మరో విద్వేషపు తూటా!
అమెరికాలో భారత సంతతి వ్యాపారి హర్నీష్ హత్య
-మృతుడి స్వస్థలం గుజరాత్‌లోని వడోదర
- దక్షిణ కరోలినాలో ఆయన ఇంటి వద్దే కాల్పులు
- షాపు మూసి ఇంటికొస్తుండగా దారుణం
- జాత్యహంకార హత్య కాకపోవచ్చంటున్న పోలీసులు
న్యూయార్క్/న్యూఢిల్లీ
అమెరికాలో జాతి విద్వేషం మళ్లీ బుసలు కొట్టింది! తెలుగు ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్‌ను పొట్టనబెట్టుకున్న కాన్సస్ జాత్యహంకార కాల్పులను మరవక ముందే అమెరికాలో మరో భారతీయుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈసారి తూటాలకు బలైంది ఓ గుజరాతీ వ్యాపారి. దక్షిణ కరోలినా రాష్ట్రంలోని లాంకాస్టర్ కౌంటీలో కిరాణా షాపు నిర్వహిస్తున్న హర్నీష్ పటేల్ (43)ను గురువారం అర్ధరాత్రి(అమెరికా కాలమానం ప్రకారం) ఓ దుండగుడు ఆయన ఇంటి వెలుపలే తుపాకీతో కాల్చి చంపాడు.
రాత్రి 11:24 ప్రాంతంలో తన ‘స్పీడీ మార్ట్’షాపును మూసేసి 6 కి.మీ. దూరంలోని ఇంటికి టయోటా మినీ వ్యాన్‌లో వెళ్లిన పటేల్.. పది నిమిషాలు కూడా గడవకముండే హత్యకు గురయ్యాడు. తుపాకీ కాల్పులు, అరుపులు విన్నానంటూ ఒక మహిళ 11:33కు పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి చూడగా తన ఇంటికి కొన్ని అడుగుల దూరంలోనే పటేల్ రెండు తూటా గాయాలతో విగతజీవిగా కనిపించాడు. పోలీసులు ఆ ప్రాంతం నుంచి రెండు ఖాళీ తూటాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసు జాగిలం ఏ వాసనా పసిగట్టకుండా అక్కడే ఆగిపోయింది. పటేల్ వాహనాన్ని దుండుగుడు అడ్డుకుని కాల్పులు జరిపి ఉండొచ్చని అధికారులు చెప్పారు. ఈ హత్య ఒక్కరే చేశారా, లేకపోతే కొందరు కలసి చేశారా అన్నది తెలియడం లేదు.
పోలీసు అధికారి ఆఫీసుకు సమీపంలోనే దుకాణం
పోలీసు అధికారి కార్యాలయానికి సమీపంలోనే పటేల్ దుకాణం ఉంది. డిప్యూటీ పోలీసు అధికారులు తరచూ ఈ దుకాణానికి వస్తుంటారు. గుజరాత్‌లోని వడోదరకు చెందిన పటేల్ బతుకు తెరువు కోసం అమెరికా వెళ్లాడు. ఆయనకు భార్య సోనాల్, కుమారుడు సిద్ధాంశ్ ఉన్నారు. హత్య సమయంలో వారు ఇంట్లో ఉన్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక వలసదారులపై జాతివిద్వేష దాడులు, హత్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఈ దారుణం వెనుక కూడా జాతివివక్ష కోణం ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఇది జాత్యహంకార హత్య అని భావించడానికి కారణాలు కనిపించడం లేదని స్థానిక పోలీసు అధికారి బారీ ఫైలీ చెప్పారు. హత్యపై అక్కడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారని, అట్లాంటాలోని తమ కాన్సులేట్ జనరల్ బాధిత కుటుంబాన్ని సంప్రదించిందని భారత విదేశాంగ శాఖ అధికారి ఒకరు చెప్పారు. అధికారులు మృతుడి కుటుంబాన్ని కలుసుకోనుందన్నారు.
పటేల్ స్పీడీ మార్ట్ దుకాణం(ఇన్సెట్లో కుటుంబ సభ్యులతో హర్నీష్ పటేల్)
డబ్బులు లేకపోయినా సరుకులు ఇచ్చేవాడు..
మంచి మనిషిగా అందరి ఆదరాభిమానానాలు చూరగొన్న పటేల్ హత్యపై స్థానికులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అతణ్ని ఎందుకు చంపారో తమకు అర్థం కావడం లేదంటున్నారు. పలువురు పటేల్ షాపు వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళి అర్పించారు. దుకాణానికి వచ్చేవారితో పటేల్ స్నేహపూర్వకంగా ఉండేవాడని, ఎవరి వద్దయినా కొనడానికి డబ్బుల్లేకపోతే ఆహార పదార్థాలను ఉచితంగానే ఇచ్చేవాడని స్పీడీ మార్ట్‌కు వెళ్లే నికోల్ జోన్స్ అనే మహిళ కన్నీటి పర్యంతమవుతూ చెప్పింది. పటేల్ తనకు గతంలో ఉద్యోగం ఇచ్చాడని, కష్ట సమయాల్లో ఆదుకున్నాడని మారియో శాడ్లర్ తెలిపారు. షాపు ఉద్యోగులు బాగుండాలని తమ యజమాని తపించేవాడని స్పీడీ మార్ట్ ఉద్యోగి కీరా బాస్కిన్ చెప్పారు.
హైదరాబాద్‌కు చేరుకున్న శ్రీనివాస్ మృతదేహం
‘కాలుస్తుంటే ఏదో ఒకటి చేయాలనిపించింది’
అమెరికాలో ప్రమాదం ఇలా తప్పించుకోండి
అమెరికాలో భారతీయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
అమెరికాలో జాతి విద్వేష కాల్పులు
విద్వేషపు తూటా!
మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా?
భారతీయుల రక్షణకు కట్టుబడి ఉండాలి
కాల్పులపై శ్వేతసౌదం ఏం చెబుతుందో?
నా భర్త మరణానికి సమాధానం చెప్పాలి
‘తరిమేయండి.. లేదా తలలో బుల్లెట్లు దించండి’