డెంగీపై కలెక్టర్ సీరియస్ | Serious collector on dengue | Sakshi
Sakshi News home page

డెంగీపై కలెక్టర్ సీరియస్

Published Mon, Jul 20 2015 2:45 AM | Last Updated on Thu, Mar 21 2019 8:19 PM

డెంగీపై కలెక్టర్ సీరియస్ - Sakshi

డెంగీపై కలెక్టర్ సీరియస్

- డీఎంఅండ్‌హెచ్‌వోపై తీవ్ర ఆగ్రహం
- హెల్ప్‌లైన్ సరిగాలేదని మండిపాటు
- ఎంపీహెచ్‌ఈవో సస్పెన్షన్‌కు ఆదేశాలు
చిత్తూరు (అర్బన్):
జిల్లాలో డెంగీ జ్వరాలు.. మరణాలపై వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ మండిపడ్డారు. డెంగీ జ్వరాల కోసం వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ను సరిగా అమలు చేయలేదని మల్టీపర్పస్ హెల్త్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (ఎంపీహెచ్‌ఈవో) కరుణాకరన్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో విష జ్వరాలు.. డెంగీ జ్వరాలు ప్రబలడంతో పలువురు చనిపోతున్నారని పత్రికల్లో కథనాలు వచ్చిన నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ, జిల్లా పంచాయతీ అధికారి, మునిసిపల్ అధికారులతో కలెక్టర్ ఆదివారం చిత్తూరులోని డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో విష జ్వరాలు తీవ్రమవుతున్న తరుణంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారని డీఎంఅండ్‌హెచ్‌వో కోటీశ్వరిని ప్రశ్నించారు.

దీనిపై డీఎంఅండ్‌హెచ్‌వో మాట్లాడుతూ పశ్చిమ మండలాల్లోని కొన్ని గ్రామాలను సందర్శించి, స్థానిక వైద్యులకు సూచనలు ఇచ్చానని చెప్పారు. ప్రజలకు జ్వరాలపై వచ్చే సందేహాలను నివృత్తి చేయడానికి హెల్ప్‌లైన్ నెంబరు సైతం ఏర్పాటు చేశానని తెలిపారు. అప్పటికే హెల్ప్‌లైన్ నెంబరు పనిచేయడంలేదని కలెక్టర్‌కు ఫిర్యాదు రావడంతో డీఎంఅండ్‌హెచ్‌వో ఎందుకు దీన్ని పర్యవేక్షించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీల్లో, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని వెంటనే శుభ్రం చేయించాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ప్రతిరోజూ చెత్త తొలగింపుపై అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలన్నారు. జిల్లాలో గత నెల రోజుల్లో ఎన్ని జ్వరాల కేసులు నమోదయ్యాయని డీఎంఅండ్‌హెచ్‌వో కోటీశ్వరిని ప్రశ్నించారు.

ప్రతి రోజూ నమోదవుతున్న జ్వరాల కేసులపై వెంటనే స్పందించాలన్నారు. దోమల నివారణకు వైద్యశాఖ అధికారులు ఫ్లెక్సీలు, బ్యానర్లు, కరపత్రాల ద్వారా ప్రచారం కల్పించాలన్నారు. వారంలో ఒక రోజు తప్పనిసరిగా ఎంపీహెచ్‌వోలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించాలన్నారు. జిల్లాలో ప్రధానంగా మదనపల్లె, పీలేరు, పుంగనూరు మండలాల్లో విష జ్వరాలు ఎక్కువగా వస్తుండటంతో ఎంపీహెచ్‌ఏలు, సూపర్‌వైజర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు పది రోజుల పాటు అక్కడ విధులు నిర్వర్తించాలన్నారు. ప్రతి గ్రామంలో ఇంటింటా తిరిగి జ్వరాలపై సర్వే చేసి నివేదిక ఇవ్వాలన్నారు. జిల్లా మలేరియా విభాగం అధికారి దోసారెడ్డి, చిత్తూరు కార్పొరేషన్ ఇన్‌చార్జ్ కమిషనర్ శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకరరావు పాల్గొన్నారు.
 
కార్మికులు సమ్మె విరమించాలి...
జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తుండడం వల్ల ఎక్కడి చెత్త కుప్పలు అక్కడే పేరుకుపోయాయని కలెక్టర్ పేర్కొన్నారు. దీనివల్ల దోమలు వ్యాప్తి చెంది ప్రజలకు విష జ్వరాలను కలుగచేస్తున్నాయన్నారు. వెంటనే విధుల్లోకి చేరాలని విజ్ఞప్తి చేశారు. రెగ్యులర్ పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరుకాకపోవడంపై చిత్తూరు ఇన్‌చార్జ్ కమిషనర్ శ్రీనివాసరావుపై అసహనం వ్యక్తం చేశారు. వారికి షోకాజు నోటీసులు జారీ చేయాలని చెప్పారు.
 
మునిసిపాలిటీల్లో అదనపు సిబ్బంది తీసుకోండి
జిల్లాలోని అన్ని గ్రామాలతో పాటు మునిసిపాలిటీల్లో  పారిశుద్ధ్యం మెరుగు పడాలని కలెక్టర్ సిద్ధార్థ్థ్‌జైన్ ఆదేశించారు. చిత్తూరు కలెక్టరేట్ నుంచి ఆయన జిల్లాలోని మునిసిపల్ కమిషనర్లు, ఆర్డీవోలు,  వైద్యాధికారులు, పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మునిసిపల్ కార్మికులు సమ్మెలో ఉన్న నేపథ్యంలో వాళ్లను ఒప్పించి విధులకు హాజరయ్యేలా చూసే బాధ్యత ఆయా ఆర్డీవోలదేనన్నారు. సిబ్బంది అంగీకరించని పక్షంలో అదనపు సిబ్బందిని తెప్పించుకుని పారిశుద్ధ్య పనులు చేయించాలన్నారు.

జ్వరాలపై అశ్రద ్ధ చేయకుండా గ్రామాల్లో వైద్య శిబిరా లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇక రుయా, స్విమ్స్, వేలూరులోని సీఎంసీ ఆసుపత్రిల్లో ఆరోగ్యమిత్రలను ఏర్పాటు చేసి విషజ్వరాలతో వచ్చే జిల్లా వాసుల వివరాలు, వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్చవేక్షించాలన్నారు. వసతి గృహాల్లో సైతం విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రిన్సిపాళ్లను వైద్యాధికారులు అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చిత్తూరు, తిరుపతి ఆర్డీవోలు, మదనపల్లె సబ్ కలెక్టర్ పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో డీఎంఅండ్‌హెచ్‌వో కోటీశ్వరి, డీపీవో ప్రభాకరరావు, బీసీ సంక్షేమ శాఖాధికారి రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement