అంతా మీ కళ్ల ముందే..!
పారదర్శకతకు పెద్దపీట వేసిన వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌చందా
తన చాంబర్లో సీసీ కెమెరా ఏర్పాటు.. ఇంటర్నెట్తో అనుసంధానం
ఎవరిని కలిసినా, ఏం మాట్లాడినా అంతా నిక్షిప్తం
ఇంటర్నెట్ ద్వారా ఎక్కడినుంచైనా గమనించొచ్చు
హైదరాబాద్: సురేశ్‌చందా.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి. సచివాలయంలోని ‘డి’ బ్లాక్ రెండో అంతస్తులోని ఆయన చాంబర్లోకి ప్రవేశించగానే కొట్టొచ్చినట్లుగా సీసీ కెమెరా కనిపిస్తుంది. ఆయన వద్దకు ఎవరు వెళ్లినా ఆ కెమెరాలో రికార్డయిపోతుంది.
అంతేకాదు ఎప్పుడైనా, ఎవరైనా ఆ కెమెరాలోంచి ఆ చాంబర్‌ను పరిశీలించే ఏర్పాటూ ఉంటుంది. ఇది ప్రభుత్వ ఆదేశాలతో ఏర్పాటు చేసిన కెమెరా కాదు. పాలనలో పారదర్శకత కోసం స్వచ్ఛం దంగా సురేశ్‌చందానే ఆ సీసీ కెమెరాను ఏర్పాటు చేయించుకున్నారు.
ఒక సీనియర్ ఐఏఎస్ ఇలా తన చాంబర్లోనే సీసీ కెమెరా ఏర్పాటు చేయించుకోవడం చర్చనీయాంశమైంది. సురేశ్‌చందా దీని గురించి చెబుతూ.. ‘‘కేరళ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో ఒకరు తన చాంబర్లో ఇలాగే సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్నారు. ఆయనే నాకు ఆదర్శం. అవినీతి అక్రమాల నిరోధానికి పారదర్శకత ప్రాణం వంటిది. ప్రజా వ్యవహారాలకు సంబంధించి ఎవరు వచ్చి ఏం మాట్లాడినా రహస్యమంటూ ఏదీ ఉండకూడదనే ఈ ఏర్పాటు..’’ అని చెప్పడం గమనార్హం. ఆయన చాంబర్‌కు వచ్చే వారందరితోనూ ఆయన జరిపే చర్చలు, సమావేశాలు అన్నీ ఆ కెమెరాలో నిక్షిప్తమై ఉంటాయి.
ఎవరైనా చూడొచ్చు..
సురేశ్‌చందా ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరా ఐపీ (ఇంటర్నెట్ ప్రొటోకాల్) అడ్రస్ కలిగి ఇంటర్నెట్తో అనుసంధానమై ఉంటుంది. కెమె రా, సంబంధిత సాఫ్ట్వేర్ ధర దాదాపు రూ.7 వేలు. అన్ని కోణాల్లో తిరిగేలా కెమెరా ఏర్పాటు ఉంటుంది. ఆయన చాంబర్లో ఏం జరుగుతుందనే దానిని ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ కలిగి ఉన్నవారు తమ కంప్యూటర్ లేదా సెల్‌ఫోన్ ద్వారా చూడొచ్చు.
24 గంటల పాటు సీసీ కెమెరా దృశ్యాలను నిల్వచేయడానికి ఒక జీబీ సామర్థ్యం ఉంటే సరిపోతుంది. ‘‘ఎనిమిదేళ్లుగా నేను ఎక్కడ పనిచేసినా ఇటువంటి ఏర్పాటు చేసుకునేవాడిని..’’ అని సురేశ్ చందా చెప్పారు. అంతేకాదు తాను నోట్‌ఫైల్ చేసిన ఫైళ్లను కూడా తక్షణమే ఇంటర్నెట్లో పెడుతుంటారు. ‘‘ఆర్టీఐ చట్టం వచ్చాక ఏదీ రహస్యం కాదు. ఎవరు ఎప్పుడు ఏది అడిగినా నిర్ణీత కాలంలో సమాచారం ఇస్తు న్న నేపథ్యంలో ఎవరూ అడగకుండానే సమాచారం అం దరికీ అందుబాటులో ఉంచ డం మరింత పారదర్శకత అవుతుంది..’’ అని చెబుతున్నారాయన.
గాంధీ ఆసుపత్రిలో..
హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలోనూ 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సురేశ్‌చందా రంగం సిద్ధం చేశారు. ఆ ఆసుపత్రిని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆయన యోచిస్తున్నారు. పారిశుద్ధ్యం, వైద్యుల రాకపోకలు, వైద్య సేవలు సక్రమంగా అందించడం కోసం రూ.30 లక్షలతో ఐపీ కలిగిన 200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. వీటికోసం రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా టెండర్లు పిలవాల్సిందిగా ఆదేశించారు కూడా. ‘‘అక్కడికి వెళ్లి రోజూ పర్యవేక్షించడం కష్టం.
అదే సీసీ కెమెరాలు ఉంటే సచివాలయంలోని నా కంప్యూటర్, మొబైల్ ద్వారా కూడా పర్యవేక్షించవచ్చు. తద్వార ఆస్పత్రిలో వైద్యసేవలు మరింత మెరుగ్గా అందుతాయి..’’ అని సురేశ్‌చందా పేర్కొన్నారు. ఇలా వైద్య ఆరోగ్య శాఖలోని వివిధ విభాగాల్లోనూ, కోఠిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, వైద్యవిద్యా విభాగం వంటి వాటిల్లోనూ సీసీ కెమెరాలు పెట్టే యోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.