హెల్త్ కార్డులొద్దు ‘భద్రత’ ఇవ్వండి!
డీజీపీ రాముడికి రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం విజ్ఞప్తి
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇస్తున్న హెల్త్ కార్డుల కంటే పోలీసు విభాగంలో అమలులో ఉన్న ‘భద్రత’ పథకాన్నే తమకు కొనసాగించాలని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం(పీవోఏ) కోరింది. ఈ మేరకు హెల్త్ కార్డుల పథకం నుంచి పోలీసులను మినహాయించేలా ప్రయత్నించాలని డీజీపీ రాముడికి సంఘం విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్లోని ఏపీ డీజీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో సంఘం ప్రతినిధులు పలు కీలకాంశాలపై డీజీపీతో చర్చించారు.
‘భద్రత’ను విస్తరించి ఉద్యోగి తల్లిదండ్రులకూ దీనిని వర్తింపజేయాలని కోరారు. సిబ్బందికి వారాంతపు సెలవు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు విభాగంలో ఖాళీలను భర్తీ చేయాలన్నారు. డెరైక్ట్ ఎస్సైల మాదిరిగా పదోన్నతులు పొందిన వారికీ ప్రాధాన్యమిస్తూ స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా నియమించాలన్నారు. పరిష్కారానికి కృషి చేస్తానని డీజీపీ హామీ ఇచ్చారు.