వైకల్య నివారణ కీలకం
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆరోగ్యరంగానికి ఇచ్చే ప్రాధాన్యతాంశాల్లో వైకల్య నివారణ, వైకల్యం బారిన పడిన వారికి అందించాల్సిన ఆరోగ్యం ఎజెండాగా ఉండాలని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(ఐఐపీహెచ్) అధ్యక్షుడు డా.శ్రీనాథ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ‘ఇంప్రూవింగ్ ద హెల్త్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజెబులిటీ’ అన్న అంశంపై ఆదివారమిక్కడ సీఆర్ రావ్ ఇన్స్టిట్యూట్లో జరిగిన అంతర్జాతీయ సింపోజియంలో ఆయన ప్రసంగించారు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్(అంటువ్యాధులు కాని మధుమేహం, రక్తపోటు) తదితర వ్యాధుల ద్వారా ఎంతోమంది వైకల్యానికి గురవుతున్నారని, ఈ వ్యాధులను నియంత్రించాల్సిన అవసరముందని అన్నారు.
రక్తపోటు వల్ల ఎంతోమంది పెరాలసిస్ స్ట్రోక్‌కు గురై శాశ్వత వైకల్యంలోకి వెళుతున్నారని, వీరు తిరిగి పూర్వపు జీవితాన్ని పొందేలా కృత్రిమ యంత్రాలు ఇవ్వాలని, వీరికి ప్రభుత్వపరంగా ఆదరణ కల్పించాలని ఆయన సూచించారు. దేశవ్యాప్తంగా ఈ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు చేపట్టి.. ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు. వైకల్య నివారణకు అధిక ప్రాధాన్యతనివ్వడంతోపాటు దీనిపై తగినంతగా పరిశోధనలు జరగకపోవడానికి కారణాలు కనుక్కోవాలన్నారు. దీనిపై శాస్త్రవేత్తలు, వైద్యులు దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వాలు సైతం వైకల్య నివారణపై ప్రత్యేక విధానాన్ని ప్రకటించాలని ఆయన సూచించారు.