ఒకే వ్యక్తి పేరున 23 మోటార్ సైకిళ్లు!
ఆనబకాయలదిబ్బ (పోడూరు) : ఎవరికైనా మోటార్‌సైకిళ్లు ఒకటో, రెండో ఉంటాయి. కాస్త పెద్ద కుటుంబమైతే రెండో, మూడో ఉంటాయి. కానీ పెనుమదం శివారు ఆనబకాయలదిబ్బకు చెందిన కిలారి చంటిబాబు పేరున 23 మోటార్ సైకిళ్లు, 23 డ్రైవింగ్ లైసెన్స్‌లు ఉండడం స్మార్ట్ పల్స్ సర్వేలో వెలుగుచూసింది. ఇది చూసి సర్వే సిబ్బంది అవాక్కయ్యారు.
ఇంతకీ అతనికి నిజంగా అన్ని మోటార్‌సైకిళ్లు, లైసెన్స్‌లు ఉన్నాయా అంటే లేవు. తనకున్నది ‘ఏపీ 37 సీబీ 7902’ ఒకటే మోటార్ సైకిల్ అని, అది కూడా ఏడాది కిందటే కొన్నానని చంటిబాబు చెప్పాడు. అంతకు ముందెన్నడూ తాను మోటార్‌సైకిల్ వాడలేదని చెప్పుకొచ్చాడు. తాను డిగ్రీ పూర్తిచేశాననీ, నిరుద్యోగినని, సామాన్యుడినైన తనకు 23 మోటార్‌సైకిళ్లు ఉన్నట్లు రిజిస్ట్రేషన్ కావడంపై విస్మయం వ్యక్తం చేశాడు. దీనిపై ఆర్టీవోకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపాడు.