'నా సినీ జీవితానికి ఆయనే మార్గదర్శి'
విజయవాడ: రేలంగి నరసింహారావు తెలుగు చిత్రసీమలో హాస్యచిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్. కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రాలకు దర్శకత్వం వహించిన హాస్య చక్రవర్తి ఆయన. కెమెరామెన్ కావాలని చిత్రసీమలో ప్రవేశించి సహాయ దర్శకునిగా జీవితాన్ని ప్రారంభించి స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి దర్శకత్వ బాధ్యలు చేపట్టి 75కు పైగా చిత్రాలకు దర్శతక్వం వహించారు. రేలంగి స్కోర్మోర్ సంస్థ ప్రదానం చేసే హాస్యరత్న పురస్కారం అందుకోవటానికి విజయవాడ వచ్చిన సందర్భంలో సాక్షితో ప్రత్యేకంగా ముచ్చటించారు.
సాక్షి : 45 ఏళ్లు సినీప్రస్థానంలో మీరు ఏమి నేర్చుకున్నారు?
నరసింహారావు : క్రమశిక్షణ, వృత్తిపట్ల అంకితభావం, వ్యసనాలకు దూరంగా ఉండటం.
సాక్షి : మీరోల్ మోడల్?
నరసింహారావు : దర్శకరత్న దాసరి నారాయణరావు, నా సినీ జీవితానికి ఆయనే మార్గదర్శి.
సాక్షి : మీ తొలి సంపాదన?
నరసింహారావు : సహాయ దర్శకునిగా 125 రూపాయలు
సాక్షి : సీనియర్ దర్శకునిగా నేటి సినిమాలను చూస్తే మీకేమనిపిస్తోంది.?
నరసింహారావు : అప్పట్లో సినీ రంగంలో టీమ్ వర్కు ఉండేది. ఇప్పుడంతా మనీ మైండ్.
సాక్షి : తెలుగు సినిమాల పరిస్థితి?
నరసింహారావు : చిన్న సినిమాల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. రిలీజ్కు థియేటర్లు లేవు.
సాక్షి : సినిమా పరిశ్రమంతా ఐదు కుటుంబాల చేతిలోనే ఉందన్న నిజాన్ని అంగీకరిస్తారా?
నరసింహారావు : తప్పక అంగీకరిస్తా. పరిశ్రమేకాదు.. థియేటర్లు కూడా వారి చెప్పుచేతల్లోనే ఉన్నాయి.
సాక్షి : మీ విజయానికి కారణం?
నరసింహారావు : నేను దర్శకత్వం వహించిన ‘నేను మా ఆవిడ’ విజయంతో విజయాల దారి తెలిసింది.
సాక్షి : ప్రతి వాని విజయం వెనుక ఎవరో ఒకరు ఉంటారు కదా? మీ వెనుక ఎవరున్నారు?
నరసింహారావు : దాసరి. ఆయన తెరిచిన పుస్తకం. నడిచే సినీ దేవాలయం. ఆయన లేని రేలంగి లేడు.
సాక్షి : మీరు మర్చిపోలేని సంఘటన?
నరసింహారావు : ఏంటిబావా మరీను చిత్రంలో కాస్త శృంగారం శృతి మించింది. విజయవాడలోని ఒక మీట్లో ఒకామె అడిగారు మీనుంచి మేం ఆశించేది ఇటువంటి సినిమాలు కాదని నాబాధ వర్ణనాతీతం. దీంతో అటువంటి చిత్రాలు తియ్యడం అదే మొదలు.. అదే చివర.