నిధులున్నా ఆసుపత్రుల అభివృద్ధిలో అలక్ష్యమా?
► సమీక్షా సమావేశంలో
► అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
విజయవాడ: ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్న లక్ష్యంతో పెద్దయెత్తున నిధులు విడుదల చేస్తున్నా అధికారులు వాటిని సక్రమంగా వినియోగించుకోకపోవడంపై జిల్లా కలెక్టర్ ఎ.బాబుఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఆసుపత్రుల అభివృద్ధి కోసం రూ. 1.40కోటికిపైగా నిధులను ప్రభుత్వం విడుదల చేస్తే ఆ నిధులను ఖర్చు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం జిల్లా ఇన్నోవెంట్ ఫండ్స్ ద్వారా 11 ఆసుపత్రుల్లో సివిల్, వైద్య పరికరాల కోసం విడుదల చేసిన నిధుల వ్యయంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుపేదలు వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తారని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించడం కనీస బాధ్యతగా గుర్తెరిగి పనిచేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆధ్యర్యంలో ఉన్న ఆవిష్కరణ నిధులు కింద వివిధ పనులు చేపట్టేందుకు నిధులు అందుబాటులో ఉంటాయని వాటిని ఆస్పత్రుల అభివృద్ది కోసం ఖర్చు చేయటానికి ప్రతిపాదనలు కోరినట్లు చెప్పారు. ఆయా ఆస్పత్రుల పర్యవేక్షకుల ద్వారా వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి అందుకు అనుగుణంగా నిధులను విడుదల చేశామన్నారు. జిల్లా స్థాయిలో విడుదల చేసిన నిధులను జిల్లా పర్చేజింగ్ కమిటీ ఆధ్వర్యంలో హాస్పటల్స్ పర్యవేక్షకులు, సమన్వయశాఖల అధికారులు ఒక కమిటీగా ఏర్పడి నిధులను ఖర్చు చేయాలని గతంలో స్పష్టం చేశామన్నారు. ఆసుపత్రులు పంపిన ప్రతిపాదనలకు అనుగుణంగా నిధులను మంజూరు చేస్తే వాటిని ఏపీఎంఐసీకి ఎలా బదిలీ చేస్తారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
11 ఆసుపత్రులకు నిధులు మంజూరు
మచిలీపట్నం ఆసుపత్రి సర్వీసెస్ కింద రూ. 26లక్షలు, విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజికి 2 ఆపరేషన్ టేబుల్స్, ఇతర పనుల కోసం రూ. 23 లక్షలు, విజయవాడ గవర్నమెంట్ హాస్పటల్‌లో 24 పనుల కోసం రూ. 47.57లక్షలు విడుదల చేశామని కలెక్టర్ తెలిపారు. మచిలీపట్నం జిల్లా హాస్పటల్‌లో 9 పనుల కోసం రూ.13.88లక్షలు, గుడివాడ ఏరియా హాస్పటల్‌లో 9 పనుల కోసం రూ. 7.5లక్షలు, అవనిగడ్డ, మైలవరం పీహెచ్‌సీ, నూజివీడు ఏరియా ఆస్పత్రులలో 9 పనుల కోసం రూ.14 లక్షలు చొప్పున నిధులు విడుదల చేశామని కలెక్టర్ వెల్లడించారు.
తిరువూరు ఏరియా ఆసుపత్రిలో 9పనుల కోసం రూ.6లక్షలు, నందిగామ ఏరియా ఆస్పత్రిలో 8 పనుల కోసం రూ. 5లక్షలు, ఉయ్యూరు పీహెచ్‌సీలో 7 పనుల కోసం రూ.1.76 లక్షలు విడుదల చేశామన్నారు. ఈ పనులను నిర్లక్ష్యం చేస్తే సహించేదిలేదని కలెక్టర్ హెచ్చరించారు. సమావేశంలో విజయవాడ గవర్నమెంట్ హాస్పటల్ సూపరింటెండెంట్ ఎం. జగన్మోహన్, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ పర్యవేక్షకులు ఆర్.శశాంక్, కేంద్ర సర్వీస్‌కు చెందిన జిల్లా డెవలప్‌మెంట్ అధికారి అనంతకృష్ణ, ప్రభుత్వాస్పత్రి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆర్. ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.