ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన పెంచాలి
- వైద్యశాఖ జేడీ డాక్టర్ రాజేంద్రప్రసాద్
నెల్లూరు(అర్బన్) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందిస్తున్న వైద్య సౌకర్యాలు, ఆరోగ్య సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలని జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ అన్నారు. స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయంలో గురువారం జిల్లాలోని అన్ని పీహెచ్సీల పరిధిలో ఉన్న సూపర్వైజర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సూపర్వైజర్ తనకు కేటాయించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఉప కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. ఏఎన్ఎం అందిస్తున్న సేవలు, రికార్డులు క్రాస్ చెక్ చేయాలని కోరారు. ఉప కేంద్రాల్లో అత్యవసర మందులను సిద్ధంగా ఉంచాలని కోరారు. ఆన్లైన్ సేవలపై ఏఎన్ఎంలకు అవగాహన పెంచాలని కోరారు. 35 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు స్క్రీనింగ్ పరీక్షలు చేయించాలని కోరారు. బీపీ, థైరాయిడ్ పరీక్షలు తప్పనిసరిగా చేయించాలన్నారు. సీటీ స్కానింగ్, డయాలసిస్ సేవలు లభించే ఆస్పత్రుల వివరాలు తెలపాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ వరసుందరం, డాక్టర్ రమాదేవి, డీటీసీఓ సురేష్కుమార్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఈదూరు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు