గోలీల్లేవు.. డోలీలే...
అడవి బిడ్డల అరణ్యరోదన
ఏజెన్సీ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాల కొరత..
108 వాహనాలూ రాని వైనం.. డోలీపైనే ఆస్పత్రికి తరలింపు..
మరణిస్తున్న గర్భిణులు, శిశువులు..
ఆరు ఏజెన్సీ ప్రాంతాల్లో 1,722 డోలీలు నిత్యం మోతకోసమే
అవి అడవి బిడ్డల ఆవాసాలు. ప్రకృతి రమణీయతకు మారు పేరు. అయితే అక్కడి వారికి రోగమొస్తే ప్రాణాలు గాలిలోనే! కొండలు, కోనల్లో మందులు దొరకవు. వైద్యులు రారు. రవాణా సౌకర్యాలు లేక కనీసం అంబులెన్సు వాహనాలు కూడా వెళ్లలేవు. అత్యవసర పరిస్థితి తలెత్తితే.. నలుగురైదుగురు కలిసి అడవిలో, వాగులూ, వంకలూ దాటుతూ మైళ్ల దూరం రోగులను డోలీ (కట్టెకు గుడ్డ కట్టి ఊయలలా ఉండేవి) లపైనే మోసు కెళ్లాలి. ఈలోపు రోగి పడే బాధ వర్ణనా తీతం. మోసుకెళ్లేవారిది అంతులేని కష్టం. ఆసుపత్రికి తీసుకెళ్లే వరక బతికుంటే అదృష్టమే. మార్గమధ్యంలో ప్రసవ వేదనతో మరణిస్తున్న గర్భిణీలు, గుండెపోటు రోగుల సంఖ్య ఎక్కువే. గర్భస్థ శిశుమరణాలూ ఎక్కువే. వీటికి తోడు ప్రభుత్వం, అధికారుల అలసత్వంతో గిరిజనం పడే అవస్థలు వర్ణనా తీతం.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మొత్తం ఆరు ఏజెన్సీల పరిధిలో సుమారు 456 శివారు ప్రాంతాలు ఇప్పటికీ రవాణా సౌకర్యం లేదు. పాము కాలేసినా, తేలుకుట్టినాకూడా మైళ్లదూరం డోలీలపై వెళ్లాల్సిందే. ఏజెన్సీ శివారు ప్రాంతాలకు ఇప్పటికీ చంద్రన్న సంచార చికిత్స వాహనాలు గానీ, 108 అంబులెన్సులు గానీ వెళ్లలేని దుస్థితి. రవాణా సమస్యతో కనీసం వైద్య సిబ్బంది కూడా అటువైపు కన్నెత్తి చూడటంలేదు. ఎప్పుడైనా ప్యాంటు షర్టు వేసుకుని కొత్త మనిషి కనిపిస్తే చాలు ఎవరైనా ఆరోగ్యశాఖ అధికారులు మందులు తెచ్చారేమోనని ఆశతో ఎదురెళ్లే దయనీయ స్థితి.
ఇటీవల పాడేరుకు చెందిన ఓ వ్యక్తి తన ఐదేళ్ల కూతురు నీటిలో మునిగి మృతి చెందితే...మృతదేహాన్ని ఆసుపత్రినుంచి ఇంటికి పధ్నాలుగు కిలోమీటర్లు మోసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఇటువంటివి ఏజెన్సీలో నిత్యకృత్యం. రాష్ట్రంలోని సీతంపేట, పార్వతీపురం, పాడేరు, రంపచోడవరం, కేఆర్ పురం, శ్రీశైలం, ఎటపాక ఏజెన్సీల్లో రోజూ ఇలాంటివి కనిపిస్తూనే ఉన్నాయి. ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో 155 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుంటే 75 సెంటర్లలో వైద్యులు అందుబాటులో లేరు. ఆరు ఏరియా ఆస్పత్రులుంటే స్పెషలిస్టులు ఒక్కరంటే ఒక్కరూ సమయానికి రావడంలేదు. వారి కోసం రోగులు పనులు మానుకుని ఎదురు చూడాల్సిందే.
