శిక్షణ తరగతుల్లో పాల్గొన్న కాంగ్రెస్ సర్పంచులు
ఆదిలాబాద్ : రాష్ట్ర రాజధానిలోని బోయిన్పల్లి కేజీఆర్ గార్డెన్స్‌లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సర్పంచులకు నిర్వహించిన రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆ పార్టీకి చెందిన జిల్లా సర్పంచులు 20 మందికి పైగా పాల్గొన్నట్లు ఆ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్ జాదవ్ ‘సాక్షి’కి ఫోన్ ద్వారా తెలిపారు. పార్టీ తెలంగాణ ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్, జాతీయ నేతలు కుంతియా, కె.రాజు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు బట్టివిక్రమార్క, శాసనసభాపక్ష నేత జానారెడ్డి, శాసన మండలిపక్ష నేత షబ్బీర్‌అలీ పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ప్రధానంగా పంచాయతీల్లో సర్పంచులకు పూర్తి అధికారాలు దక్కేలా ప్రభుత్వంపై పోరాడాలని నేతలు సూచించినట్లు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం మన ఊరు–మన ప్రణాళిక, గ్రామజ్యోతి వంటి కార్యక్రమాలతో హడావిడి చేసినప్పటికీ, ఇప్పటివరకు పంచాయతీలకు చేసిందేమీ లేదని పేర్కొన్నారు. మోసపూరితంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వంపై పోరాడాలని నేతలు పిలుపునిచ్చినట్లు తెలిపారు. జిల్లా నుంచి డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి రవిందర్‌రావు, తదితరులు పాల్గొన్నట్లు వివరించారు.