉండిపోయింది ఒకరోజున... అమ్మవారిని ధ్యానిస్తూ దీక్షలో కూర్చున్నాను. సంగీతం, కామాక్షి, సరస్వతి అందరూ ఒకటేననే భావన కలిగింది. ఆ తరువాత ఒకరోజు హార్మోనియమ్ ముందు కూర్చుని రాగాలాపన చేయడం ప్రారంభించాను. అదేం మాయో... ముగురమ్మల పుణ్యఫలంగా నా నోటి నుండి రాగంతోపాటు, సాహిత్యం కూడా అలవోకగా వచ్చింది. ‘ఓంకార నాదరూపిణి, శ్రీంకార చిద్విలాసిని, మహామంత్ర బీజాక్షర రూపిణి మహాశక్తి స్వరూపిణి, సుధారస రాగిణి స్వరరాగ భరిత శబ్దార్థభాషిణి...’ అంటూ సాగే ఆ కీర్తన పూర్తయ్యేసరికి మిత్రులందరూ ‘ఈ కీర్తన సంస్కృతభాషలో ఉంది’ అన్నారు. అంతా అమ్మవారి కటాక్షమే కానీ, నా గొప్పతనం కాదని తెలుసుకున్నాను ఈ స్వర కామాక్షిని మొత్తం 72 గంటల నిడివిలో కంపోజ్ చేశాను. కానీ, 72 గంటలు ఎవరు వింటారు. ఇది సరి కాదు, దీన్ని అతి తక్కువ సమయంలోకి కుదించితే అందరూ విని నేర్చుకోగలుగుతారని భావించి, నిడివి తగ్గించుకుంటూ వచ్చాను. చివరకు, ఆరున్నర నిమిషాలకు, ఆ తరువాత మూడున్నర నిమిషాలకు తగ్గించాను.
మరి దీనికి పెద్దల ఆమోదముద్ర పడాలి కదా! 72 మేళకర్త రాగాలలో 72 కీర్తనలు చేసిన వాగ్గేయకారుడైన మంగళంపల్లిగారే నా కీర్తనకూ, నా వినూత్న ప్రయత్నానికీ సరైన న్యాయనిర్ణేత అని భావించాను. ఆయన ప్రియశిష్యుడైన డి.వి.మోహనకృష్ణ నన్ను ఆయన దగ్గరకు తీసుకువెళ్లారు. ముందు నాతో మాట్లాడటానికి పెద్దగా ఆసక్తి చూపని బాలమురళిగారు, నేను గొంతెత్తి ఆరున్నర నిమిషాలలో 72 మేళకర్తల రాగాలూ పలికే ‘స్వర కామాక్షి’ గీతాన్ని ఆలపించగానే, గంట పైగా నాతో మాట్లాడారు. ‘‘భారతీయ సంగీతం ప్రత్యేకించి కర్ణాటక సంగీతం 72 మేళకర్త రాగాలతో సుసంపన్నమైంది. ఈ మేళకర్త రాగాలు ప్రపంచ సంగీతానికి తండ్రి లాంటివి. సరస్వతీదేవి దయతో వీణాపాణి ఆ మేళకర్త రాగాలను జీర్ణించుకున్నారు. 72 మేళకర్త రాగాలనూ పాడేలా ఆరున్నర నిమిషాలకు సంక్షిప్తీకరించారు. సార్థక నామధేయుడయ్యారు. ఈ ప్రక్రియ గిన్నిస్ బుక్లోకి ఎక్కాల్సిన రికార్డు. ఇది అద్భుతం. నేను తప్పక పాడతాను’’ అని హామీ ఇచ్చి, ఆశీర్వదించారు. ఇది నా జీవితంలో అపురూపమైన ఘట్టం. రికార్డింగ్ చేస్తున్నాను. ఈ కీర్తన ప్రపంచానికి ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో చేస్తున్నాను. 72 మంది అతిరథమహారథులైన గాయకులతో, 72 మంది వాద్యకళాకారులతో వ్యక్తిగతంగా రికార్డ్ చేయాలని ఉంది.
భవిష్యత్ ప్రణాళికలు... భవిష్యత్తులో అందరి దేవుళ్ల మీద 72 రాగాలలో కీర్తనలు చేయాలనే సంకల్పం కూడా ఉంది. ఇంకా...‘స్వరనిధి’ పేరుతో ఉచిత సంగీత విశ్వవిద్యాలయం స్థాపించి, సంగీత జ్ఞానాన్ని అందరికీ పంచాలనుకుంటున్నాను. ఇందులో చేరడానికి అర్హత సంగీతం మీద జిజ్ఞాస మాత్రమే.
