బోరుబావి నుంచి బాలుడ్ని రక్షించిన రోబో
చెన్నై: బోరు బావిలో పడిన మూడేళ్ల బాలుడ్ని రోబో పరికరం సాయంతో రక్షించారు. తమిళనాడు తిరునల్వేలి జిల్లా శంకరన్ కోరుుల్ సమీపంలోని కుత్తాలంపేరి గ్రామంలో ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. గణే షన్ అనే వ్యక్తి కుమారుడు హర్షన్(3)తో కలసి సోమవారం ఉదయం పొలానికి వెళుతుండగా బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. షాక్ నుంచి తేరుకున్న గణేషన్.. వెంటనే తనయుడికి ధైర్యాన్ని నూరిపోశాడు. ‘‘అక్కడే ఉండు.. ఆడుకుందాం... నేనూ లోపలికి వస్తున్నా..’’ అంటూ బాలుడిలో భయాన్ని తొలగించాడు. వెంటనే అధికారులకు సమాచారమందించడంతో ఘటనాస్థలికి అంబులెన్స్‌లు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
బాలుడు 15 అడుగుల లోతులో ఉన్నట్టు గుర్తించారు. మదురైకు చెందిన మణిగండన్, రాజ్‌కుమార్, తిరునావుక్కరసు, వల్లరసుల నేతృత్వంలోని బృందం బోరుబావుల్లో పడిన పిల్లల్ని రక్షించేందుకు అత్యాధునిక పరికరాలతో కూడిన ప్రత్యేక రోబోను ఇటీవల తయారుచేసింది. ఈ బృందానికి అధికారులు సమాచారమిచ్చారు. మదురై నుంచి గంటన్నర వ్యవధిలో ఘటనాస్థలికి చేరిన బృందం రోబోను బోరుబావిలోకి చాకచక్యంగా పంపించింది. ఆ బాలుడ్ని సురక్షితంగా బయటకు తీసింది.