ఆరోగ్యశ్రీ కార్డులన్నీ తొలగిస్తాం: మంత్రి కామినేని
హైదరాబాద్: రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరును మార్చి త్వరలోనే కొత్త పేరు ఖరారు చేస్తామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న కార్డులన్నింటినీ తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని ఇస్తామని చెప్పారు. అలాగే ఈ పథకంలో రూ. 2 లక్షల ప్యాకేజీని పెంచాలన్న ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. మంత్రి బుధవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ కింద ప్రస్తుతం 938 చికిత్సలు లభిస్తున్నాయని.. వాటిని కూడా పెంచుతామని పేర్కొన్నారు.
ఆగస్ట్ 15న ప్యాకేజీ పెంపు, చికిత్సల పెంపుపై సీఎం ప్రకటన చేస్తారని తెలిపారు. జర్నలిస్టులకు కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తామన్నారు. సెప్టెంబర్ ఒకటి నుంచి ఉద్యోగులకు హెల్త్ కార్డులు జారీ చేస్తామని మంత్రి కామినేని తెలిపారు. జర్నలిస్టులకూ హెల్త్ కార్డులు ఇచ్చే ఆలోచన ఉన్నట్టు మంత్రి వివరించారు.