‘హద్దు’ దాటి వైద్యం
► ప్రైవేటును తలపిస్తున్న ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యశాలలు
► ప్రజల ప్రాణాలతో చెలగాటం
► ఫిర్యాదులు వస్తున్నాస్పందించని యంత్రాంగం
► ఎక్కడికక్కడ ‘మామూళ్ల’ పర్వం
హిందూపురంలోని చౌడేశ్వరీ కాలనీలో ఉన్న ఓ వైద్యశాలను నాలుగు రోజుల క్రితం జిల్లా వైద్యాధికారులు తనిఖీ చేశారు. నిర్వాహకురాలికి వైద్యశిక్షణ పొందినట్లు ధ్రువీకరణ లేదు. అసలు ఆ వైద్యశాలకు ప్రభుత్వ అనుమతే లేదన్న విషయాన్ని గుర్తించారు. దీంతో ఆస్పత్రిని మూసేసి.. మందులను సీజ్ చేశారు.. ఇలాంటి వైద్యశాలలు జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో ఉన్నాయి. వాటి నిర్వాహకులు అధికారుల చేయి తడిపి యథేచ్ఛగా నిర్వహిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
అనంతపురం మెడికల్ : వైద్య,ఆరోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతో కనీన వైద్య పరిజ్ఞానం లేని కొందరు రిజిష్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ (ఆర్‌ఎంపీ), ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ (పీఎంపీ)లుగా కొనసాగుతున్నారు. తెలిసీ తెలియని వైద్యంతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రాథమిక చికిత్స మాత్రమే కాకుండా..అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు, సొంతంగా మందులు రాసివ్వడం, వారే విక్రయించడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి వైద్యశాలలు అనంతపురం నగరంలోనే పదుల సంఖ్యలో ఉండటం గమనార్హం.
ఆయుష్షు ఉంటే బతికేస్తున్నారు!
జిల్లావ్యాప్తంగా ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యశాలలు రెండు వేలకు పైగానే ఉన్నాయి. ఇక్కడ ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. అయితే.. ఏకంగా పడకల ఆస్పత్రులే నడుపుతున్నారు. సూది మందు, సెలైన్లు ఎక్కించడం నిషిద్ధం. దీన్ని బేఖాతరు చేస్తూ శస్త్ర చికిత్స వరకు అన్నీ చేసేస్తున్నారు. మందుల విక్రయ దుకాణం నడపాలంటే లెసైన్స్ తప్పనిసరి. దుకాణదారుడికు బీ ఫార్మసీ విద్యార్హత ఉండాలి. ఇవేవీ పట్టించుకోకుండా మందులు విక్రయిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఓ ప్రైవేట్ ఆస్పత్రి స్థాయిలో హద్దుదాటి వైద్యం చేస్తున్నారు. ఈ క్రమంలో రోగికి ఆయుష్షు ఉంటే బతికేస్తున్నాడు. లేకుంటే ప్రాణాలు పోవాల్సిందే. అనంతపురం, హిందూపురం, ధర్మవరం, కదిరి, గుంతకల్లు, తాడిపత్రి, రాయదుర్గం, కళ్యాణదుర్గం తదితర పట్టణాల్లో ఆర్‌ఎంపీ, పీఎంపీల హవా కొనసాగుతోంది.
కంటితుడుపుగా దాడులు
ఇటీవల కలెక్టరేట్‌లో మాతృమరణాలపై కలెక్టర్ కోన శశిధర్ సమీక్షించారు. ఈ సందర్భంగా హిందూపురంలోని ఓ వైద్యశాల బాగోతం వెలుగులోకి వచ్చింది. అక్కడి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన భార్య ప్రాణం పోయిందని బాధితుడు ఫిర్యాదు చేసిన విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్.. తక్షణం చర్యలకు ఆదేశించారు. దీంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు కేవలం ఒకరోజు కంటితుడుపుగా తనిఖీలు చేసి చేతులుదులుపుకున్నారు. జిల్లావ్యాప్తంగా వందల సంఖ్యలో అనధికారిక క్లినిక్‌లు ఉన్నా పట్టించుకోవడం లేదు. వాటి నిర్వాహకులు ముడుపులు చెల్లిస్తుండటంతో పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.
ఇతర ప్రాంతాల సంగతి పక్కన పెడితే అనంతపురం శివారు కాలనీలతో పాటు సాయినగర్, కమలానగర్, పాతూరు, రాజీవ్‌కాలనీ, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో నకిలీ వైద్యులు ఉన్నారు. అలాగే మందుల దుకాణాల నిర్వాహకులు ఆర్‌ఎంపీలకు ఒక గదిని కేటాయించి ప్రజలకు ఉచిత ఓపీ పేరుతో మందుల కొనుగోళ్లను ప్రోత్సహిస్తున్నా వైద్యాధికారులకు కనపడకపోవడం గమనార్హం.