నేనా.. దావూద్ ఇబ్రహీమా!!
ప్రస్తుతం పాకిస్తాన్లో తలదాచుకున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం జీవితచరిత్ర ఆధారంగా వస్తున్న ''హసీనా: ద క్వీన్ ఆఫ్ ముంబై'' సినిమాలో దావూద్ పాత్రను ఎవరు పోషిస్తున్నారో తెలుసా.. హీరోయిన్ శ్రద్ధాకపూర్ సోదరుడు, అలనాటి గ్రేట్ విలన్ శక్తికపూర్ తనయుడు సిద్ధాంత్ కపూర్! సినిమా దర్శకుడు అపూర్వ లఖియా ఈ ఆఫర్‌తో తన వద్దకు వచ్చినప్పుడు అసలు సిద్ధాంత్ నమ్మలేకపోయాడు. తాను దావూద్ లాంటి బలమైన పాత్రను ఎలా పోషించగలనన్న అనుమానం వచ్చింది. దాంతో ముందు ఇంటికి వెళ్లి, తన తండ్రి శక్తికపూర్ పాత కాలంలో వేసుకున్న కోట్లు, ధరించిన గాగుల్స్ తీసుకుని వాటితో తన స్నేహితుడితో ఒక ఫొటోషూట్ చేయించుకున్నాడు. వీలైనంత వరకు అచ్చం దావూద్ ఇబ్రహీం స్టైల్లో కుర్చీలో కాళ్ల మీద కాళ్లు వేసుకుని కూర్చోవడం లాంటివి చేశాడు. ఆ ఫొటోలు చూసిన లఖియా.. వెంటనే ''నువ్వే నా దావూద్ ఇబ్రహీం" అన్నాడట.
ఇప్పటికే 'డి డే', 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై దొబారా' సినిమాల్లో దావూద్ ఇబ్రహీం పాత్రలను రిషి కపూర్, అక్షయ్ కుమార్ లాంటి అగ్రనటులు పోషించారు. వాళ్లకంటే చాలా భిన్నంగా కనిపించాలని, ఇంతకుముందు అంతటి సీనియర్లు పోషించిన పాత్రను ఇప్పుడు తాను చేయాలంటే కొంచెం బరువు పెంచాలని కూడా సిద్ధాంత్ అన్నాడు. దావూద్ 17 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసు వరకు ఎలా ఉంటాడో ఆ పాత్రను తాను పోషిస్తున్నానని, ఏ సినిమాలోనూ దావూద్ అంతటి తక్కువ వయసులో ఉండగా ఎవరూ చూడలేదని చెప్పాడు. పుస్తకాలు చదివి, వర్క్‌షాప్‌లకు హాజరై, పలువురితో మాట్లాడి దావూద్ గురించి తెలుసుకుంటున్నానని తెలిపాడు. తన తండ్రి శక్తికపూర్ చాలా నెగెటివ్పాత్రలు పోషించారని, అందువల్ల ఈ పాత్ర ఎలా చేస్తే బాగుంటుందో ఆయనను కూడా అడుగుతానని అన్నాడు. 70లు, 80లలో ఎలాంటి దుస్తులు వేసుకునేవారో తన తండ్రి తనకు చెప్పారని, ఈ పాత్ర తప్పకుండా పోషించమన్నారని తెలిపాడు. హసీనా సినిమా ఈ ఏడాదే విడుదల అవుతుందని అపూర్వ లఖియా అంటున్నారు.