దుడ్లిస్తేనే వైద్యం | Dudlistene healing | Sakshi
Sakshi News home page

దుడ్లిస్తేనే వైద్యం

Published Sat, Nov 22 2014 3:31 AM | Last Updated on Thu, Mar 21 2019 8:19 PM

దుడ్లిస్తేనే వైద్యం - Sakshi

దుడ్లిస్తేనే వైద్యం

అనంతపురం రూరల్ : ‘ఇప్పట్లో ప్రభుత్వం నుంచి రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు. సిబ్బంది నియామకాలు, పరికరాల కొనుగోలు కష్టం. ఆస్పత్రి అవసరాల నిమిత్తం యూజర్ చార్జీలను వసూలు చేయండ’ని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్ అధ్యక్షతన సర్వజనాస్పత్రిలోని ప్రభుత్వ వైద్యుల సంఘం కార్యాలయంలో ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ (హెచ్‌డీఎస్) సమావేశం నిర్వహించారు.

యూజర్ చార్జీల అంశాన్ని ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గతంలో సూచించిన మేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వర రావు ఎజెండాలో ఉంచగా.. ఎంపీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మరమ్మతులు, నిర్వహణ కోసం ప్రజల నుంచి డబ్బు తీసుకోవడంలో తప్పు లేదన్నారు. ఇందుకు సీపీఐ నేతలు నారాయణస్వామి, లింగమయ్య అభ్యంతరం తెలిపినా, వారికి పెద్దగా మద్దతు లభించలేదు. తన పరిధిలో రూ.5 కోట్ల నిధులున్నాయని, అధిక శాతం ఆస్పత్రి అభివృద్ధికి కేటాయిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.

అజెండాలోని అంశాలను ప్రస్తావించేందుకు సూపరింటెండెంట్ ప్రయత్నించగా.. ‘దాన్ని పక్కనపెట్టండి. మొదట పారిశుద్ధ్యం, సిబ్బంది, డబ్బు విషయాలపై చర్చిద్దామ’ని ఎంపీ అన్నారు. ‘ఇక్కడ శుభ్రంగా లేకపోవడం వల్లే రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు. కనీసం రోజుకుఒక్కసారైనా శుభ్రం చేస్తున్నారా? నెలకు రూ.16 లక్షలు వస్తున్నప్పుడు రోజూ శుభ్రంగా ఉంచాలని తెలియదా?’ అంటూ కాంట్రాక్టర్ భీమేశ్వర్ నాయుడుపై మండిపడ్డారు.

ఈ విషయంలో కలెక్టర్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య పనులు సరిగా జరగడం లేదని సర్జికల్ విభాగాధిపతి డాక్టర్ రామస్వామి నాయక్, ఈఎన్‌టీ విభాగాధిపతి డాక్టర్ సంపత్, అనస్తీషియా హెచ్‌ఓడీ డాక్టర్ నవీన్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రామకృష్ణ ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి నిబంధనల ప్రకారం సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయలేదన్నారు.

ఎంపీ స్పందిస్తూ డిసెంబర్ ఒకటో తేదీకల్లా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. కాగా, యూజర్ చార్జీల నుంచి పేదలకు (బీపీఎల్) మినహారుుంపు ఉంటుంది. మిగిలిన వారికి రూ.10 టోకెన్ చార్జీ వసూలు చేస్తారు. ఈసీజీ, ఎక్స్‌రే, అల్ట్రా సౌండ్, సీటీ స్కాన్, ఇతర ముఖ్యమైన పరీక్షలకు నిర్ణీత రుసుం వసూలు చేయూలని నిర్ణరుుంచారు.

 మార్చి వరకు ఆగాల్సిందే..
 510 పోస్టుల భర్తీకి సంబంధించిన విషయాన్ని సూపరింటెండెంట్ ప్రస్తావించగా.. మార్చి వరకు ఈ అంశాన్ని వదిలేయాలని ఎంపీ అన్నారు. అందుబాటులో ఉన్న సిబ్బందితో పని చేయించుకోవాలని సూచించారు. కరెంటు సమస్యలు తీర్చేలా ట్రాన్స్‌కో అధికారులకు ఆదేశాలివ్వాలని కలెక్టర్‌కు సూచించారు. ఆస్పత్రిలో ఇన్ పేషెంట్ల సంఖ్య 680 ఉందని, ఎంసీహెచ్ బ్లాక్ ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్ కోరగా.. ఈ విషయమై కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌తో మాట్లాడతానని ఎంపీ చెప్పారు.

ఎస్‌ఎన్‌సీయూలో ప్రొప్స్, ల్యాంప్స్ కొరత ఉందని, రూ.50 వేలు అవసరమని చిన్నపిల్లల విభాగాపతి డాక్టర్ మల్లేశ్వరి తెలపగా.. తక్షణం కొనాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్‌ఎంఓ డాక్టర్ పద్మావతి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సీఆర్ రామసుబ్బారావు, జిల్లా అంధత్వ నివారణాధికారి డాక్టర్ కన్నేగంటి భాస్కర్, డీఎస్ మెంబర్ కొండమ్మ, హెచ్‌ఓడీలు డాక్టర్ యండ్లూరి ప్రభాకర్, డాక్టర్ కృష్ణవేణి, డాక్టర్ షెంషాద్ బేగం, రెడ్‌క్రాస్ ప్రతినిధి డాక్టర్ రామసుబ్బయ్య, ఆర్డీటీ డాక్టర్ సిరప్ప, తదితరులు పాల్గొన్నారు. కాగా.. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరిగిన ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరితో పాటు మేయర్ మదమంచి స్వరూప, జిల్లా మంత్రులు గైర్హాజరయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement