'గర్విస్తున్నా.. నీది గొప్ప నిర్ణయం తల్లి'
న్యూఢిల్లీ: తనను నడిరోడ్డుపై వెంబడించి వేధించారంటూ హరియాణా బీజేపీ చీఫ్ సుభాష్ బరాల కొడుకు వికాస్ బరాలాపై ఫిర్యాదు చేయడంతోపాటు ఈ కేసు విషయంలో పోరాటం తీవ్రతరం చేసిన బాధితురాలు వర్ణికా కుందుకు ఆమె తండ్రి ఐఏఎస్ అధికారి వీరేందర్ కుందు మరింత అండగా నిలిచారు. ఆమె తీసుకున్న నిర్ణయంపట్ల హర్షం వ్యక్తం చేశారు. మన సమాజంలో పేరుకుపోయిన దురాభిమానంపై నువ్వు పోరాటం చేయాలని నిర్ణయించుకున్నందుకు గర్వంగా ఉంది. ఈ కేసు ద్వారా ఒక ఐఏఎస్ అధికారిని అయిన తనకు ఎలాంటి సమస్యలు వస్తాయోనని నువ్వు అస్సలు ఆలోచించకు. నా జీవితానికి ఈ కేసుకు ముడిపెట్టుకొని భయపడకు' అంటూ ఆమెకు ధైర్యం నూరి పోశారు.
ఎట్టి పరిస్థితుల్లో నేరస్తులను విడిచిపెట్టకూడదని, వారికి శిక్షపడాల్సిందేనని ఆయన ఫేస్బుక్లో రాసుకొచ్చారు. ప్రశాంతంగా ఉన్న జీవితాలు గందరగోళంగా మారుతాయేమోనని నేరస్తులను ఎట్టిపరిస్థితుల్లో విడిచిపెట్టకూడదని ఆయన పోస్ట్‌లో చెప్పారు. హరియాణాలో ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్న వీరేందర్ కుందు కుమార్తె ఒంటరిగా కారులో వెళుతుండగా వికాస్ బారాల అతడి స్నేహితుడు వేధించే ప్రయత్నం చేశారు. ఆమెను నడిరోడ్డుపై వెంటాడారు. చండీగఢ్‌లో శుక్రవారం రాత్రి బాధితురాలు కారులో తన ఇంటికి వెళ్తుండగా.. మద్యం మత్తులో ఉన్న వికాస్, అతని స్నేహితుడు ఆశిష్ తమ ఎస్యూవీ వాహనంలో తరిమారు.
కారు ఆపాలని యువతిని పదే పదే హెచ్చరించారు. దీంతో ఆమె పోలీస్ హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేసి విషయాన్ని తెలిపింది. పోలీసులు అక్కడికి చేరుకునేలోగా ఆమెను నిలువరించి మరీ ఆ ఇద్దరూ వేధించారు. దీంతో పోలీసులు సంఘటనాస్థలంలోనే వికాస్‌ను, ఆశిష్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం పోలీసులు ఇద్దరు నిందితుల్ని బెయిల్‌పై విడుదల చేశారు. రాజకీయ ప్రాబల్యమున్న కుటుంబానికి చెందిన నిందితులపై పోలీసులు కిడ్నాప్ అభియోగాలు నమోదుచేయకపోవడంతో హరియాణాలోని బీజేపీ సర్కారుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.