ఆర్టీసీ అద్దెబస్సు డ్రైవర్ల సమ్మె విరమణ
=కుదిరిన ఒప్పందం
=21 శాతం వేతనం పెంపు
ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ :ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు సమ్మె విరమించారు. వేతనాలు పెంచాలని కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తూ వస్తున్న డ్రైవర్లు.. యజమానులతో పలు దఫాలుగా జరిపిన చర్చలు విఫలం కావడంతో సోమవారం సమ్మెకు దిగారు. ఫలితంగా అద్దె బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయి ప్రజా రవాణాకు ఆటంకం ఏర్పడింది. పోలీసులు, ఆర్టీసీ అధికారులు చొరవ తీసుకుని హన్మకొండ డీఎస్పీ కార్యాలయంలో ఇరువర్గాలను చర్చలకు కూర్చోబెట్టారు.
ప్రస్తుతం ఇస్తున్న వేతనానికి అదనంగా 30శాతం పెంచి ఇవ్వాలని డ్రైవర్లు డిమాండ్ చేశారు. నిత్యావసరాలతోపాటు ఇతర ధరలు పెరగడంతో కుటుంబ పోషణ బారంగా మారిందని, వేతనాలు పెంచాల్సిందేనని పట్టుబట్టారు. అయితే తమకు కూడా ఖర్చులు పెరిగాయని ఆర్టీసీ చెల్లిస్తున్న అద్దె తమకు సరిపోవడం లేదని, అంత పెంచలేమంటూ యజమానులు చెబుతూ వచ్చారు.
అయితే ఎవరూ పట్టువీడకపోవడంతో చివరకు సమ్మెకు దారితీసింది. అద్దెబస్సుల డ్రైవర్లు సమ్మెకు వెళ్లడంతో వేతనం 21శాతం పెంచేందుకు యజమానులు అంగీకరించారు. దీంతో సమ్మె విరమించినట్టు అద్దెబస్సు డ్రైవర్ల అసోసియేషన్ అధ్యక్షుడు రాధాకృష్ణ తెలిపారు. సమ్మె విరమణతో సోమవారం మధ్యాహ్నం నుంచి బస్సులు యధావిధిగా నడిచాయి.