సంభాషణ: డా. వైజయంతి
బాల్యం నుంచే సంగీత సాధన ప్రారంభించాను. నాకు ప్రపంచంలో ఉన్న గురువు మా నాన్న ఓగేటి లక్ష్మీనరసింహశాస్త్రిగారు. సంగీతం ఆయన దగ్గరే నేర్చుకున్నాను. నాన్నగారు ప్రాథమికంగా ఎలిమెంటరీ స్కూల్ టీచరు. అయితే, ఆయనకున్న సంగీత పరిజ్ఞానం రీత్యా అందరికీ సంగీతం నేర్పుతుండే వారు. పాడడంలో ఏవైనా దోషాలు వస్తే, ఎవరికి వారుగా తెలుసుకుంటూ సరిచేసు కొని నేర్చుకోమంటూ ఉండేవారు.
స్వరవీణాపాణి గారి ఈ సృష్టిని అర్థం చేసుకోవడానికే ఎంతో జ్ఞానం ఉండాలి. ముందుతరాల వారికి ఇది ఉపయోగపడాలన్న వారి కోరిక ఎంతో బాగుంది. భగవంతుడు ఆయనతో ఉండి అందరికీ మంచి జరిగేలా చేయాలి.
- రావు బాలసరస్వతి, సినీ నేపథ్య గాయని
మేళకర్త రాగాలను ఆరున్నర నిమిషాలలో కుదించాలన్న ఆలోచన రావడమే గొప్ప. దాన్ని పూర్తిచేయటం మరో గొప్పవిషయం. వీణాపాణి ఇంకా ఇంకా ఎంతో సాధిస్తారని ఆశిస్తున్నాను.
- ఎస్.జానకి, సినీ నేపథ్యగాయని
మానవాతీతమైన శక్తి ఏదో అతని చేత చేయించింది. ఇది అతడి ఆర్ద్రగానం. ఇతడిని కన్న తల్లిదండ్రులు పుణ్యాత్ములు. ఈ ప్రయత్నానికి అన్ని అవార్డులూ అవే వస్తాయి.
- పి.సుశీల, సినీ నేపథ్యగాయని
వీణాపాణి సాధించింది ఎంతో గొప్ప కార్యం. నేటి బాలలకు ఈ 72 రాగాల పేర్లు మరియు వాటి స్థాయులు గుర్తుపెట్టు కోవడానికి ఇది ఎంతో సులవైన పద్ధతి.
-డా. కె.జె. యేసుదాస్, సినీ నేపథ్య గాయకులు
స్వరవీణాపాణిగారు చేసిన ఈ సృష్టి ఓ మహాద్భుతం. మానవాతీతం. ఇది అర్థం కావడమే కష్టం. అవకాశమిస్తే పాడే ప్రయత్నం చేస్తాను.
- హరిహరన్
సినీ నేపథ్య గాయకుడు
ప్రతి రాగము యొక్క సారము, ఆత్మ ఈ కల్పనలో ఉన్నాయి. ప్రతి రాగాన్ని ఇందులో స్పష్టంగా గుర్తించవచ్చు. ఇది పెద్ద విజయం.
- శంకర్ మహదేవన్,
సినీ నేపథ్య గాయకుడు
స్వరవీణాపాణి గారి 72 మేళకర్త రాగాలలోని ఋతుచక్రను సాధన చేస్తున్నాను. అందరూ త్వరలో విని ఆనందించవచ్చు.
- హెన్నిక్ క్రుప్, దక్షిణ కొరియా
గతంలో విఖ్యాత గాయకులు యం.యస్.సుబ్బులక్ష్మి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, వైణిక శ్రేష్ఠులు బాలచందర్ గార్లు 72 మేళకర్త రాగాలను ప్రదర్శిస్తుండగా సహకరించాను. నాకు గ్రామీ అవార్డు వచ్చింది. ఈ సంగీత ప్రపంచపు సంక్షిప్త రూపానికి గ్రామీతో పాటు మరిన్ని అవార్డులు దక్కాలని ఆశిస్తున్నాను.
- విక్కు వినాయకరామ్, ప్రసిద్ధ ఘట వాద్యకళాకారులు
దీనిని భారతీయ గాయకులంతా గొంతు కలిపి పాడితే ఇది మరింత ఉన్నత శిఖరాలకు చేరుతుంది. అవకాశం ఇస్తే నేను పాడే ప్రయత్నం చేయగలను.
- ఉన్నికృష్ణన్
ప్రముఖ గాయకుడు