చేనేత కళాకారులకు ఇళ్లు, బీమా
=కేంద్ర మంత్రి కావూరి
=శిల్పారామంలో ‘హస్తకళామేళా’ ప్రారంభం
=31 వరకు కొనసాగనున్న మేళా
మాదాపూర్, న్యూస్‌లైన్: చేనేత కళాకారులకు జీవిత బీమా, గృహ వసతులను కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర టెక్స్టైల్స్ శాఖా మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. శిల్పారామంలో ఈ అఖిల భారత హస్తకళా మేళా ఆదివారం అట్టహాసంగా ఆరంభమైంది. ఈ మేళాను రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి వట్టి వసంతకుమార్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా కావూరి మాట్లాడుతూ చేనేత కళాకారులు ఉత్పత్తి చేసిన వస్తువుల్ని నేరుగా వినియోగదారులకు అమ్ముకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. యంత్రాలు రావడంతో వారు తయారుచేసిన అనువైన వస్తువులు మరుగును పడుతున్నాయని, అలాంటి వారికి ఇదో మంచి అవకాశమని చెప్పారు. పదిహేను రోజుల పాటు కొనసాగనున్న మేళాలో రూ.12కోట్ల వ్యాపారం జరగనున్నట్లు అంచనా అని మంత్రి కావూరి తెలిపారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 600 మంది కళాకారులు ఈ క్రాఫ్ట్ మేళాలో పాల్గొంటున్నారు. మేళాలో ఏర్పాటు చేసిన స్టాళ్ళను మంత్రులు సందర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చందనాఖాన్, రాష్ట్ర పర్యాటక భవన్ ప్రత్యేక అధికారి కిషన్‌రావు, శిల్పారామం ప్రత్యేకాధికారి జీఎన్‌రావు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ప్రదర్శనలు...
హస్తకళామేళా ప్రారంభానికి ముందు శిల్పారామంలో నిర్వహించిన వివిధ ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కృష్ణాజిల్లా మోపిదేవి గ్రామానికి చెందిన దుర్గానాగేశ్వరసాయి డప్పు బృందం డప్పు ప్రదర్శన, విజయనగరం జిల్లాకు చెందిన ముత్య అప్పన్న బృందం నిర్వహించిన తప్పెట గుళ్ళ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్నాయి.