Hatha yoga
-
ఆసనాలను క్రమపద్ధతిలోనే ఎందుకు చేయాలి?
యెగా ఈ రోజుల్లో హఠయోగా వికృతరూపం తీసుకుంది. దీనికి కారణం అందరూ దీనిని ఒక సర్కస్లాగా తయారు చేయడమే. పశ్చిమదేశాల్లో ఇది జరుగుతున్న తీరు చూస్తుంటే నాకు భయం అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ యోగా పేరుతో అన్ని రకాల పిచ్చి పనులు చేయబడుతున్నాయి. యోగాసనాలు ఒక వ్యాయామం కాదనీ, అవి మీ ప్రాణశక్తిని ఒక నిర్దిష్ట దిశలో ఉత్తేజపరిచే సున్నితమైన ప్రక్రియలనీ మీరు అర్థం చేసుకోవాలి. వీటిని చాలా సున్నితంగా వీలైనంత అవగాహనతో చేయడం చాలా ముఖ్యం. ఆసనాలను ఒక నిర్దిష్ట క్రమపద్ధతిలో చేయాలి. ఈ క్రమపద్ధతి మీరో, నేనో కనిపెట్టినది కాదు. ఇది మానవ వ్యవస్థ ఎలా పని చేస్తుందనే దాన్ని గమనించడం వల్ల వచ్చినది. మీ వ్యవస్థలో అస్థిపంజర వ్యవస్థ సౌఖ్యం, కండరాల సౌఖ్యం, అవయవ సౌఖ్యం, ప్రాణశక్తి సౌఖ్యం అనేవి ఉంటాయి. ఉదాహరణకు మీరు ఒక ఏటవాలుగా ఉన్న కూర్చీలో కూర్చుంటే మీ కండరాలు సౌకర్యంగా ఉంటాయి కానీ, మీ కీళ్ళు, అవయవాలు ఇబ్బందికి గురవుతాయి. మీ ఉదర భాగంలోని ముఖ్యమైన అవయవాలు గట్టిగా నట్లు, బోల్టులతో బిగించబడి ఉండవు. అవి కణజాల బంధనంతో వేలాడతీయబడి ఉంటాయి. అందువల్ల ఏటవాలుగా ఉన్న కుర్చీలో కూర్చుంటే వాటికి సౌకర్యంగా ఉండదు. హఠయోగాలో ప్రాణశక్తి సౌఖ్యం కూడా పరిగణించబడుతుంది. మీ ప్రాణశక్తిలోని ఒక అంశాన్ని ఉత్తేజపరచకుండా మరొక అంశాన్ని ఉత్తేజపరిస్తే, మీ వ్యవస్థ గందరగోళానికి గురి అయ్యేటట్లు మీ ప్రాణశక్తి అస్థవ్యస్థంగా పని చేస్తుంది. అస్థవ్యస్థ శక్తి అంటే మీరు అస్థవ్యస్థంగా జీవిస్తున్నారని అర్థం. మీరు ఎక్కువ రోజులు జీవించవచ్చు, లాటరీ గెలవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, రోజుకు 24 గంటలు పూజ చేయవచ్చు. కానీ మీరు ఎప్పుడూ సంపూర్ణమైనవారు కాలేరు. మీరు ఏమి చేసినా సరే, మీది ఒక అస్థవ్యస్థ జీవనమే అవుతుంది. ఆసనాలు క్రమపద్ధతిలో చేయడం ద్వారా మానవ వ్యవస్థను ఒక చివరి నుంచి మరొక చివరి వరకు ఒక క్రమపద్ధతిలో ఉత్తేజపరచవచ్చు. జీవన పరిస్థితులు అకస్మాత్తుగా మారవచ్చు. అవి ఎలా మారితే మీరు అలా పని చేయవలసి రావచ్చు. మీరు వ్యవస్థను ఒక పద్ధతిలో ఉత్తేజపరిస్తే, ఏది జరిగినా మీ వ్యవస్థను కలత పెట్టకుండా మీరు వాటిని ఎదుర్కోగలరు. ఎవరైనా దీన్ని స్పష్టంగా చూడొచ్చు. మీరు సరైన సాంప్రదాయ హఠయోగాని చేస్తే ఎలాంటి పరిస్థితులు వచ్చినా అవి మిమ్మల్ని చెదరగొట్టలేవు. ప్రేమాశీస్సులతో - మీ సద్గురు గమనిక: గత వారం ‘యోగా’ శీర్షిక కింద ఇచ్చిన ‘ప్రాణాయామం’ వివరాలు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఇచ్చినవి కావు. -
మనిషిపై సూర్యచంద్రుల ప్రభావం ఉంటుందా?
