టాటాసన్స్ లో కీలక మార్పులు
ముంబై: టాటా సన్స్ అధినేతగా సైరస్ మిస్త్రీ పై వేటు పడిన అనంతరం సంస్థలో శుక్రవారం నూతన పరిణామాలు చోటు చేసుకున్నాయి. మిస్త్రీ ఉద్వాసన తర్వాత ఒకవైపు కొత్త చైర్మన్ కోసం ముమ్మర కసరత్తు జరుగుతుండగా, మరోవైపు సంస్థ తన సంస్థాగత నిర్మాణంలో ప్రధాన మార్పులు ప్రకటించింది. కొత్త మ్యానేజ్మెంట్ టీం ను ప్రకటించింది. టాటాసన్స్ హెచ్ ఆర్ గ్రూపు హెడ్ గా ఎస్ పద్మనాభన్ ను నియమించింది. టాటా బిజినెస్ ఎక్స్ లెన్స్ గ్రూపు బాధ్యతలకు తోడుగా ఆయనకు ఈ బాధ్యతలను కట్టబెట్టింది. విదేశీ సంస్థ నిర్వహణ బాధ్యతలను ముకుంద్ రాజన్ కు అప్పగించింది. అమెరికా, సింగపూర్, దుబాయ్, చైనా లో టాటా సన్స్ విదేశీ ప్రతినిధి కార్యాలయాలు, కార్యకలాపాలు పర్యవేక్షించే అదనపు బాధ్యతను అప్పగించింది.
ముఖ్యంగా టాటా సన్స్ ముగ్గురు అగ్ర కార్యనిర్వాహకులు నిర్మల్య కుమార్ ఎన్ ఎస్ రాజన్, మధు కన్నన్ రాజీనామా తర్వాత ఆ స్థానాల్లో కొత్త వారిని నియమించింది. చీఫ్ టెక్నాలజీ గ్రూపు హెడ్ గా గోపీచంద్ కాట్రగడ్డ కొనసాగుతారని, ఢిల్లీ కార్యాలయం నుంచి పబ్లిక్ అఫైర్స్ ను సంజయ్ సింగ్ పర్యవేక్షించనున్నారని తెలిపింది. టాటా బ్రాండ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ బాధ్యతల్లో హరీష్ భట్ లను నియమించింది.
కాగా అక్టోబర్ 24 న టాటా సన్స్ బోర్డు చైర్మన్ గా మిస్త్రీ స్థానే తాత్కాలిక చైర్మన్ గా బాధ్యతలను రతన్ టాటా చేపట్టారు. సంస్థ నాలుగు నెలల్లో ఒక కొత్త చైర్మన్ ను నియామకంకోసం తీవ్ర వెదుకులాట సాగుతోంది. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ చైర్మన్ పదవిలో ఎవరిని నియమిస్తారనే అంశంపై స్పష్టత లేదు.