విధులకు హాజరై మూడేళ్లు...
గుడివాడ మున్సిపాలిటీ నిర్వాకం
గుడివాడ : ఆయన గుడివాడ మున్సిపల్ హెడ్‌వాటర్ వర్క్స్‌లో ఫిల్టర్‌బెడ్ ఆపరేటర్.. విధులకు హాజరై మూడేళ్లు దాటింది. ఆయనకు వాటర్ వర్క్స్ ఏఈ, డిఈల అండదండలు ఉన్నాయనే విమర్శలున్నాయి. ఓ బినామీ వ్యక్తితో తన విధులను చేయించి నెలనెలా జీతం తీసుకుంటాడు. గుడివాడ మున్సిపాలిటీలో జరుగుతున్న ఈ తంతు గురించి తెలిసినా ఉన్నతాధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవనే ఆరోపణలున్నాయి.
విధులకు హాజరై మూడేళ్లు ...
గుడివాడ మున్సిపల్ హెడ్ వాటర్ వర్స్క్లో ఫిల్టర్‌బెడ్ ఆపరేటర్‌గా మున్సిపల్ పర్మినెంట్ ఉద్యోగి తలపంటి వెంకటేశ్వరరావు విధులు నిర్వర్తిస్తున్నాడు. హెడ్ వాటర్ వర్క్స్‌లో మూడు షిప్టుల్లో ముగ్గురు ఫిల్టర్‌బెడ్ ఆపరేటర్లు పనిచేయాల్సి ఉంది. ఇందులో ఇద్దరు మాత్రం సాంకేతిక అర్హత కలిగిన కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తారు. మూడో వ్యక్తిగా మున్సిపల్ పర్మినెంట్ ఉద్యోగి తలపంటి వెంకటేశ్వరరావు పనిచేయాల్సి ఉంది. అయితే మూడేళ్ల క్రితం ఇక్కడ ఒక యువకుడికి నెలకు రూ.5వేలు ఇచ్చి తన డ్యూటీ చేయడానికి అనధికారికంగా నియమించుకున్నాడు. హాజరు పట్టీలో కూడా ఆ యువకుడే తలపంటి వెంకటేశ్వరరావు సంతకాన్ని పెడతాడని తెలిసింది.
ప్రజల ప్రాణాలతో చెలగాటం
ఫిల్టర్‌బెడ్ ఆపరేటర్ అంటే గుడివాడ పట్టణంలో లక్షా30వేల మంది తాగే మంచినీటిని శుద్ధిపరచి అందించే వ్యక్తి. ఇంతటి బాధ్యతాయుతమైన ఉద్యోగాన్ని అవగాహన లేని ఓ బినామీ యువకుడి చేత చేయిస్తుండడంతో పలుమార్లు తమకు మురికినీరు వస్తుందని ప్రజలు ఫిర్యాదు చేశారు. కనీస అర్హత లేని వారు విధులు నిర్వహించడంతో నీరు సరిగా శుద్ధిగాక రోగాల బారిన పడుతున్నామని చెప్పినా అధికారులకు చీమకుట్టినట్లయినా లేదని చెబుతున్నారు.
చిరుతాయిలాల కక్కుర్తే కారణమా...
హెడ్ వాటర్ వర్క్స్‌లో పనిచేసే సిబ్బంది విధులు సరిగా నిర్వర్తిస్తుంది లేనిదీ ఎప్పటి కప్పుడు పర్యవేక్షించే వాటర్ వర్క్స్ ఏఈ, డీఈలకు ఈ బినామీ వ్యవహారం తెలుసని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈఏడాది మార్చిలో మున్సిపల్ డిఈ ఫిల్టర్బెడ్లను పరిశీలించటానికి వచ్చి ఫిల్టర్‌బెడ్ ఆపరేటర్ తలపంటి వెంకటేశ్వరరావు స్థానంలో మరో యువకుడు పనిచేస్తున్నాడని మూవ్మెంటు రిజిష్టర్‌లో నమోదు చేశాడు. అయినా ఇంతవరకు చర్య లు లేవని చెబుతున్నారు.
నాదృష్టికి రాలేదు..
ఈవిషయమై మున్సిపల్ కమిషనర్ ఎన్.ప్రమోద్‌కుమార్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ఈవిషయం తన దృష్టికి రాలేదని చెప్పారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని తెలిపారు.