Hazrat Ali
-
ఉర్సుకు సర్వం సిద్ధం
మౌలాలి: హైదరాబాద్ మౌలాలి అంటే తొలుత గుర్తుకు వచ్చేది ‘హజ్రత్ అలీ బాబా దర్గా’నే. ఈ దర్గాకు చారిత్ర నేపథ్యం ఏంతో ఉంది. ఏటా హజ్రత్ అలీ జయంతిని పురస్కరించుకుని బుధవారం నుంచి ఈనెల 27వ తేదీ వరకు ఘనంగా ఉర్సు ఉత్సవాలు నిర్వహించనున్నారు. భాగ్యనగరంతో పాటు దేశ విదేశాల నుంచి కులమతాలకు అతీతంగా వచ్చిన ఎందరో హజ్రత్ అలీ బాబాను దర్శించుకుంటారు. చారిత్రక, ఆధ్యాత్మిక క్షేత్రంగా వర్థిల్లుతున్న ఈ ప్రదేశానికి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రూ.25 కోట్లతో దర్గాపైకి వెళ్లేందుకు ర్యాంప్ నిర్మించింది. చారిత్రాత్మకం మౌలాలి దర్గా హైదరాబాద్ నగరానికి 11 మైళ్ల దూరంలో ఉత్తర దిశగా 2017 అడుగుల ఎత్తులో గల గుట్టపై మౌలాలి దర్గా ఉంది. దీన్నే ‘కోహి–ఏ–మౌలాలి’ అని కూడా అంటారు. ఇస్లాం దూత హజ్రత్ మేల్లుడు హజ్రత్ అహ్మద్ ముస్తఫా సంస్మరణార్థం దర్గాను నిర్మించినట్లు చరిత్ర కథనం. కులీ కుతుబ్‌షా నవాబ్ 1578లో ఈ దర్గాను నిర్మించినట్లు చెబుతారు. ఇబ్రహీం కులీ కుతుబ్‌షా కలకు ప్రతిరూపమని కూడా కథనం ఉంది. ఏటా ఉర్సు ఉత్సవాల్లో దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు అరబ్ దేశాలైన ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, కువైట్ తదితర దేశాల భక్తులు సైతం దర్గాలో మొక్కులు చెల్లించుకుంటారు. ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి మౌలాలి హజ్రత్ అలీ జయంతిని పురస్కరించుకుని ఏటా రజబ్ మాసం(ముస్లిం కాలమానిని ప్రకారం) 17వ రోజు మౌలాలి దర్గాలో ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తారు. మౌలాలి దర్గా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఉత్సవాలు భాగ్యనగరంలో ప్రత్యేక గుర్తింపు పొందాయి. పాతబస్తీ నుంచి పెద్ద ఎత్తున షియా వర్గానికి చెందిన భక్తులు మార్చి 27 అర్ధరాత్రి తమ నివాసాల్లో హజ్రత్ అలి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఉత్సవాల తొలిరోజు, ఐదో రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆయా రోజుల్లో పాతబస్తీ నుంచి వేలాది ముస్లింలు ఒంటెలు, గుర్రాలు, ఏనుగులపై ఊరేగింపుగా సందల్ తీసుకొస్తారు. బాబాను దర్శించుకొని మొక్కులు సమర్పిస్తారు. ఈ ఉత్సవాల సందర్భంగా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. సీపీ మహేష్ భగవత్, మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వరశర్మ, ఏసీపీ సందీప్, సీఐ మన్మోహన్, ఎస్ఐ విష్ణువర్ధన్‌రెడ్డి.. దర్గా కమిటీ సభ్యులు, స్థానికులతో సంప్రదింపులు జరిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందలు తలెత్తకుండా శాంతియుతంగా జరిగేలా బందోబస్తు ఏర్పాటు చేశారు. -
మళ్లీ తడబడ్డ పాకిస్తాన్
