హెచ్‌బీవో ఫౌండర్ చార్లెస్ డోలన్ కన్నుమూత
కేబుల్ టీవీ దిగ్గజం, హెచ్‌బీవో (HBO) టీవీ చానెల్ వ్యవస్థాపకుడు చార్లెస్ డోలన్ (Charles Dolan) కన్నుమూశారు. 98 ఏళ్ల వయసులో ఆయన సహజ కారణాలతో శనివారం (డిసెంబర్ 28) తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు ధ్రువీకరించినట్లుగా స్థానిక న్యూస్ పోర్టల్ న్యూస్‌డే పేర్కొంది.చార్లెస్ డోలన్ 1972లో హెచ్‌బీవోని స్థాపించారు. తర్వాత ఏడాదిలోనే దేశంలోని అతిపెద్ద కేబుల్ ఆపరేటర్లలో ఒకటైన కేబుల్విజన్ని సృష్టించారు. దీన్ని 2017లో ఆల్టిస్కి 17.7 బిలియన్ డాలర్లకు విక్రయించారు. 1986లో ఆయన కేబుల్‌విజన్ న్యూస్ 12 లాంగ్ ఐలాండ్‌ను ప్రారంభించడంలో కీలకపాత్ర పోషించారు. యూఎస్‌లో ఇది తొలి 24 గంటల ప్రాంతీయ కేబుల్ న్యూస్ ఛానెల్. తర్వాత ఇది న్యూయార్క్ ప్రాంతంలో స్థానిక వార్తా ఛానెల్‌ల న్యూస్ 12 నెట్‌వర్క్‌ల సమూహానికి దారితీసింది. కేబుల్‌విజన్ నుండి ప్రత్యేక పబ్లిక్ కంపెనీగా విడిపోయిన ఏఎంసీ నెట్వర్క్స్ డైరెక్టర్ల బోర్డు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్న చార్లెస్ డోలన్ 2020లో ఆ పదవి నుంచి వైదొలిగారు.డోలన్ భార్య కూడా కొన్ని నెలల క్రితమే మరణించారు. వీరికి ఆరుగురు సంతానం ఉన్నారు. వీరిలో పాట్రిక్ డోలన్ న్యూస్‌డే సంస్థను నడిపిస్తున్నారు. మరో కుమారుడు జేమ్స్ డోలన్ భార్య క్రిస్టిన్ డోలన్ ఏఎంసీ నెట్వర్క్స్ సీఈవోగా ఉన్నారు.దూసుకుపోతున్న క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ (Bitcoin) మూలాలపై హెచ్‌బీవో ఇటీవల ఓ సంచలనాత్మక డాక్యుమెంటరీ చిత్రీకరించింది. వాటిని తొలిసారి చేసిన వ్యక్తిగా ఇప్పటివరకు సతోషి నకమోటో పేరు చాలామందికి తెలుసు. కానీ కెనడాకు చెందిన పీటర్ టోడ్డ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ తొలిసారి బిట్‌కాయిన్ తయారుచేశాడంటూ ‘మనీ ఎలక్ట్రిక్: బిట్‌కాయిన్ మిస్టరీ’ పేరిట 100 నిమిషాల నిడివితో నిర్మించిన ఈ చిత్రాన్ని విడుదల చేసింది.