ఇటీవల ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదం అందరి హృదయాలను కలచివేసింది. ఇటువంటి సందర్భాలలో క్షతగాత్రులను రక్షించేందుకు రైల్వేశాఖ వద్ద ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటే బాగుండునని చాలామంది భావించారు. దీనికి సమాధానం రైల్వేశాఖ వద్ద ఏనాడో ఉంది.
ప్రపంచంలోనే తొలి హాస్పిటల్ ట్రైన్ భారత్ ఖాతాలో ఉంది. ఇది ఒక స్పెషల్ ట్రైన్. దీనిని భారతీయ రైల్వే కొన్ని ప్రత్యేక సందర్భాలలో వినియోగిస్తుంటుంది. ఈ రైలు ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అందుబాటులో ఆధునిక వైద్య పరికరాలు
భారతీయ రైల్వే ఈ ట్రైన్‌కు లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ అనిపేరు పెట్టింది. దీని ద్వారా భారతీయ రైల్వే దేశంలోని సుదూర ప్రాంతాలకు వైద్య సేవలను చేరువ చేస్తుంది. ఆసుపత్రులు లేని ప్రాంతాలకు, ఔషధాలు, వైద్యులు అందుబాటులో లేని ప్రాంతాలకు ఈ రైలు చేరుకుని వైద్య సేవలను అందిస్తుంది. ఈ రైలును ఆసుపత్రి మాదిరిగా డిజైన్ చేశారు. దీనిలో బాధితుల కోసం బెడ్‌లు ఉంటాయి. ఆధునిక వైద్య పరికరాలు కూడా ఉంటాయి. ఆపరేషన్ థియేటర్, మెడికల్ స్టాప్ ఉంటారు.
12 లక్షలమందికి వైద్య సేవలు
ఈ లైఫ్‌లైన్ ట్రైన్‌లోని ప్రతీ కోచ్‌లో పవర్ జనరేటర్, మెడికల్ వార్డు, ప్యాంట్రీకార్ మొదలైన ఏర్పాట్లు ఉంటాయి. ఈ రైలును భారతీయ రైల్వే 1991లో ప్రారంభించింది. ఈ రైలులోని అన్ని బోగీలలో ఏసీ సదుపాయం ఉంది. సులభంగా ఆసుపత్రులకు చేరుకోలేనివారిని దృష్టిలో ఉంచుకుని, వారికి వైద్య సేవలు అందించేందుకు ఈ రైలులో అన్ని సదుపాయాలు కల్పించారు. అలాగే దూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం సహాయం పొందలేనివారికి కూడా ఈ రైలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. భారతీయ రైల్వే బోర్డు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆసుపత్రి రైలు ఇప్పటివరకూ 12 లక్షలమంది బాధితులకు వైద్య సేవలు అందించింది.
ఇది కూడా చదవండి: భూమి లోతుల్లో మరో అద్భుత ప్రపంచం
Comments
Please login to add a commentAdd a comment