సద్గురు జగ్గీ వాసుదేవ్ www.sadhguru.org యోగా యోగాలో, హఠయోగా ఒక సన్నాహక ప్రక్రియ. హ అంటే సూర్యుడు. ఠ అంటే చంద్రుడు. మీలోని సూర్యచంద్రుల మధ్య, లేదా ఇడ, పింగళ అనే నాడుల మధ్య సమతుల్యతను తీసుకువచ్చే యోగానే హఠయోగా. హఠ అంటే మీ శరీరానికి కారణభూతమైన ఈ రెండు ముఖ్య అంశాల మధ్య ఒక విధమైన సమన్వయం తీసుకురావటం! ఈ భూమిపై ఉన్న జీవాన్ని ప్రభావితం చేయటంలో ఈ విశ్వంలోని అన్నిటి కంటే కూడా సూర్యుడు చాలా ప్రధానమైనవాడు. సూర్యుడు మన గ్రహం మీద ఉన్న జీవానికి మూలం. మనం తినే తిండి, తాగే నీరు, పీల్చుకునే గాలి ఇలా ప్రతీ దాంట్లో సూర్యుడి పాత్ర ఉంటుంది. సూర్య కిరణాలు ఈ గ్రహం మీద పడకపోతే, జీవ మనుగడకు అవకాశమే లేదు. అంతా ముగిసిపోతుంది. ఇప్పుడు అకస్మాత్తుగా సూర్యుడు అదృశ్యమైపోతే, 18 గంటల్లో అన్నీ గడ్డకట్టుకుపోతాయి. సముద్రాలన్నిటితో పాటు మీ రక్తం కూడా! అసలు ఈ గ్రహం మీద ఉత్పత్తి అయ్యే వేడి అంతా కూడా వివిధ మార్గాల్లో వ్యక్తమయ్యే సౌరశక్తి! చంద్రుడి వివిధ స్థానాలు కూడా మనిషి శారీరక, మానసిక వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి. భారతదేశంలో చంద్రుడి స్థానం ప్రతిరోజూ పరిగణనలోకి తీసుకోబడుతుంది. చంద్రుని వివిధ స్థానాలను మానవ శ్రేయస్సుకు ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది ఈ సంప్రదాయంలో ఎప్పుడో తెలుసుకున్నారు. మీరు ఒక స్థాయి ఎరుక(అవేర్నెస్), గ్రహణశక్తితో ఉంటే, చంద్రుని ప్రతీ దశలో మీ శరీరం కొంత భిన్నంగా ప్రవర్తించడం మీరు గమనిస్తారు. మహిళల్లోని పునరుత్పత్తి ప్రక్రియ, అంటే అసలు మానవ జనన ప్రక్రియే చంద్ర భ్రమణంతో చాలా లోతుగా అనుసంధానమై ఉంది. అంటే, భూమి చుట్టూ జరిగే చంద్ర భ్రమణం, మనిషిలో సంభవించే పునరావృత స్థితులు ఈ రెండూ చాలా లోతుగా అనుసంధానమై ఉంటాయి. మీ జీవితంలోని ప్రతీ క్షణం, మీరు చేసే ప్రతీ విషయం ఈ రెండు శక్తులచే, అంటే సూర్యచంద్రులచే నియంత్రించబడుతుంది. అందుకే, భౌతికంగా మనం చేసే ఆధ్యాత్మిక సాధన అంతా కూడా ఈ ప్రకృతి చక్రాలతో, అంటే సూర్యచంద్రభ్రమణాలతో మనల్ని మనం అనుసంధానం చేసుకోవటం కోసమే! ప్రేమాశీస్సులతో - సద్గురు