డోలీలు మోసేవారు లేకపోతే...
ఏజెన్సీ ప్రాంతాల్లో జబ్బు చేసిన వారికి, ప్రమాదవశాత్తు గాయపడిన వారికి డోలీలు, వాటిని మోసేవారు లేకపోతే వారికి మృత్యువు సమీపించినట్టే. ఆరు ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే 1,722 డోలీలు అందుబాటులో ఉన్నాయి. వీటితోనే రోజూ రోగులను తరలిస్తున్నారు. విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో అసలు రవాణా సౌకర్యాలు లేవు. ఈ గ్రామాలకు 108 అంబులెన్సులు గానీ, 104 వాహనాలూ గానీ వెళ్లలేవు. డోలీలే దిక్కు. పైగా మలేరియా, చికెన్ గున్యా, డెంగీ లాంటి దోమకాటు జ్వరాలు తీవ్రంగా ఉండటంతో ఎక్కువ మరణాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 1272 పల్లకీలు అందుబాటులో ఉన్నాయి. వీటిని పెంచాల్సిన అవసరం కూడా ఉంది.
పిట్టల్లా రాలుతున్న గర్భిణీలు
ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రధానంగా ప్రసవానికి వచ్చే తల్లులు ఎక్కువగా మృతి చెందుతున్నారు. డోలీలో తీసుకెళుతున్నా సకాలంలో ఆస్పత్రులకు వెళ్లలేని పరిస్థితి. దీంతో ఆస్పత్రులకు వెళ్లకమునుపే మార్గమధ్యంలో తనువు చాలిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. గడిచిన ఆరు మాసాల్లోనే సకాలంలో వైద్యమందక ప్రసవానికి వెళ్లిన 72 మంది తల్లులు మృతి చెందారు. ఇక శిశువుల మరణాలూ లెక్కలేనన్ని. ఆఖరి క్షణంలో ఆసుపత్రులకు చేరి తల్లి, బిడ్డా మరణిస్తున్న సంఘటనలు కోకొల్లలు. ప్రసవ సమయంలో సరైన రవాణా సౌకర్యం లేక, సకాలంలో వైద్యం అందక మరణాలు చోటు చేసుకుంటున్నట్టు యునిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లు్యహెచ్‌ఓ) లాంటి అంతర్జాతీయ సంస్థలే నిర్ధారించాయి. డోలీలో రవాణా సమయం ఎక్కువ. గుండెపోటు వస్తే బతికి బట్టకట్టేవారు చాలా అరుదు. డోలీల్లో కదలికలు, కుదుపులు ఎక్కువే. అందువల్ల ఆ సమయంలో రోగులపడే బాధ వర్ణనాతీతం. ఈ నరకం భరించడంకంటే చావే నయమని రోగులు రోధిస్తున్న తీరు డోలీలు మోసేవారికే కన్నీరు తెప్పిస్తున్నాయంటో పరిస్థితి తీవ్రత ఎల ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
పింఛన్ల కోసం...
ఇక పింఛన్ల కోసం వయో వృద్ధులు కూడా మైళ్ల దూరం డోలీలపైనే వెళతారు. కేవలం రూ. 1,500 రూపాలయ పింఛన్ కోసం రూ. 500ల దాకా ఖర్చు పెట్టాల్సి వస్తోంది.
పాడేరు మండలంలోని వంజంగి పంచాయితీ పోతు రాజుమెట్ట గ్రామంలో గతేడాది నవంబర్ 13న ఐదేళ్ల కొర్రా సంధ్య పువ్యులు కోయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడింది. ఆస్పత్రి లేక వైద్యసేవలు అందక మృతి చెందింది. మరుసటిరోజు బాలిక మృతదేహానికి పోస్టుమార్టంకు ఆమె బంధువు 10 కిలోమీటర్లు కాలినడకన, మరో 6 కి.మీ దూరం బైక్‌పైన మృతదేహాన్ని పాడేరు ఏరియా ఆస్పత్రికి ఇలా తరలించారు.