‘హవా హవాయ్’లో అతిథిగా..?
అందం, అభినయానికి చిరునామాగా నిలిచే తారల్లో శ్రీదేవి ఒకరు. ఒకప్పుడు వెండితెరను ఓ స్థాయిలో ఏలిన శ్రీదేవి చాలా విరామం తర్వాత ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం సక్సెస్ అయిన నేపథ్యంలో ఆమెకు చాలా అవకాశాలు వస్తున్నాయి. వాటిలో ‘హవా హవాయ్’ అనే సినిమా ఒకటి. ఇందులో ఉన్న అతిథి పాత్రను శ్రీదేవితో చేయించాలనుకున్నారట చిత్ర దర్శకుడు అమోల్ గుప్తా.
గతంలో శ్రీదేవి నటించిన చిత్రాల్లో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘మిస్టర్ ఇండియా’లో ’కెహతే హై ముజ్కో హవా హవాయ్..’ అనే పాట ఎంత హిట్టయ్యిందో చాలామంది తెలుసు. ఆ పాటకు గొప్ప ఆదరణ లభించిన కారణంగా శ్రీదేవిని ‘మిస్ హవా హవాయ్’ అనేవాళ్లు. ఈ కారణంగా ఈ ‘హవా హవాయ్’ చిత్రంలో శ్రీదేవిని నటింపజేయాలని, అతిథి పాత్ర ఆమె చేస్తేనే ప్లస్ అవుతుందని అమోల్ భావించారట. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు, ఓ పాటలో కనిపించనున్నారట శ్రీదేవి. జనవరిలో ఆమె పాల్గొనగా ఈ పాట, సన్నివేశాలను చిత్రీకరించాలనుకుంటున్నారని బాలీవుడ్ టాక్.