కరీంనగర్‌ను రోగరహిత నగరంగా చేస్తాం
ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్
కరీంనగర్‌హెల్త్ : కరీంనగర్‌ను రోగరహిత నగరంగా మార్చాలని రాష్ట్ర పౌర, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో స్మార్ట్సిటీపై ఆదివారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే స్మార్ట్‌సిటీ ముఖ్య ఉద్దేశమన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే అర్బన్ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది పేదలున్నారని, వీరంతా ఎక్కవగా మురికి వాడల్లో నివసిస్తున్నారన్నారు. కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీగా రూపొందించడంలో భాగంగా వైద్యులు తగిన సూచనలు, సలహాలందించి సహకరించాలన్నారు. ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ స్మార్ట్‌సిటీ చాలñ ంజ్లో చేరేందుకు అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. రానున్న మూడేళ్లలో కరీంనగర్ సమీపంలో ఏయిర్పోర్టు నిర్మాణం చేస్తామన్నారు. ఐదేళ్లలో వెయ్యి కోట్లు ఖర్చుచేయాల్సి ఉందని, అభివృద్ధి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. కరీంనగర్ పరిసర ప్రాంతాల్లోని అన్ని రహదారులను జాతీయ రహదారులుగా మార్చనున్నట్లు పేర్కొన్నారు. ఉజ్వల పార్కు లేదా శాతవాహన విశ్వవిద్యాలయం స్థలంలో బృందావన్ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కరీంనగర్‌ను విద్య, వైద్యానికి కేంద్రంగా తయారుచేస్తామని, బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయడమే తమ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, నగరపాలక సంస్థ కమిషనర్ కృష్ణభాస్కర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, కార్పొరేటర్ వై.సునీల్‌రావు, ఐంఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ కిషన్, డాక్టర్ ఎల్. రవికాంత్, వైద్యులు భూంరెడ్డి, విజయలక్ష్మి, రఘురామన్ తదితరులు పాల్గొన్నారు.