స్టెంట్ ధర వివాదం : ప్రైవేట్ ఆస్పత్రిపై ఫిర్యాదు
ఎల్బీనగర్: హృద్రోగులకు ఊరట నిచ్చేలా స్టెంట్ల ధరలు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న బాధితులు దోపిడీకి గురవుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఘరానా మోసంపై ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు నమోదైంది.
బాధితుల వివరాల ప్రకారం...విజయపురికాలనీకి చెందిన డోకూరు ప్రభాకర్‌రెడ్డి తల్లి సరోజ ఈ నెల 13వ తేదీన ఎల్బీనగర్ గ్లోబల్ ఆసుపత్రిలో గుండె సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో చేరింది. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం గుండె ఆపరేషన్లు చేయాలని అందుకు గాను రూ.5 లక్షలు ఖర్చు అవుతాయని చెప్పారు. రూ.5 లక్షలకు సంబంధించిన యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన ఇన్సూరెన్స్ కార్డును సంబంధిత ఆసుపత్రి యాజమాన్యానికి ఖర్చుల నిమిత్తం క్లెయిమ్ చేసుకునేందుకు అంగీకారం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. దానికి గ్లోబల్ యాజమాన్యం 13వ తేదీన గుండె ఆపరేషన్ చేసి రూ.2,63,667ల బిల్లును ఇన్సూరెన్స్ ద్వారా క్లెయిమ్ చేసుకున్నారు. ఆపరేషన్ తరువాత 18వ తేదీన డిశ్చార్జ్ చేయాలని మెమో ఇచ్చారు.
( చదవండి : స్టెంట్ల ధరలు 85 శాతం తగ్గింపు )
తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్టంట్ల ధర ప్రకారం ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదని ఇంకా రూ.1, 19,090 చెల్లించాలని లేకపోతే, సరోజను డిశ్చార్జ్ చేయమని ఆసుపత్రి సిబ్బంది తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీ, ఆసుపత్రి యాజమాన్యం డిశ్చార్జ్ చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రభాకర్‌రెడ్డి వాపోయాడు. రూ.5 లక్షల ఇన్సూరెన్స్ విలువ గల కార్డును ఆసుపత్రి యాజమాన్యానికి ఇచ్చామని ఆపరేషన్‌కు సంబంధించిన వైద్య ఖర్చులను క్లెయిమ్ చేసుకునే బాధ్యత వారిదేనని అలాంటప్పుడు తమపై అదనపు భారం వేయడం ఎంతవరకు సబబు అని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. గ్లోబల్ ఆసుపత్రి యాజమాన్యం వారు వేధింపులకు గురిచేస్తున్నారని తక్షణం వీరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. ఆసుపత్రి యాజమాన్యం, ఇన్సూరెన్స్ కంపెనీలపై కేసులు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు.