కూతురిపై ప్రేమతో... ఆమె పోస్టే విరుద్ధం..
వడ్డించేవాడు మనవాడైతే కడబంతిలో కూచున్నా... విందు భోజనం అన్నది సామెత. అధికారాన్ని అడ్డం పెట్టుకుని... అవకాశాన్ని ఆసరాగా మలచుకుని... నిబంధనలు పక్కన పెట్టి... ప్రభుత్వ సూచనలు బేఖాతరు చేస్తూ వ్యవహరించిన జిల్లా పూర్వ వైద్యారోగ్యశాఖాధికారి ఇప్పుడు విచారణను ఎదుర్కొనాల్సి వస్తోంది. అర్హతలేకుండా అడ్డగోలుగా డిప్యుటేషన్ వేసి... సొంత కూతురినే స్థాయికి మించి అందలాన్ని ఎక్కించి... ఇప్పుడు చిక్కుల్లో పడాల్సి వచ్చింది. మొదటినుంచీ విమర్శలకు తావిచ్చిన ఈ వ్యవహారం తాజాగా మళ్లీ చర్చనీయాంశమైంది.
సాక్షిప్రతినిధి, విజయనగరం: జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిగా గతంలో పనిచేసిన డాక్టర్ విజయలక్ష్మి గిరిజన ప్రాంత పీహెచ్సీ అయిన తోణాంలో వైద్యాధికారిగా పనిచేస్తున్న తన కుమార్తెను తీసుకువచ్చి విజయనగరం మున్సిపల్ హెల్త్ ఆఫీసర్‌గా నియమించారు. కుమార్తెపై ఉన్న ప్రేమతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా ఆమె తీసుకున్న ఇలాంటి నిర్ణయాలు అప్పట్లోలోనే ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను నివ్వెరపోయేలా చేశాయి. అప్పట్లో ఆమె వ్యవహరించిన విధానంపై తాజాగా విచారణ మొదలైంది. అన్ని డిప్యూటేషన్లూ రద్దు చేయమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇంకా వైద్య ఆరోగ్యశాఖలో మాత్రం కొనసాగుతున్నాయి. అందులోనూ గిరిజన ప్రాంతం నుంచి విజయనగరం మున్సిపల్ హెల్త్ ఆఫీసర్‌గా వేసిన డిప్యుటేషన్ కూడ ఇంకా రద్దు చేయకపోవడం చర్చనీయాంశమైంది.
ఆమె పోస్టే విరుద్ధం..
పూర్వ డీఎంహెచ్ఓ పోస్టును గత తెలుగుదేశం ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టింది. సివిల్ సర్జన్ స్పెషలిస్టును డీఎంహెచ్‌ఓగా నియమించాలి. కాని డిప్యూటీ సివిల్సర్జన్కు డీఎంహెచ్ఓ పోస్టు ను కట్టబెట్టారు. సివిల్ సర్జన్ స్పెషలిస్టులున్నప్పటికీ అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇష్టానుసారం నియామకం చేపట్టింది. ఇటీవల ఆమెను పాత స్థానంలోకి పంపించి, విజయనగరం జిల్లాకు వేరే అధికారిణిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలు..
జిల్లా ఇన్చార్జ్ వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా పనిచేసిన డాక్టర్ విజయలక్ష్మి ఇష్టానుసారంగా వ్యవహరించి, పలు అవకతవకలకు పాల్పడ్డారని మెడికల్ హెల్త్, ఎంప్లాయిస్ యూనియన్ నేతలు, ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు హెల్త్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఈ నెల 29 వ తేదిన విచారణ జరగనుంది. ఉద్యోగ నియామకాలతో పాటు, డిప్యూటేషన్లు, ఫర్నిచర్ కొనుగోలు, కరపత్రాల ముద్రణ వంటి అనేక కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ఆక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి.
పీహెచ్సీ నుంచి ఎంహెచ్‌ఓగా...
సాలూరు మండలం తోణాం పీహెచ్సీ వైద్యురాలిగా ఉన్న తన కుమార్తె ప్రణీతను డిప్యూటేషన్‌పై విజయనగరం మున్సిపల్ హెల్త్ ఆఫీసర్‌గా వేశారు. ఈ వ్యవహారం అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చింది. అయినప్పటికీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి హోదాలో ఉన్న ఆమెను ప్రశ్నించే సాహసం ఎవరూ చేయలేదు. నిబంధనల ప్రకారం గిరిజన ప్రాంతంలో ఉన్న వైద్యులను మైదాన ప్రాంతానికి డిప్యూటేషన్ వేయకూడదు. అవసరం అనుకుంటే మైదాన ప్రాంతంలో ఉన్నవారినే గిరిజన ప్రాంతానికి డిప్యూటేషన్ వేయవచ్చు. కాని అవేవీ విజయలక్ష్మి పట్టించుకోలేదు. మరో విషయం ఏంటంటే... నిజానికి ప్రణీత తొలుత తాత్కాలిక ఉద్యోగినిగానే వైద్యారోగ్యశాఖలో ప్రవేశించారు. అనతి కాలంలోనే తల్లి అండతో తన ఉద్యోగాన్ని పదిలం చేసుకున్నారు.
తోణాం పీహెచ్‌సీకి ఇన్చార్జ్ వైద్యులే దిక్కు..
24 గంటలూ పనిచేయాల్సిన తోణాం పీహెచ్‌సీకి ఇప్పుడు ఇన్చార్జ్ వైద్యుడే దిక్కుయ్యారు. ఒక వైద్యురాలు ప్రసూతి సెలవులో వెళ్లారు. అక్కడి నుంచి డిప్యూటేషన్‌పై మున్సిపల్ హెల్త్ ఆఫీసర్‌గా వచ్చిన ప్రణీత ఇంకా మున్సిపాలిటీలోనే కొనసాగుతున్నారు.
ప్రభుత్వం మాట పెడచెవిన..
గిరిజన ప్రాంతాల్లో వైద్యులుగా, ఫార్మసిస్టులుగా, ల్యాబ్ టెక్నీషియన్లుగా ఏళ్లతరబడి దాదాపు 50 మంది వరకు పనిచేస్తున్నారు. మైదాన ప్రాంతాలకు రావడానికి వారు చాలా ప్రయత్నాలు చేశారు. నిబంధనలు అంగీకరించక అక్కడే పనిచేస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారే తలుచుకోవడంతో అసాధ్యం కాస్తా సుసాధ్యం అయ్యింది. కుమార్తె మైదాన ప్రాంతానికి చేరింది. మరోవైపు డిప్యూటేషన్లు అన్నీ రద్దు చేయమని ప్రభుత్వం చెప్పినప్పటికీ వైద్య ఆరోగ్యశాఖ, వైద్య విధాన్ పరిషత్తుల్లో ఇంకా డిప్యూటేషన్లు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను సైతం కొందరు అధికారులు తమ స్వార్ధం కోసం పెడచెవిన పెడుతున్నారు.
విచారణ చేపడతాం..
మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డిప్యూటేషన్‌పై కొనసాగుతున్న విషయం తెలియదు. నేను వచ్చి కొద్ది రోజులే అయ్యింది. ఫైల్ తెప్పించుకుని విచారణ చేస్తాం. డిప్యూటేషన్ పైనే కొనసాగుతున్నట్లయితే చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ ఎస్.వి.రమణకుమారి, డీఎంఅండ్‌హెచ్‌ఓ, విజయనగరం