ఇస్లాబాబాద్ : తప్పుడు ఆధారాలతో ప్రపంచాన్ని మోసం చేయాలనుకున్న పాకిస్తాన్.. మరోసారి బోల్తాపడింది. మా దేశంలో అద్భుత పర్యాటక స్థలాలున్నాయి.. టూరిస్టులు రండి.. అంటూ ఒక వీడియోను పాకిస్తాన్ టూరిజం శాఖ తన ట్విటర్లో అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అన్నిదేశాలు ఇలాగే తమ తమ దేశంలోని టూరిజాన్ని ప్రమోట్ చేసుకుంటున్నాయి. ఇందులో పాకిస్తాన్‌ను తప్పుపట్టాల్సింది ఏమీ లేకపోయినా.. పొరుగు దేశంలోని చారిత్రక కట్టడం తమ దేశంలో ఉన్నట్టు చూపించి చిక్కుల్లో ఇరుక్కుంది. ఆఫ్ఘనిస్తాన్లోని చారిత్రక వాసరత్వ కట్టడం హజ్రత్ ఆలీ మసీదును పాకిస్తాన్ తమ దేశంలో ఉన్నట్లు వీడియో లో పేర్కొంది. మజర్ ఈ షరీఫ్ మసీదును స్థానికులు అక్కడ బ్లూ మసీదు అని పిలుచుకుంటారు. ఈ మసీదును పాకిస్తాన్ అధికారులు తమ దేశంలో ఉన్నట్లు వీడియోలో చూపించారు. దీనిపై నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. -
మదీనాలో మస్జిద్ నిర్మాణం
సురాఖ సిగ్గుతో చితికిపోతూ, పశ్చాత్తాప హృదయంతో ప్రవక్త సన్నిధిలో తలవంచుకొని నిలుచున్నాడు. తాను తప్పుచేశానని, క్షమించమని అభ్యర్థించాడు. ప్రవక్త మహనీయులు అతణ్ని క్షమించారు. తరువాత యధాప్రకారం ప్రయాణం కొనసాగిస్తూ మదీనాకు సమీపంలో ఉన్నటువంటి ’ఖుబా’ అనే గ్రామానికి చేరుకున్నారు. ఈలోపు హజ్రత్ అలీ కూడా మక్కా నుండి వచ్చి ప్రవక్తను కలుసుకున్నారు. అలీ రాకతో మక్కా విషయాలు కూడా తెలిశాయి. ప్రవక్తమహనీయులు ఖుబాలో బసచేస్తున్నందున ప్రార్థనకోసం అక్కడ ఒక మస్జిద్ నిర్మించారు. ప్రవక్త స్వయంగా ఆ మస్జిద్ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. దైవారాధనకోసం నిర్మించిన మొట్టమొదటి మస్జిద్ అదే. ఖుబా మస్జిద్ లో నమాజ్ చేసిన వారికి ‘ఉమ్రా’ (కాబా దర్శనం) చేసినంత పుణ్యం లభిస్తుంది. ప్రవక్త మహనీయులు ఖుబా చేరుకున్నారన్న శుభవార్త మదీనా అంతటా పాకడంతో అక్కడి ప్రజల ఆనందం అవధులు దాటింది. కనీవినీ ఎరుగని రీతిలో మదీనా ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఆ మహనీయుని ఆతిథ్యభాగ్యం తమకే దక్కాలని ప్రతి ఒక్కరూ భావించారు. కాని ప్రవక్త వాహనం ఒక్కొక్క ఇంటినీ దాటుకుంటూ చివరికి అబూ అయ్యూబ్ అన్సారీ అనే ఒక సహచరుని ఇంటివద్ద ఆగి అక్కడే కూర్చుండి పోయింది. ప్రవక్తవారి ఆతిథ్యభాగ్యం తమకే లభించినందుకు అబూ అయ్యూబ్ దంపతులు ఆనందంతో పొంగిపొయ్యారు. భూప్రపంచంలో ఎవరికీ దక్కని అదృష్టం తమకే దక్కినందుకు మురిసిపోయారు. కొన్నాళ్ళపాటు వారి ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్న ప్రవక్త, మదీనాలో దైవారాధనకోసం ఒక మస్జిద్ నిర్మించాలని సంకల్పించారు. దానికోసం స్థలాన్ని కూడా ఎంపికచేశారు. ఆ స్థలం నజ్జార్ తెగకు చెందిన ఇద్దరు అనాథ అన్నదమ్ములది. వారు సంతోషంగా స్థలం దానం చేయడానికి సిద్ధమయ్యారు. ప్రవక్త వారిని అభినందిస్తూ, ఉచిత ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించి స్థలానికి పైకం చెల్లించారు. తరువాత కొద్దిరోజుల్లోనే మస్జిద్ నిర్మాణం పూర్తయింది. అదే ‘మస్జిదె నబవి’ గా ప్రసిద్ధిగాంచింది. తరువాత ప్రవక్తమహనీయులు ఎక్కువ సమయం మసీదులోనే గడిపేవారు. ధర్మానికి సంబంధించిన విధివిధానాలు, నైతిక, మానవీయ విలువలను గురించి ప్రజలకు తెలియజెప్పేవారు. ప్రేమ, దయ, జాలి, కారుణ్యం, సహనం, సానుభూతి, పరోపకారం తదితర విషయాలు బోధించేవారు. విశ్వాసం అంటే ఏమిటి, విశ్వసించినవారి బాధ్యతలేమిటి, దైవప్రసన్నత, పరలోక సాఫల్యం పొందడానికి ఏంచేయాలి? అన్నటువంటి అనేక ప్రాపంచిక, పారలౌకిక విషయాలను విడమరచి చెప్పేవారు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ (మరికొన్ని విశేషాలు వచ్చేవారం)