మదీనాలో మస్జిద్ నిర్మాణం
సురాఖ సిగ్గుతో చితికిపోతూ, పశ్చాత్తాప హృదయంతో ప్రవక్త సన్నిధిలో తలవంచుకొని నిలుచున్నాడు. తాను తప్పుచేశానని, క్షమించమని అభ్యర్థించాడు. ప్రవక్త మహనీయులు అతణ్ని క్షమించారు. తరువాత యధాప్రకారం ప్రయాణం కొనసాగిస్తూ మదీనాకు సమీపంలో ఉన్నటువంటి ’ఖుబా’ అనే గ్రామానికి చేరుకున్నారు. ఈలోపు హజ్రత్ అలీ కూడా మక్కా నుండి వచ్చి ప్రవక్తను కలుసుకున్నారు. అలీ రాకతో మక్కా విషయాలు కూడా తెలిశాయి. ప్రవక్తమహనీయులు ఖుబాలో బసచేస్తున్నందున ప్రార్థనకోసం అక్కడ ఒక మస్జిద్ నిర్మించారు. ప్రవక్త స్వయంగా ఆ మస్జిద్ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. దైవారాధనకోసం నిర్మించిన మొట్టమొదటి మస్జిద్ అదే. ఖుబా మస్జిద్ లో నమాజ్ చేసిన వారికి ‘ఉమ్రా’ (కాబా దర్శనం) చేసినంత పుణ్యం లభిస్తుంది.
ప్రవక్త మహనీయులు ఖుబా చేరుకున్నారన్న శుభవార్త మదీనా అంతటా పాకడంతో అక్కడి ప్రజల ఆనందం అవధులు దాటింది. కనీవినీ ఎరుగని రీతిలో మదీనా ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఆ మహనీయుని ఆతిథ్యభాగ్యం తమకే దక్కాలని ప్రతి ఒక్కరూ భావించారు. కాని ప్రవక్త వాహనం ఒక్కొక్క ఇంటినీ దాటుకుంటూ చివరికి అబూ అయ్యూబ్ అన్సారీ అనే ఒక సహచరుని ఇంటివద్ద ఆగి అక్కడే కూర్చుండి పోయింది. ప్రవక్తవారి ఆతిథ్యభాగ్యం తమకే లభించినందుకు అబూ అయ్యూబ్ దంపతులు ఆనందంతో పొంగిపొయ్యారు. భూప్రపంచంలో ఎవరికీ దక్కని అదృష్టం తమకే దక్కినందుకు మురిసిపోయారు. కొన్నాళ్ళపాటు వారి ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్న ప్రవక్త, మదీనాలో దైవారాధనకోసం ఒక మస్జిద్ నిర్మించాలని సంకల్పించారు.
దానికోసం స్థలాన్ని కూడా ఎంపికచేశారు. ఆ స్థలం నజ్జార్ తెగకు చెందిన ఇద్దరు అనాథ అన్నదమ్ములది. వారు సంతోషంగా స్థలం దానం చేయడానికి సిద్ధమయ్యారు. ప్రవక్త వారిని అభినందిస్తూ, ఉచిత ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించి స్థలానికి పైకం చెల్లించారు. తరువాత కొద్దిరోజుల్లోనే మస్జిద్ నిర్మాణం పూర్తయింది. అదే ‘మస్జిదె నబవి’ గా ప్రసిద్ధిగాంచింది. తరువాత ప్రవక్తమహనీయులు ఎక్కువ సమయం మసీదులోనే గడిపేవారు. ధర్మానికి సంబంధించిన విధివిధానాలు, నైతిక, మానవీయ విలువలను గురించి ప్రజలకు తెలియజెప్పేవారు. ప్రేమ, దయ, జాలి, కారుణ్యం, సహనం, సానుభూతి, పరోపకారం తదితర విషయాలు బోధించేవారు. విశ్వాసం అంటే ఏమిటి, విశ్వసించినవారి బాధ్యతలేమిటి, దైవప్రసన్నత, పరలోక సాఫల్యం పొందడానికి ఏంచేయాలి? అన్నటువంటి అనేక ప్రాపంచిక, పారలౌకిక విషయాలను విడమరచి చెప్పేవారు.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ (మరికొన్ని విశేషాలు వచ్చేవారం)