సాగు.....జాగు !
=నీటి విడుదలకు సర్కారు పచ్చజెండా
=సమాయత్తంకాని వ్యవసాయ శాఖ
=అధికారుల సమన్వయలోపం.. రైతుకు శాపం
=జిల్లాలో దాళ్వాపై కొరవడిన స్పష్టత
సాక్షి, మచిలీపట్నం : డెల్టా ఆధునికీకరణ సాకుతో జిల్లాలో రెండేళ్లుగా దాళ్వా లేదు. కృష్ణా ఈస్ట్ బ్రాంచి (కేఈబీ) కెనాల్‌పై ఉన్న ఆయకట్టుకు మాత్రం మూడేళ్లుగా రబీ సాగు ఇవ్వలేదు. పోనీ ఆధునికీకరణ పనులన్నా బాగా జరిగాయా అంటే అదీ లేదు. గత మూడేళ్లలో కేవలం 20 శాతం మాత్రమే అయ్యాయనిపించారు. సాగునీరివ్వలేక డెల్టా ఆధునికీకరణ ముసుగు వేసి జిల్లా రైతాంగానికి రబీసాగు లేకుండా మొండిచెయ్యి చూపించారు.
ఎట్టకేలకు దాళ్వాకు నీరిస్తామని ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి సమావేశం నిర్ణయించింది. జిల్లాలో సుమారు మూడు లక్షల ఎకరాల్లో వరి, మరో 3.50 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలకు సాగునీరు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ నెలాఖరులోగా నీటి విడుదలకు నీటిపారుదల శాఖ కసరత్తు చేస్తోంది. సాగునీటి విడుదల జాప్యంతో దాళ్వా సాగు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. నెలాఖరులోగా నీటిని విడుదల చేస్తే అప్పుడు నారుమళ్లు వేస్తే వరినాట్లు వేసేసరికి జనవరి నెలాఖరు, ఫిబ్రవరి మొదటి వారం అవుతుంది.
రైతుల్లో అయోమయం..
సాగు విషయంలో అధికారికంగా ఇప్పటికీ స్పష్టతలేకపోవడంతో రైతుల్లో అయోమయం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కాలువలు, డ్రైయిన్లను ఆనుకుని ఉన్న రైతులు ఆయిల్ ఇంజిన్ల సాయంతో నీరు తోడుకుని వరి నారుమడులు సిద్ధం చేసుకుంటున్నారు. దాళ్వా ఉంటుందో లేదో తెలియక మరికొన్ని చోట్ల ఆరుతడి పంటలవైపు రైతులు దృష్టి పెట్టారు.
భారీ వర్షాలు, తుపానులకు జరిగిన పంట నష్టాల అంచనాలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టిన వ్యవసాయ శాఖ.. దాళ్వాను మరిచిపోయినట్లుంది. దాళ్వాకు అనుమతిస్తే ఎకరాకు కనీసం 25 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. ఈ లెక్కన కనీసం మూడు లక్షల ఎకరాల్లో సాగుకు 75 లక్షల కిలోల వరి విత్తనాలు కావాల్సి ఉంటుంది. దాళ్వాలో ఎంటీయూ 1001, ఎంటీయూ 1010 రకాలను రైతులు సాగు చేస్తారు. రైతుల వద్ద ప్రస్తుతం విత్తనాలు ఉండే అవకాశం లేనందున ఏపీ సీడ్స్ కార్పొరేషన్, ఇతర ప్రైవేటు విత్తన వ్యాపారుల వద్ద విత్తనాలను సిద్ధం చేయడంలో వ్యవసాయ శాఖ దృష్టి సారించాల్సి ఉంది. దీనికితోడు రబీ సాగుకు అవసరమైన ఎరువులను కూడా తగినంత నిల్వలను సిద్ధం చేసేలా వ్యవసాయ శాఖ ఇప్పటి నుంచే కసరత్తు చేయాల్సి ఉంటుంది.