ప్రాణం తీసిన పింఛన్
జమ్మలమడుగు: పింఛన్ల పంపిణీ పేరుతో ప్రభుత్వం వృద్ధుల జీవితాలతో చెలగాటమాడుతోంది. జమ్మలమడుగు పట్టణం గూడు మస్తాన్ స్వామి దర్గా సమీపంలోని ప్రాథమిక పాఠశాలలో మంగళవారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో పింఛన్ కోసం వచ్చిన ఎల్. మాబున్నీ(70) అనే వృద్ధురాలు ఊపిరాడక మృతి చెందింది. పింఛన్కోసం పలు వార్డులకు చెందిన లబ్ధిదారులు రావడంతో పాఠశాల ప్రాంగణమంతా నిండిపోయింది.
దీంతో పింఛన్ ను పక్క వీధిలో పంపిణీ చేస్తామని చెప్పి లబ్ధిదారుల కార్డులను పింఛన్ పంపిణీ సిబ్బంది తీసుకెళ్లారు. తమ కార్డులు ఎక్కడ తారుమారు అవుతాయో అనే ఆందోళనతో వృద్ధులంతా ఒకే చోట గుమిగూడారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో మాబున్నీ(70) ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరిశీలించి ఆమె మరణించినట్లు నిర్ధారించారు.
మృతురాలి కుటుంబానికి ఛైర్పర్సన్ పరామర్శ
పింఛన్ కోసం వచ్చి మృతి చెందిన మాబున్ని కుటుంబ సభ్యులను మున్సిపల్ ఛైర్పర్సన్ తాతిరెడ్డి తులసి, వైస్ ఛైర్మన్ ముల్లాజానీ, కౌన్సిలర్ నూర్జహాన్లు పరామర్శించారు. ఈ సందర్భంగా ఛైర్పర్సన్ మృతురాలి కుటుంబానికి 5వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. అలాగే వైస్ ఛైర్మన్, 20వవార్డు కౌన్సిలర్ నూర్జహాన్లు రూ.5వేల ఆర్థిక సాయం అందించారు.
అస్తవ్యస్థ పంపిణీతో ఇబ్బందులు
పింఛన్ పంపిణీ అస్తవ్యస్థంగా మారడంతోనే వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు.
ప్రతినెల తమకు సంబంధించిన ప్రాంతాల్లో పింఛన్లు పంపిణీ చేస్తుండటంతో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు. అయితే అక్టోబర్ నుంచి ప్రభుత్వం పింఛన్లను రూ.200నుంచి రూ.1000కి పెంచి ఆ డబ్బులను జన్మభూమి కార్యక్రమంలో పంపిణీ చేస్తామని పేర్కొంది. అయితే అధికారులు జన్మభూమి కార్యక్రమంలో సగం మందికి అక్టోబర్ నెలలో పింఛన్లు పంపిణి చేశారు.
తిరిగి నవంబర్లో జన్మభూమిని ప్రారంభించి ఏ ప్రాంతంలో జన్మభూమి సమావేశాన్ని నిర్వహిస్తున్నారో ఆ ప్రాంతంలో లబ్ధిదారులకు పింఛన్ ఇస్తారని ప్రకటించారు. తమకు ఈనెల కూడా ఎక్కడ పింఛన్ రాకుండా పోతుందోననే ఆందోళనతో వృద్ధులంతా ఒక్కసారిగా వచ్చారు. అధికారుల వైఫల్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలికావాల్సి వచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.